పురాణాల్లో అనేక యజ్ఞాలు, యాగాల ప్రస్తావన కనిపిస్తుంది. పలువురు మునులు, చక్రవర్తులు అశ్వమేథ యాగం, రాజసూయం, వాజపేయ యాగం ఇలా ఎన్నో క్రతువులు ఆచరించి పుణ్యలోకాలు పొందారని పురాణ వాఙ్మయం ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ భారీయాగాలు రుషులు, రాజులు మాత్రమే చేయగలిగినవి. మరి సామాన్యులు పుణ్య లోకాలను పొందడం ఎలా? ఇందుకు ‘ఆత్మయజ్ఞం’ సరైన దారిగా పేర్కొన్నారు మన పూర్వికులు.
ఇంద్రియాలను జయించి, కామక్రోధాది దుర్గుణాలను వదిలిపెట్టి, ఏకాగ్రచిత్తంతో భక్తి కలిగి ఉండటమే ‘ఆత్మ యజ్ఞం’. ఇది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. మరి, సామాన్యులకు పుణ్యం ప్రాప్తించే మార్గం ఏమిటి? ఇందుకోసం పంచ యజ్ఞాలను సూచించారు మన పూర్వికులు. అందరూ ఆచరించదగిన ఐదు యజ్ఞాలు ఏమిటంటే..
బ్రహ్మయజ్ఞం: వేదాలు చదవడం వల్ల జ్ఞానం కలుగుతుంది. వేదం చదవలేని వాళ్లు భగవత్ ధ్యానం చేసినా బ్రహ్మయజ్ఞ ఫలం దక్కుతుంది.
దేవయజ్ఞం: హోమం చేయడమే దేవ యజ్ఞం. ఇది సాధ్యం కానివాళ్లు వ్రతాలు, పూజలు ఆచరించవచ్చు.
పితృయజ్ఞం: పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం. దీనివల్ల పెద్దలను మరవకుండా వారిపట్ల గౌరవభావం పెంపొందుతుంది.
మానవయజ్ఞం: అతిథులకు, ఆర్తులకు అన్నదానం, అవసరమైన ద్రవ్యం దానం చేయడం. దీనివల్ల దయా గుణం కలుగుతుంది.
భూతయజ్ఞం: పశువులకు, పక్షులకు మేత వేయడం. దీనిని ఆచరించడం వల్ల భూతదయ, ప్రేమతత్త్వం అలవడుతాయి.
ఈ పంచయజ్ఞాలు తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. వీటిని ఆచరించడం వల్ల క్రమంగా ఆత్మయజ్ఞం అలవాటు అవుతుంది. అంతిమంగా ఉత్తమగతి సంప్రాప్తిస్తుంది.
(సులభశైలిలో వేదవిజ్ఞానం గ్రంథం నుంచి..)
…? పోలిశెట్టి బ్రదర్స్, 86399 38297