Lord Shiva | శివుడు.. శివాని. మహేశ్వరుడు.. మహేశ్వరి. శంకరుడు.. శాంకరి. ఆయన పేరుతో పిలిస్తేనే అమ్మకు మోదం! ఆమెను తన పేరుతో పిలవడమే అయ్యకు హ్లాదం!! నామధేయాన్నే కాదు.. ఆయన సగం కాయాన్నీ ఆమెకు ధారాదత్తం చేశాడు. అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈశ్వరుడి తనువును పంచుకోవడమే కాదు.. ఆయన మనసునూ ఎన్నోసార్లు గెలుచుకుంది ఈశ్వరి. ఈ ఇద్దరికీ ఎంతలా పొత్తు కుదిరిదంటే.. ఆమె కాళిగా కదంతొక్కితే ఆయన మహాకాలుడై నిలువరిస్తాడు. ఆయన రుద్రుడై తాండవమాడితే ఆమె రుద్రాణిగా వచ్చి లాస్యం చేస్తుంది. ఇలా ఒకరికొకరై.. ఒక్కటై.. ఈ సృష్టికి అన్నీ అయ్యారు శివపార్వతులు. వెండికొండ వేల్పు వెలుగుచూసిన పర్వదినం మహా శివరాత్రి. లింగరూపంలో ఆవిర్భవించిన జంగమయ్యకు గౌరమ్మనిచ్చి పెళ్లి చేసే శుభరాత్రీ ఇదే! కొత్తగా కొంగుముడి వేసుకుంటున్న పురాణ దంపతుల లీలల్ని స్మరించుకుందాం.. తత్తాన్ని సంగ్రహిద్దాం.
శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు. మరి ఆ ఆజ్ఞ జారీ చేయడానికి శివుడు పలకాలి. అందుకు పెదవి కదపాలి. దానికి శక్తి కావాలి. ఆ శక్తే పరమేశ్వరి.. మాత పార్వతి!! ఇంకా చెప్పాలంటే.. శివుడు స్థాణువు. పార్వతి శక్తి. అంతటా నిండిన పరబ్రహ్మలో తేజస్సు ఆమె. ఆయన కారణంగానే ఆమె శక్తి ద్యోతితమవుతుంది. ఆమె ఉండటం వల్లే ఆయన తేజస్సు ప్రస్ఫుటమవుతుంది. అలా ఆ ఇద్దరూ యుగయుగాలుగా ఒకరినొకరూ అంటిపెట్టుకొని ఉన్నారు. ఈ సృష్టికి ముందూ అంతే ఇదిగా ఉన్నారు. ఈ సమస్త జగత్తులూ అనంత విశ్వంలోకి అంతర్లీనమైనప్పుడూ అలాగే ఉంటారు. వివరంగా చెప్పాలంటే.. సతీదేవి పరమశివుణ్ని పతిదేవుడిగా స్వీకరించకముందే.. వారిద్దరూ పుణ్య దంపతులు. పార్వతిగా పరమేశ్వరుడి మనసు గెలుచుకోకముందే ఉమాదేవి కైలాసనాథుడి పట్టమహిషి. వారి సంయోగాలూ, వియోగాలూ విధి ఆడిన వింత నాటకాలు కాదు. ఆ పెన్నిధులు మనకు పంచిన దాంపత్య నిధులు.
శ్రీహరి నాభి నుంచి కమలం ఉద్భవించింది. అందులోంచి బ్రహ్మ ఆవిర్భవించాడు.
తన పుట్టుకకు కారణం అడిగాడు.
‘సృష్టి కార్యంపై దృష్టి సారించు’ అన్నాడు పరమాత్మ. అంతా చీకటి. అంతలో ఓ కాంతి స్తంభం. దేదీప్యంగా వెలుగులీనుతున్నది. పరిశీలిస్తే ఆది లేదు. అంతం తెలియలేదు. విరించికి పరిస్థితి వివరించి చెప్పేవాళ్లు కనిపించలేదు. మనోఫలకంపై ప్రణవ నాదం నర్తించింది. ఆ మహాలింగంలో ఓ రూపం అస్పష్టంగా గోచరమైంది. తను, తనను పుట్టించినవాడు.. ఇద్దరమే ఉన్నామనుకున్నాడు అప్పటివరకు! కానీ, మరొకరు ఉన్నారని తేటతెల్లమైంది.
