యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే!
(భగవద్గీత 3-21)
ఈ ప్రపంచంలో గొప్పవారిగా గుర్తింపుపొందిన వారు ఏయే కర్మలను ఆచరిస్తారో.. ఎలా ప్రవర్తిస్తారో, దానినే సాధారణ ప్రజానీకం కూడా అనుసరిస్తారు. ఆ పెద్దలు దేనిని ప్రమాణంగా తీసుకుంటారో.. తక్కినవారు కూడా దానినే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇక్కడ.. ‘తత్ తత్ ఏవ‘ అనే పదం వాడారు. అంటే.. అది మాత్రమే.. అని అర్థం. అలాగే.. ‘ఆచరతి‘ ఆచరించడం.. మాటలు చెప్పడమే కాదు.. చెప్పినది ఆచరణలో చూపడం అవసరం. ఆచరించని బోధలకు విలువలేదు. ధార్మికమైనదానినే ఆలోచించడం, ఆలోచించినదే చెప్పడం, చెప్పిందే ఆచరించడం.. దీనినే త్రికరణశుద్ధి అంటారు.
ఇంటిపెద్ద ఆచరణయోగ్యమైన కర్మలను ఆచరిస్తూ.. ధర్మబద్ధమైన జీవనాన్ని గడిపితే.. ఆ కుటుంబసభ్యులంతా ఆ మార్గంలోనే నడుస్తారు. తల్లిదండ్రులు సమయ పాలకులైతే పిల్లలకూ అదే అలవడుతుంది. సాధారణంగా పిల్లలు చెప్తే నేర్చుకోరు.. అనుసరించి నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల సమగ్రజీవన వికాసంపై ప్రభావాన్ని చూపుతుంది. జీవితాన్ని ఏ కర్మాచరణ ఉద్ధరిస్తుందో, ఆ కర్మను ఆచరించడం మంచిది. ఆ కర్మాచరణ వల్ల నాకేమి వస్తుందనే భావన కన్నా, దానివల్ల సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నామనేదే ముఖ్యమైనది. ఒక కుటుంబంలో యజమాని ఎంత బాధ్యతతో నడుచుకోవాలో.. దేశంలో ప్రజాపాలకులు కూడా అంతే నిబద్ధతతో వ్యవహరించాలి. సంస్థలో యజమాని నీతి నిజాయతీలతో పనిచేస్తూ, నాణ్యతాప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తిని సాధిస్తే.. ఉద్యోగులు అందరూ అదే ఒరవడిని ఆశ్రయిస్తారు. ఆ ధార్మికతే సంస్థ సంస్కృతిగా ఆదరణ పొందుతుంది.
ప్రపంచం సక్రమ మార్గంలో నడవాలి అంటే.. సంపద సృష్టి జరగాలి. ప్రజలకు జీవనోపాధి కల్పించాలి. అభ్యుదయం కావాలి.. సంక్షేమం అవసరం. సాంఘిక వ్యవస్థ, పౌరధర్మాలు ఆచరణలో ఉండాలి. ఇవన్నీ పాలకులు, నాయకుల ఆచరణలో వెలుగుచూస్తేనే సమాజంలోనూ ప్రతిబింబిస్తాయి. పాలక వ్యవస్థ స్వార్థపరతను ఆశ్రయిస్తే సాధారణ ప్రజానీకం బతుకులు దుర్భరం అవుతాయి. వ్యక్తి శ్రేయస్సు కన్నా లోక శ్రేయస్సునే ప్రాధాన్యత అంశంగా భావిస్తూ పాలకులు, విశ్వశ్రేయస్సు కోసం పాటుపడటం కర్తవ్యంగా భావించాలి. అందులో వారికి మోక్షం వచ్చినా రాకపోయినా నష్టమేమీ లేదు! కానీ, లోకోపకారం జరగనివేళ ప్రపంచమే నిర్వీర్యమవుతుంది.
మానసిక శాస్త్రజ్ఞులు.. పిల్లల పెంపకాన్ని గురించి చెబుతూ.. తల్లిదండ్రుల ఆచరణలో ‘క్షమ, సహనం, ఓర్పు’ లాంటివి ఉంటే పిల్లలు ఆత్మవిశ్వాసంతో పెరుగుతారంటారు. అవగాహనా పూర్ణ వాతావరణంలో పెరిగిన పిల్లలలో న్యాయంచేసే గుణం ఉంటుందని చెబుతారు. పెద్దవారి మధ్య ప్రేమ, అనురాగం, ఓదార్పు, నిజాయతి, ప్రోత్సాహం ఉండి ఒకరినొకరు గౌరవించుకుంటే.. ఆయా లక్షణాలు పిల్లలకు అలవడుతాయి. అలాగే.. విమర్శలు, అనుమానం, అభద్రతాభావన, అవమానం.. లాంటివి ఉంటే.. పిల్లలూ అవే వైఖరులను అలవరచుకుంటారు. సమాజమైనా.. ఇల్లయినా దానిని నడిపే పెద్దల ప్రవర్తన.. ఆచరణలకు దర్పణంగా నిలుస్తుంది. సమాజాన్ని అభ్యుదయం వైపు నడిపేవారే శ్రేష్ఠులుగా గుర్తింపు పొందుతారు. వారి మార్గమే సమాజానికి శ్రీరామరక్ష.
– పాలకుర్తి రామమూర్తి