తిరుమల: కలియుగ వైకుఠం తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంలో వచ్చే నెల 4 నుంచి పవిత్రోత్సవాలు (Pavithrotsavalu) జరుగనున్నాయి. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున మూడు రోజుల పాటు శ్రీవారి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఎందుకంటే సంవత్సరంలో ప్రతిరోజూ శ్రీవారి దేవాలయంలో జరిగే పూజలు, అర్చనలు, ప్రత్యేక ఆరాధన సమయంలో భక్తుల నుంచి గానీ, తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సిబ్బంది గానీ కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల శ్రీవారి దేవాయలయానికి ఉన్న పవిత్రతకు ఏదైనా లోపం జరిగే అవకాశం ఉంది. అందుకే ప్రతి ఏటా ఇలాంటి దోషాలన్నీ తొలగిపోవాలని.. ఆగమ శాస్త్రంలోని నియమాలను అనుసరించి పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆగస్టు 4 నుంచి 7 వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. మొదటిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండోరోజు పవిత్ర సమర్పణ, మూడోరోజు పూర్ణాహుతి ఉంటుంది.
తిరుమలలో ఈ ఉత్సవాలను 1463లో తొలిసారిగా సాలువ మల్లయ్య దేవరాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. 15-16వ శతాబ్దాల్లో ఈ ఉత్సవాలు జరిగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. అయితే 1962 నుంచి టీటీడీ ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. పవిత్రోత్సవాల వేళ మూడు రోజుల పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాలను తిరుమంజనం చేస్తారు. అలాగే హోమం కూడా నిర్వహిస్తారు. సాయంకాలం సంధ్యా వేళలో స్వామివారి విగ్రహాలకు ప్రత్యేక ఆభరణాలతో అలంకరిస్తారు. అదే సమయంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారు తిరుమల మాఢ వీధుల్లో విహరించి భక్తులందరికీ దర్శనమిస్తారు. అనంతరం పవిత్రాల ప్రతిష్ట, పవిత్ర సమర్పణ, ఆ తర్వాత పుర్ణాహూతి కార్యక్రమాలను నిర్వహిస్తారు.