ఆ ఒక్కరు.. ఒక్కరు కాదు, ఇద్దరనిపించింది.
ఇద్దరూ ఒక్కటిగా ఉన్నారనిపించింది.
తరచి తరచి చూశాడు.
ప్రణవాన్ని తలచి తలచి చూశాడు.
తెలిసింది.. అర్ధనారీశ్వరం.
సంపూర్ణ సృష్టికి ఆలంబనం.
సగము మొగము రాజు.. సగము మొగము రాణి..
సగము తనువు కపాలి.. మరి సగము ఒడలు కాళి..
సృష్టికి మూలం ఈ ఇద్దరే!
చెరి సగం. సమ సగం. అపురూప సమాగమం. వాగర్థాల సంయోగం. సృష్టి యాగానికి ఆరంభం. అందుకే వాళ్లు ఆదిదంపతులు. ఈ సకల చరాచర జగత్తుకు మాతాపితరులు. సృష్టికి ముందే జట్టుకట్టిన ఈ ప్రకృతీపురుషులు చూపిన లీలావిలాసాలే సతీ-పశుపతి అనురాగం, పార్వతీ-పరమేశ్వరుల అనుబంధం. యుగయుగాలుగా కొనసాగుతున్న వీరిద్దరి సంసారం… నేటి ఆలుమగలకూ ఆదర్శం.
అర్ధనారీశ్వరులకు సాగిలపడ్డాడు బ్రహ్మ! సృష్టి రచనకు అనుజ్ఞ ఇవ్వమని ప్రార్థించాడు.
‘పురుషుల సృష్టి నీవంతు! స్త్రీ శక్తి అమ్మ చూసుకుంటుంది’ అన్నాడట శివుడు. అందుకే, ఈ ప్రపంచంలోని మహిళలంతా అమ్మ సృష్టే! అతివను ఆదిపరాశక్తిగా దర్శించాలన్న మన పెద్దల మాట వెనుక ఉన్న ఆంతర్యం ఇదే! ప్రతి స్త్రీ మూర్తీ జగన్మాతే అని ఆర్షధర్మం చెప్పింది అందుకే!!
శివుడి ఆజ్ఞతో బ్రహ్మకు చేతినిండా పని దొరికింది.
రుషులను సృష్టించాడు. తర్వాత ప్రజాపతుల వంతు! ఆపై మనువులు!!
ప్రజాపతుల్లో దక్షుడు దక్షతగలవాడు. త్రిమూర్తులకు ఇష్టుడు.
పరమేశ్వరి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేశాడు దక్షుడు. అమ్మ ప్రత్యక్షమైంది. ‘నువ్వు నా ఇంట బిడ్డగా పుట్టాల’ని కోరుతాడు. మళ్లీ తనను శివుడికే కట్టబెడతానని హామీ ఇస్తే బిడ్డగా పుడతానంటుంది శక్తి. అలాగే అంటాడు దక్షుడు. ప్రజాపతి ఇంట పరాశక్తి పాపగా పుడుతుంది. సతీదేవిగా అల్లారుముద్దుగా పెరుగుతుంది. సదాశివుడినే సదా స్మరిస్తూ ఉంటుంది. సతీదేవి పెండ్లీడుకొస్తుంది. స్వయంవరం ఏర్పాటుచేస్తాడు దక్షుడు. వరమాలతో మంటపానికి వస్తుంది అమ్మవారు. అంతటా చూస్తుంది. శివుడు కనిపించడు. ‘శివుడు ఎక్కడ?’ అని తండ్రిని అడుగుతుంది. ‘నిన్ను ఆ బైరాగికి కట్టబెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే పిలువలేదు’ అంటాడు దక్షుడు. తండ్రి అమాయకత్వానికి సతీదేవి జాలిపడుతుంది. చేతిలో ఉన్న వరమాలను లీలగా వదిలిపెడుతుంది. హారం అమ్మవారి చేతుల నుంచి జారిందో లేదో.. శివుడు ప్రత్యక్షమవుతాడు. హారాన్ని ప్రేమగా స్వీకరించి అంతర్ధానమవుతాడు. ఆయన మీద ఎంత నమ్మకం లేకపోతే.. సతీదేవి అలా హారాన్ని విడుస్తుంది. ఆమె మీద ఎంత ప్రేమ లేకపోతే.. అలా చటుక్కున వచ్చేస్తాడు. మొత్తానికి బ్రహ్మాది దేవతలు ప్రజాపతికి నచ్చజెబుతారు. తన కూతురిని శివుడికి ఇచ్చి కల్యాణం చేయడానికి దక్షుడు అంగీకరిస్తాడు. ఎప్పుడూ కలిసి ఉండే దంపతులు మరోసారి ఇలా నాటకీయంగా కలుస్తారు!
