శ్రీశైలం : ఉగాది మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో మూడో రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలకు విశేష పూజలు జరిగాయి. యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధన, జపానుష్టానాలు, రుద్రహోమం, పారాయణాలు జరిపారు. అనంతరం అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలు నిర్వహించారు. సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారల ప్రభోత్సవం వైభవోపేతంగా సాగింది.
వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన ప్రభపై.. స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను గంగాధర మండపం వద్దకు తీసుకువచ్చి ప్రభపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రభోత్సవం వేలాది మంది కన్నడిగులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భ్రామరాంబ సమేత మల్లికార్జునుడి దర్శించుకున్నారు. రాత్రి భ్రామరితో కలిసి మల్లికార్జునుడు నందివాహనంపై భక్తులను కటాక్షించారు. అంతకు ముందు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి మండపంలో ఉత్సవమూర్తులకు నందివాహనంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఆరవదైన శ్రీశైల శ్రీభ్రమరాంబ అమ్మవారు మహాసరస్వతి అలంకరణలో భక్తులను కటాక్షించింది. చతుర్బుజాలు కలిగిన ఈదేవి వీణ, అక్షమాల, పుస్తకాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చింది. ఈ అమ్మవారిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల భక్తుల నమ్మకం. వాహన పూజల అనంతరం స్వామి అమ్మవార్లును ఆలయ ప్రధాన రాజగోపురం ద్వారా గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, అక్కడి నుంచి బయలు వీరభధ్రస్వామి వరకు గ్రామోత్సవం శోభాయమానంగా సాగింది.
గ్రామోత్సవంలో కోలాటం, జానపద పగటి వేషాలు, బుట్టబొమ్మలు, గొరువ నృత్యం, తప్పెట చిందులు, కర్ణాటక జాంజ్, కొమ్మువాయిద్యం, జానపదడోలు, నందికోలుసేవ, కంచుడోలు విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఈవో లవన్న, ఏసీ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పీఆర్ఓ శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, ఏఈవో హరిదాస్, డీఈలు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, పర్యావేక్షకులు శ్రీహరి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉగాది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమావాస్య రాత్రి ఘడియలు కన్నడిగులకు అత్యంత పవిత్రమైనవి. శుక్రవారం రాత్రి శివదీక్ష శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన అగ్నిగుండ ప్రవేశానికి ముందుగా భక్తులు సంప్రదాయం ప్రకారం.. తమ కనుబొమ్మల నుంచి గుచ్చుకొని సంప్రదాయాలను పాటించి శాస్ర్తోక్త పూజలు చేశారు. మరికొందరు నాలుక, చంపలు,పెదవులు, చేతులు, నోటి నుంచి చువ్వలను గుచ్చు కొని అగ్నిగుండాల్లో ప్రవేశం చేశారు.
కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు ముక్కంటిని మది నిండా నింపుకొని చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ముందుగా స్వామిఅమ్మవార్ల ఉత్సవ విగ్రహలను పల్లకీలో కొలువువుంచి ఊరేగింపుగా శివదీక్ష శిభిరాలకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలానంతరం వివిధ రకాల వేషధారణలతో వీరభద్రున్ని కొలుస్తూ చేసిన ఖడ్గ విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి.