Lord Shiva | శంకరుడు జగత్తుకు తండ్రి. శాంకరి జగజ్జనని. మాతాపితరులుగా సృష్టిని సదా రక్షించే శివపార్వతుల జీవితంలో చిత్రవిచిత్రాలెన్నో! యుగయుగాల దాంపత్యంలో పలు సందర్భాలు ఆలుమగల అన్యోన్యతకు పట్టం కడతాయి. మగాడు ఎక్కువ, మగువ తక్కువ అన్న లోకరీతిని ఖండిస్తూ ఎన్నో లీలలు చూపారు ఇద్దరు. అడిగిన వారికి అడిగినట్టు వరాలు కురిపించే శివుడు.. అన్నపూర్ణను దేహీ అన్నాడు. ఒక్కోసారి ఆమెకు భయపడ్డాడు, బతిమాలాడు. ఎక్కడ తగ్గాలో తగ్గాడు.. భర్తగా నెగ్గాడు. ఏతావాతా భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలియజేశారు.
ఎంత ఆదర్శ దాంపత్యమైనా.. ఈ పుణ్యదంపతుల మధ్యా గిల్లికజ్జాలకేం తక్కువ లేదు. ఆమెను ఆయన దెప్పి పొడవడం, ఆయన్ను ఆమె గేలి చేయడం జరిగేవి. వారిద్దరి మాటపట్టింపులు కూడా సాదాసీదాగా సాగిపోతున్న సంసారానికి ఆటవిడుపు ఇచ్చేవి. అలాంటి సందర్భమే ఇది! ఓసారి పరమేశ్వరుడు ఏ భక్తుడినో అనుగ్రహించడానికి కైలాసం విడిచి వెళ్లాడు. ఎంత సమయం గడిచినా రాకపోయేసరికి పార్వతికి కోపం వచ్చింది. ఇంటికి వచ్చాక కడిగేయాలని నిశ్చయించుకుంది. కైలాసం తలుపులు బిడాయించి శివుడి రాక కోసం ఎదురు చూడసాగింది. ఆయనగారు వచ్చాక సంగతి చెప్పాలనుకుంది. కొన్ని గంటలు గడిచిన తర్వాత కైలాసానికి చేరుకున్నాడు శివుడు. తలుపు తట్టాడు. అప్పుడు వారిద్దరి మధ్యా జరిగిన సంవాదాన్ని ఓ సంస్కృత కవి ఇలా వర్ణించాడు.
‘కస్త్వం? శూలీ! మృగయ భిషజం, నీలకంఠే ప్రియేహం!
కేకామేకాం కురు, పశుపతిః నైవ దృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే నవదితి తరుః జీవితేశ శ్శివాయః
గచ్చాటవ్యాం ఇతి హత వచః పాతువశ్చంద్ర చూడః’
వారి సంభాషణ ఎలా సాగిందంటే. శివుడు తలుపు కొట్టగానే.. పార్వతి ‘కస్త్వం’ (ఎవరు నువ్వు) అని అడిగింది. దానికి శివుడు ‘శూలీ’ (శూలం ధరించినవాణ్ని) అన్నాడు. శూలీ అంటే తలనొప్పి అని కూడా అర్థం ఉంది. పార్వతి ఆ అర్థం గ్రహించి.. ‘మృగయ భిషజం’ (వైద్యుణ్ని వెతుక్కో?) అని విరహమాడింది. ఉమాదేవి కోపంతో ఉందని గ్రహించాడు శివుడు. ‘నీలకంఠే ప్రియేహం’ (ప్రియా! నేను నీలకంఠుణ్ని) అని ఆమెను లాలించే ప్రయత్నం చేశాడు. ‘నీలకంఠః’ అంటే నెమలి కూడా! వెంటనే పార్వతీదేవి ‘కేకామేకాం కురుః’ (నెమలివా! అయితే అరవ్వేం!) అని మళ్లీ ఇరుకున పెట్టింది. విసుగెత్తిన శివుడు ‘పశుపతిః’ అని కాస్త కటువుగా సమాధానం ఇచ్చాడు. పశుపతి అంటే ఎద్దు అని మరో అర్థం. దానికి ‘నైవ దృశ్యే విషాణే’ (కొమ్ములెక్కడ?) అని పతికి మరో సవాలు విసురుతుంది పార్వతి. ఇలాగైతే లాభం లేదు.. ఆమె కోపాన్ని చల్లబరచాలని భావిస్తాడు శివుడు.
లోగొంతుకతో లాలనగా ‘స్థాణుర్ముగ్ధే’ (ఓ ముగ్ధా! నేను అంతటా నిండి ఉన్నవాడిని.. స్థాణువును) అని తనను తాను మళ్లీ పరిచయం చేసుకుంటాడు. స్థాణువు అంటే చెట్టు అన్న అర్థం ఉంది. అమ్మవారు అలక ఇంకా మానలేదు. ‘నవదితి తరుః’ (చెట్టా నాకు కనిపించడం లేదే! ఎక్కడ?) అని మరో ప్రశ్న సంధించింది. ఇక లాభం లేదనుకున్న పరమేశ్వరుడు ‘జీవితేశ శ్శివాయః’ (నీ జీవితేశ్వరుడైన శివుడిని) అని బదులు పలికాడు. పార్వతి ఇంకా శాంతించలేదు. శివా అంటే మృగం అనే అర్థం కూడా ఉంది. ‘గచ్చాటవ్యాం’ (ఇక్కడికి ఎందుకొచ్చావ్! అడవుల్లో తిరుగు) అని గేలి చేసింది. చివరగా ‘ఇతి హత వచః పాతువశ్చంద్ర చూడః’ (ఇలా మాటల్లో ఓడిన శివుడు రక్షించుగాక) అంటూ వింత శ్లోకం ముగించాడా కవి. సర్వ జగత్తుకూ మాతాపితరులైన పార్వతీపరమేశ్వరుల సంవాదం కూడా మనకు దీవెనే! వారి అలకల్లో కిలకిలలు.. ఈ శివరాత్రి రేయి మనువాడుతున్న ఆదిదంపతుల లీలా వినోదం.
– అభిరామ్