కైలాస సదనంలో ఆనందం. ప్రమథ గణాల్లో పరవశం. సతీ-పశుపతి సంసారం సాఫీగా సాగిపోతుంటుంది. కారణాంతరాల వల్ల దక్షుడికి, శివుడికి దూరం పెరుగుతుంది. పరమేశ్వరుణ్ని పరిహసించడానికి నిరీశ్వర యాగం తలపెడతాడు దక్షుడు. విషయం కైలాసానికి చేరుతుంది. సతీదేవి కుమిలిపోతుంది. తండ్రికి హితవు చెప్పాలని భావిస్తుంది. యాగానికి వెళ్తానని భర్తను కోరుతుంది. వద్దంటాడు శివుడు. మాటామాటా పెరుగుతుంది. ‘ఎంతైనా ఆ దక్షుడి కూతురువు కదా!’ అనేస్తాడు శివుడు. తన ఇల్లాలిని ఇంకా పుట్టింటి కొమ్మగానే చూస్తున్న భర్తపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. పతికి తానేంటో చూపాలనుకుంటుంది సతి. కాళిగా మారుతుంది. ఆ ఉగ్రరూపం చూసి పారిపోవాలనుకున్న శివుణ్ని భైరవిగా, బగళాముఖిగా, ఛిన్నమస్తగా, ధూమావతిగా ఇలా దశ రూపాలు ధరించి.. పది దిక్కులకూ వెళ్లకుండా అడ్డగిస్తుంది. అమ్మ రూపాలు చూసి తొలుత భయపడతాడు శివుడు. ఆనక ఆశ్చర్యచకితుడు అవుతాడు. ‘ఏమిటీ లీల… ఎందుకీ గోల?’ అని ప్రశ్నిస్తాడు. ‘ఈ దశమహా విద్యకు ఉపాసన క్రమం నువ్వే చెప్పాలని’ కోరుతుంది సతీదేవి. అలా ఆ ఆలుమగల కయ్యం అమ్మవారి దశరూపాలకూ కారణమైంది. ఉపాసకులకు వరమైంది.
పరిస్థితి సద్దుమణిగిన తర్వాత సతీదేవిని భారంగానే పుట్టింటికి వెళ్లనిస్తాడు శివుడు. ‘దక్షుడి కూతురు’ అన్న పేరు చెరిపేసుకోవాలన్నది దాక్షాయణి నిశ్చయం. అందుకే వెళ్లింది. శివతత్త్వం గొప్పదనం ఏంటో తండ్రికీ, ఆ యాగానికి వచ్చిన దేవతలందరికీ విశదీకరించి.. యాగాగ్నికి ఆహుతి అవుతుంది. సతి లేదన్న విషయం తెలిసి శివుడి మతి తప్పుతుంది. ఆమె కళేబరాన్ని భుజాన వేసుకొని కరాళ నృత్యం చేస్తాడు. చక్రి తన సుదర్శనంతో అమ్మ శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలు పడిన ప్రతిచోటూ శక్తిపీఠమైంది. ఆ దివ్యక్షేత్రాలు నేటికీ భక్తుల పాలిట కొంగుబంగారమై అలరారుతున్నాయి. వారి సంయోగమే కాదు, వియోగం కూడా బిడ్డలకు వరమే! అదే ఆదిదంపతుల కరుణ!! అమ్మ వెలసిన ప్రతిచోటా ఆయనా ఏదో రూపంలో నిలిచాడు. భ్రమరాంబ సన్నిధిలో మల్లన్నగా, విశాలాక్షి వాకిట విశ్వనాథుడిగా ఇలా ఆమె వెంటే ఉండిపోయాడు.
