ప్రవక్త మూసా (అలై) అల్లాహ్తో నేరుగా మాట్లాడారు కాబట్టి ఆయన్ను ‘మూసా కలీముల్లాహ్’ అని పేర్కొన్నది ఖురాన్. ఒకానొకసారి మూసా (అలై) అల్లాహ్తో మాట్లాడేందుకు తూర్ పర్వతం వైపునకు వెళ్లబోతుండగా ఓ వ్యక్తి అడ్డుపడి “మూసా! నేను చాలా దారిద్య్రంలో ఉన్నాను. నా దరిద్రాన్ని తొలగించమని అల్లాహ్కు చెప్పండి” అని విన్నవించాడు. సరేనని ఆయన ముందుకు వెళ్లారు. అంతలోనే ఇంకో వ్యక్తి తారసపడి “ఓ మూసా నా దగ్గర ఎన్నో ఆస్తులు పోగయ్యాయి. సిరిసంపదలు లెక్కకు మించి వచ్చి చేరుతున్నాయి. ఇకచాలు, అల్లాహ్కు చెప్పి వాటిని ఆపివేయించు” అని చెప్పాడు. ప్రవక్త (అలై) సరేనని ఇద్దరి స్థితిని అల్లాహ్కు వివరించారు. దానికి అల్లాహ్ “మొదటి వ్యక్తితో నాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండమని చెప్పు. రెండో వ్యక్తితో నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానుకోమని చెప్పు” అని చెప్పి పంపించారు. మూసా మొదటి వ్యక్తి దగ్గరికొచ్చి “అల్లాహ్ నిన్ను విరివిగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉండమని చెప్పాడు” అన్నారు. దానికా వ్యక్తి అల్లాహ్ నాకేమిచ్చాడని నేను కృతజ్ఞతలు తెలపాలని అడిగాడు. అంతోనే పెద్ద గాలి దుమారానికి అతని ఒంటిమీద ఉన్న దుప్పటి కొట్టుకుపోయింది. నగ్నంగా మారిపోయాడు.
ఇక రెండో వ్యక్తి దగ్గరికి వెళ్లి ‘అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపడం మానుకో’ అని చెప్పాడు. దానికా వ్యక్తి “అల్లాహ్కు కృతజ్ఞతలు తెలపడం మానుకోవడమన్నది నా వల్ల కాదు. నాకు ఇన్నిన్ని అనుగ్రహాలు ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలపకుండా ఎలా ఉండను’ అన్నాడు. దీంతో ఆయన మరింత సంపన్నుడిగా మారాడు. “మీరు గనక కృతజ్ఞులైతే, నేను మిమ్మల్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహిస్తాను. ఒకవేళ కృతఘ్నతకు పాల్పడితే నా శిక్ష చాలా కఠినంగా ఉంటుంది” (17:7) అని ఖురాన్ వివరిస్తుంది. అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాల పట్ల నిత్యం ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి. ‘మనం చేస్తున్న ఈ చిన్న ఉద్యోగమే ఎంతోమంది నిరుద్యోగుల కల అని మర్చిపోకూడదు. మనకు చూడటానికి రెండు కళ్లూ ఇచ్చాడు. ఎంతోమంది కళ్లు లేనివారు అంధకారంలో జీవిస్తున్నారు. మన దగ్గర రెండు చేతులున్నాయి. రెండు చేతులూ లేనివారెందరో దీనంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. రెండు కాళ్లు లేని వాళ్లు అవిటితనంతో జీవితాన్ని లాక్కెళుతున్నారు. ఆత్మసంతృప్తితో, కృతజ్ఞతాభావంతో జీవిస్తే అంతకుమించిన సంతోషాలు ఇంకెక్కడా దొరకవన్నది ఖురాన్ సందేశం.