అదో బజారు. ఉదయం తొందరగా దుకాణాలు తెరుస్తున్న వ్యాపారులు, పనికి వెళ్తున్న కార్మికులతో అక్కడంతా కోలాహలంగా ఉంది. ఒక వృద్ధుడు తన చిన్న దుకాణం తాళం తీస్తుండగా, ఎదురుగా నడుస్తూ వచ్చిన యువకుడు చిరునవ్వుతో పలికాడు.. ‘అస్సలామ్ అలైకుమ్’. ఆ వృద్ధుడు వెంటనే తలెత్తి చూశాడు! ఆ పెద్దాయన ముఖంలో అలసట క్షణాల్లో మాయం అయింది. ‘వ అలైకుముస్సలామ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అని ఆనందంగా సమాధానం ఇచ్చాడు. ఆ క్షణంలో ఇద్దరి హృదయాలు దగ్గరయ్యాయి. అపరిచితులైన వారిద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ ముందుకు సాగారు. ఒక చిన్న పలకరింపు.. ఇంత పెద్ద ప్రభావం చూపుతుంది. ఇదే సలామ్ మహిమ. ‘అస్సలామ్ అలైకుమ్’ అంటే కేవలం ఒక అభివాదం కాదు. అది శాంతి, కరుణ, రక్షణ కోసం చేసే దువా. ముస్లింల మధ్య బంధాన్ని బలపరచడానికి అల్లాహ్ ఇచ్చిన ప్రత్యేక బహుమతి.
‘మీరు ఒకరినొకరు ప్రేమించాలనుకుంటే, మీ మధ్య సలాం విస్తరించండి. ఈ ఉపదేశం సూటిగా మనసులోకి దిగుతుంది. ఎందుకంటే సలామ్ అనేది ఈర్ష్య, అసూయలను తొలగించే ఓ ఔషధం లాంటిది’ అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స.అ.వ). ప్రస్తుతమున్న హడావుడి జీవితాల్లో ఒకరినొకరు చూడకుండానే దాటిపోతున్నాం. కానీ, ఒక మధురమైన సలామ్ హృదయాల్లో స్నేహం నింపుతుంది, సమాజంలో ఐక్యత పెంచుతుంది, అల్లాహ్ కరుణకు అర్హుల్ని చేస్తుంది. అందుకే సలాం అనేది మాట మాత్రమే కాదు.. అది ఒక ఇస్లామీయ గుర్తింపు, ఒక స్నేహబంధానికి పునాది, స్వర్గానికి మార్గం. కాబట్టి ఎక్కడైనా ముస్లింలను కలిసినప్పుడు ‘అస్సలామ్ అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ అని మనస్ఫూరిగా పలకండి.