సతీ వియోగంతో కైలాసాన్ని వదిలేశాడు శివుడు. శ్మశానాలు పట్టుకుని తిరగడం మొదలుపెట్టాడు. విరహంలో కూరుకుపోయాడు. విరాగిగా మారిపోయాడు. శక్తి లేదు.. ఆసక్తి రాదు. తపస్సులో మునిగి స్థాణువయ్యాడు. మరోవైపు హిమవంతుడి ఇంట పరాశక్తి పుట్టింది. మేనకాదేవి ఆలనాపాలనలో పార్వతిగా పెరిగింది. శివుణ్ని చేరుకోవడమే ఆమె లక్ష్యం. అనుకోకుండా ధ్యానశివుడికి శుశ్రూషలు చేసే అవకాశం వచ్చింది. మూడు కన్నులున్నా.. క్రీగంట కూడా ముదితను చూడడే! చిన్నబుచ్చుకుంది పార్వతి. తన ప్రాసాదానికి వెళ్లిపోయింది. దివారాత్రులూ విలపిస్తూనే ఉండిపోయింది. విషయం తెలుసుకొని వచ్చాడు నారదుడు.
‘ఆయనలో సగమైన నీకు.. శివుడు అర్థమైంది ఇంతేనా తల్లీ?’ అని ప్రశ్నించాడు. శంకరుణ్ని భక్తితో వశం చేసుకోవాలి కానీ, అందచందాలతో అది సాధ్యమయ్యేదేనా అని బోధిస్తాడు. కఠోర తపస్సుకు పూనుకొంటుంది పార్వతి. ఆమె భక్తి ఏపాటిదో తెలుసుకోవాలని కపట బ్రహ్మచారిగా వస్తాడు హరుడు. శివుడి గురించి లేనిపోనివన్నీ చెప్పాడు. ‘ఏనుగు తోలు చుట్టుకుంటాడు, శ్మశానాల వెంట తిరుగుతాడు, కపాల హారం ధరిస్తాడు, పాములు చుట్టుకుంటాడు..’ అని ఇలా నానాయాగీ చేస్తాడు మాయదారి శివుడు. అప్పటికే తపస్సుతో పరమేశ్వరుడి తత్తం సంపూర్ణంగా గుర్తెరిగిన పార్వతి అవేం పట్టించుకోదు. కైలాసనాథుడే తన నాథుడు అని చెబుతుంది. భార్యాభర్తల బంధంలో బాహ్య సౌందర్యం ప్రధానం కాదు, అంతర్ సౌందర్యం, వ్యక్తిత్వమే ముఖ్యమని శివపార్వతులు జంటగా చూపించిన లీల ఇది.
పార్వతిని చేపట్టడానికి శివుడు అంగీకరించాడని హిమవంతుడు పొంగిపోతాడు. దేవాదిదేవుడు తమ ఇంటికి అల్లుడు అవుతున్నాడని మేనకాదేవి సంతసిస్తుంది. పెళ్లి రాయబారానికి సప్తరుషులు వస్తారు. శివలీలల్ని ప్రస్తుతిస్తారు. శివపార్వతుల కల్యాణానికి ముహూర్తం నిర్ణయమైంది. ఎప్పుడూ కరి చర్మం చుట్టుకునే శివయ్య పెళ్లినాడు పట్టుపుట్టం కట్టుకున్నాడు. జడలు కట్టిన కేశాలను సంస్కరించుకున్నాడు. తన ఒంటికి చుట్టుకున్న నాగులను వదిలిపెట్టి కంకణాలు ధరించాడు. ప్రమథ గణాలనూ పద్ధతిగా తయారవ్వమని ఆదేశించాడు. ముక్కోటి దేవతలు తోడుగా ఆడపిల్ల ఇంటికి తరలివెళ్లాడు! ఇంతమంది ఎంతో గొప్పగా చెప్పిన శివుణ్ని చూడాలని మేనకాదేవి ఆరాటపడుతుంది. అదేమాట నారదుడిని కోరుతుంది. దానిదేముంది అని రాజప్రాసాదం పైకి వెళ్లారిద్దరూ.
