శ్రీశైలం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. దేవస్థానం ఈవో లవన్న దంపతులు మంగళవారం ఉదయం సాంప్రదాయబద్దంగా పసుపు, కుంకుమ, పూలు, పండ్లతో ఆలయ ప్రవేశం చేసి, యాగశాలలో గణపతిపూజ, మండపారాధన తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ వేదపండితులు శివసంకల్పాన్ని పఠించి, భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్సవాలు నిర్విఘ్నంగా జరుగాలని మొదట గణపతిపూజ, పుణ్యహవాచనం, చండీశ్వరపూజ, కంకణపూజ, కంకణధారణ, రుత్విగ్వరణం, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం ప్రధాన కలశస్థాపన పూజలు జరిగాయి. సాయంత్రం అంకురార్పణలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని మట్టిని తీసుకుని 9 పాలికలలో వేసి నవధాన్యాలను అంకురారోపింజేసే క్రతువును ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత ధ్వజారోహణలో భాగంగా నూతన వస్త్రంపై పరమశివుని వాహనమైన నందీశ్వరుని ప్రతిమ, అష్టమంగళాలను చిత్రించిన నంది ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేసి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు తొలిసారిగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడి తరఫున దేవస్థానం అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా.. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామిఅమ్మవార్లు భృంగివాహన సేవ జరుగనున్నది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఈవో లవన్న వివరించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. సాయంత్రం నిత్యకళారాధన వేదిక వద్ద హైదరాబాద్కు చెందిన నృత్యజ్యోతి డాన్స్ స్కూల్ పేరణి శివతాండవం, శ్రీసత్య అకాడమీ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఆలయ కోనేరు వద్ద కడప జిల్లాకు చెందిన భాగవతారాణి ప్రమీలా ‘భక్త మార్కండేయ’ హరికథ గానం ఆకట్టుకున్నది. శివదీక్ష శిబిరాల వద్ద శ్రీశైలానికి చెందిన రాములు నాయక్ ట్రైబల్స్ వెల్ఫేర్ అండ్ సొసైటీ భక్తమార్కండేయ నాటకాన్ని ప్రదర్శించగా భక్తులను అలరించాయి.
భ్రమరాంబ అమ్మవారికి మంత్రాలయం రాంపురం గ్రామానికి చెందిన టీ సీతారామిరెడ్డి కుటుంబసభ్యులు మంగళవారం బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించారు. ఈవో లవన్నకు 109 గ్రాముల మామిడిపిందెలహారం, 96 గ్రాముల లక్ష్మీకాసుల హారాన్ని అందజేశారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శివరామిరెడ్డి, మంత్రాలయం నియోజకవర్గ శాసనసభ్యులు బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. ఆభరణాలను విరాళంగా ఇచ్చిన దాతలకు అర్చక వేదపండితులు వేదాశీర్వచనాలు చేసి ప్రసాదాలు ఙ్ఞాపికను అందజేశారు.