దేవతలంతా ఆనందపరవశులై తరలి వస్తున్నారు. అందులో నలకుబేరుణ్ని చూసి ‘ఆయనేనా శివుడు’ అంది మేనకాదేవి. ‘అతను కుబేరుడి కొడుకు.. ఇతగాడి అందం ఆ మహనీయుడి కాలిగోటికి సరిపోదు’ అన్నాడు నారదుడు. పొంగిపోయింది మేనకాదేవి. ఇంద్రుణ్ని చూసి ఈయనేనా అని అడిగింది. ‘ఈయనకు కోట్ల రెట్ల అందం ఆయనది’ అన్నాడు నారదుడు. అంతలోనే ‘అల్లదిగో శివుడు’ అన్నాడు. కాబోయే అత్తగారి ఆరాటం అర్థమైంది శివుడికి. ఒక్కసారిగా తన రూపురేఖల్ని వికారంగా మార్చేసుకున్నాడు. తన గణాలనూ అలాగే మారమన్నాడు. ఆయనగారి రూపం చూసి కుదేలైంది మేనకాదేవి. నారదుణ్ని తూర్పారబట్టింది. సప్తరుషులనూ పిలిచి ‘నా పిల్ల గొంతుకోశారు మీరంతా’ అని వగచింది. బ్రహ్మ చెప్పినా వినలేదామె.
పార్వతీదేవి వచ్చి శివతత్త్వం గొప్పదనం చెప్పినా పట్టించుకోలేదు సరికదా! కూతురుకు చీవాట్లు పెట్టి.. కొట్టినంత పనిచేసింది. చివరికి నారాయణుడు వచ్చి శంకరుడు లోక వశంకరుడు అని చెబితే కాస్త స్థిమితపడింది. ఇంతలో నారదుడు వెళ్లి.. ‘ఏమిటీ పంచముఖాలు… ఎందుకీ వికార అవతారం’ అని శివుణ్ని ప్రశ్నించాడు. ‘అత్తగారికి నా తత్తం ఎరుక చేయడానికి’ అని ముసిముసిగా నవ్వాడు. ‘ఇదేం ఆనందం స్వామీ! మళ్లీ ముస్తాబై రండి’ అనగానే.. సమ్మోహన రూపం దాల్చి పెళ్లింట అడుగుపెట్టాడు శివుడు. అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం జరిగింది. పురుషుడి స్పర్షతో ప్రకృతి పరవశించింది. ప్రకృతి ఒడిలో పురుషుడు పులకాంకితుడయ్యాడు.
ఆ తల్లికి తన శరీరంలో సగమిచ్చి మళ్లీ విడిపోకుండా ముడివేశాడు శివుడు. తనువులో సగమే ఆక్రమించినా.. మనసునంతా నిండిపోయిందామె. బాహ్య దృష్టిలో అర్ధనారీశ్వరం. ఆంతర్యం గ్రహిస్తే.. ఇద్దరూ ఒక్కటే! భార్యాభర్తలు వేరు కాదని శివుడు చెప్పిన సత్యం.. అతి సుందరం. అభిప్రాయభేదాలు వచ్చినా… అలకలు పూనినా.. ఆగ్రహాలకు గురైనా.. కుంగుబాటుకు లోనైనా.. ఒకరికొకరు సర్దిచెప్పుకొని ముందుకు సాగిపోవడమే దాంపత్య రహస్యం. ఆది దంపతులు మనకు అందించిన సందేశం.
ఈ ఇరువురూ ఇలా విడిపోవడం దేనికి? మళ్లీ కలవడం దేనికి? అదే సృష్టి రహస్యం. దక్ష పుత్రికగా ఉండొద్దనుకుంది అమ్మ. అందుకే శరీరాన్ని త్యజించింది. మళ్లీ ఇద్దరూ కలిస్తేనే… కుమార సంభవం సంభవమవుతుంది. అది సాధ్యమైతేనే తారకాసుర సంహారం జరుగుతుంది. అందుకే పార్వతిగా పుట్టింది అమ్మ. పరమేశ్వరుణ్ని
చేపట్టింది. వాగర్థాలు మళ్లీ ఒక్కటయ్యాయి. జగత్తుకు అమ్మానాన్నల అండ దొరికింది. ఈ శివరాత్రి సందర్భంగా మనువాడుతున్న గౌరీశంకరులు.. మునుపటి ముచ్చట్లు నెమరువేసుకుంటూ మురిసిపోతుంటారేమో! ఒకరినొకరు మళ్లీ మచ్చిక చేసుకుంటారేమో!! వారి కాపురాన్ని ఆదర్శంగా తీసుకొని ఆదిదంపతులు అభిమానించే జంటగా
మారడమే మనం వారికి చెల్లించే మొక్కు.
‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది’ అన్న మాట తొలిగా రుజువైంది పార్వతీపరమేశ్వరుల విషయంలోనే కావొచ్చు. దేవదానవులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు మొదట హాలహలం ఉద్భవించింది. పొగలు చిమ్ముతూ, నిప్పులు కక్కుతూ ప్రపంచాన్ని ముంచేస్తున్న గరళాన్ని చూసి అందరూ ‘హరహరా’ అంటూ మొరపెట్టుకున్నారు. శివుడు ఆ విషాన్నంతా నేరేడు పండంత పరిమాణం చేసి చేతిలోకి తీసుకున్నాడట. అప్పుడు పార్వతితో ‘మింగేయమంటావా?’ అని అనుమతి కోరాడట. ‘ఏం ఫర్వాలేదు కానీ’ అందట అమ్మవారు. శివుడు ఆ విషాన్ని గుటుక్కున మింగి కంఠంలోనే భరించాడు. గౌరీదేవి మాంగళ్యంపై ఆయనకున్న నమ్మకం అది. మంగళకరుడైన శివుడిపై ఆమెకున్న విశ్వాసం అది. అంతేకాదు, ఏదైనా పని చేసేముందు జీవిత భాగస్వామికి ఒక మాట చెప్పడం ధర్మమని ఈ సందర్భం మనకు విశదపరుస్తుంది.
ఒకసారి ఇంద్రాది దేవతలు శివుణ్ని స్తుతిస్తూ ‘స్వామీ! పుట్టుకకు కారణమైన మన్మథుణ్నీ నువ్వు మట్టుపెట్టావు. మరణానికి కారణమైన యముణ్నీ తుదముట్టించావు. జననమరణ చక్రం నుంచి జీవుణ్ని బయటపడేసి… మోక్షం ప్రసాదించే దేవుడివి నువ్వే’ అని కీర్తించారట. పక్కనే ఉన్న పార్వతి.. ‘అందులో నా వాటా కూడా ఉంది’ అన్నదట. అర్థం కాలేదట దేవతలకు. ‘మన్మథుణ్ని భస్మం చేసిన త్రినేత్రం శివుడి ఫాలభాగంలో కదా ఉంది. సగం ఆయన వైపు ఉంటే.. సగం నా వైపు ఉందిగా!’ అన్నదట. ఔనన్నట్టు తలూపారట దేవతలు. ‘యముణ్ని తాడనం చేసిన ఎడమ పాదం.. నాదేగా! ఆయన శరీరంలో ఎడమ భాగంలో ఉన్నది నేనేగా’ అన్నదట అమ్మవారు. సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం ఈ ఐదూ శివుడి పనులే! సృష్టి, స్థితి పార్వతీదేవి చూసుకుంటే, లయ, తిరోధానం శివుడు చూసుకుంటాడట. అనుగ్రహం (ముక్తి) మాత్రం ఇద్దరూ ఇస్తారట. ఇక్కడ కూడా అర్ధనారీశ్వర తత్తమే! శివుడు ఏం చేసినా పార్వతి చేసినట్టే! పార్వతి ఏం అనుగ్రహించినా శివుడు ఇచ్చినట్టే. శివ భక్తులను పార్వతి కటాక్షిస్తే… అమ్మవారి ఆరాధకులను శివుడు కాపు కాస్తుంటాడన్నమాట.
ఆదిదంపతుల సంసారంలోనూ అరమరికల్లేకుండా లేవు. ఓసారి గిల్లికజ్జాల స్థాయిలో ఉంటే, ఒక్కోసారి చిలికిచిలికి గాలివాన అయిన సందర్భాలూ ఉన్నాయి. పరమేశ్వరుడు కర్పూరమంత తెల్లగా ఉంటాడు. పార్వతేమో.. కాటుకంత నలుపు మనిషి. ఓసారి పార్వతి వంక చూస్తూ.. ‘కాళీ.. నల్లదానా’ అన్నాడట శంకరుడు. అందరి ముందు అలా అనడంతో ఆమె కస్సుమంది. దిగ్గునలేచి.. తపస్సుకు పూనుకొంది. బ్రహ్మదేవుడికై తపస్సు ఆచరించి.. ఆయన అనుగ్రహంతో స్వర్ణకాంతులీనే దేహాన్ని సంతరించుకుంది. బంగారు వన్నెలో మెరిసిపోతున్న అమ్మను చూసి.. శివుడు మరింత మురిసిపోయాడు. ‘గౌరీ!’ అంటూ పార్వతిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడట.
ఇంకోసారి ప్రమథ గణాలు శివుణ్ని తెగ పొగిడాయట. ఉబ్బితబ్బిబ్బయిన శంకరుడు పక్కనే ఉన్న పార్వతి వంక కాస్త గర్వంగా చూశాడట. పెనిమిటి ఆంతర్యం గ్రహించిన అమ్మవారు సర్లే అనుకుందట! తన చేతిలోని ఐదు రంధ్రాలు ఉన్న రత్నాల బంతిని భర్తకు ఇచ్చి.. అందులోకి చూడమన్నదట. యథాలాపంగా చూశాడు శివుడు. అందులో ఐదు బ్రహ్మాండాలు, ఐదు కైలాసాలు, ఐదుగురు శంకరులు కనిపించారట. అప్పుడు గానీ, అమ్మవారి శక్తి ఏపాటిదో అయ్యకు అర్థం కాలేదు. భార్యాభర్తల్లో ఒకరు హెచ్చులకు పోయినప్పుడు మరొకరు యుక్తిగా నెగ్గుకు రావాలని ఈ సన్నివేశం బోధిస్తుంది.
భిన్నధ్రువాలు ఆకర్షించుకుంటాయన్న భౌతిక శాస్త్ర నియమానికి పార్వతీపరమేశ్వరులు ఉదాహరణగా కనిపిస్తారు. వారిద్దరి రూపాలు పరిశీలిస్తే చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కానీ, మనసులు మాత్రం ఒకటే! ఇద్దరి రూప లావణ్యాలు, గుణగణాలూ వర్ణిస్త్తూ.. ఆదిశంకరులు అందించిన ‘అర్ధనారీశ్వర స్తోత్రం’ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
చాంపేయగౌరార్థ శరీరకాయై కర్పూరగౌరార్థ శరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ॥
‘ఒకవైపు సంపెంగ పువ్వులా స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న అమ్మ, మరోవైపు తెల్లని కర్పూర కాంతితో వెలిగిపోతున్న శివయ్య, ఒకవైపు సుందరమైన కొప్పు కలిగిన పార్వతీదేవి, మరోవైపు జడలు కట్టిన జటాజూటము కలిగిన పరమేశ్వరుడు… ఆహా భిన్నరూపులు ఏక రూపమైన అర్ధనారీశ్వరునికి నమస్కరిస్తున్నాను’ అని అర్ధనారీశ్వర స్తోత్రంలోని ఓ శ్లోకం విశదీకరిస్తుంది.
– త్రిగుళ్ల నాగకీర్తన