వెండి వెలుగుల పందిరి మాఘ పౌర్ణమి. చిమ్మ చీకటికి.. చంద్రుడు వెన్నెల వెలుతురుల తోరణాలు కడతాడు. అందుకే పౌర్ణమి నాటి రేయి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మన మనసులను ఆనందపరవశులను చేస్తుంది. మాఘ మాసంలో వచ్చే పున్నమినాడు చంద్రుడు పదహారు కళలతో వెలుగులీనుతాడు. ఈ పౌర్ణమినే మహామాఘం అనే పేరుతో పండుగలా పాటిస్తారు. పౌర్ణమి నాడు చంద్రుడు మఖ నక్షత్రానికి సమీపంగా ఉంటాడు. అందుకే ఈ నెలకు మాఘం అని పేరు. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు దీనిని శ్రేష్ఠమైన మాసంగా శాస్ర్తాలు చెబుతున్నాయి.
న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా
తద్వత్ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః॥
‘సూర్యుడి తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘస్నానానికి సాటివచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేద’ని శాస్త్ర వచనం. పాప రాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. ఇది సకల కలుషాలను హరిస్తుందని విశ్వాసం. మాఘస్నాన మాహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణంలో విశేషంగా ప్రస్తావించారు. ఈ నెల ప్రత్యూష కాలంలో చేసే స్నానానికి ఎంతో విశిష్టత ఉంది. బ్రహ్మాండ, నారదాది పురాణాలు మాఘ స్నాన విశేషాలను విస్తారంగా ప్రస్తావించాయి. ఈ స్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుర్దాయంతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మపురాణం పేర్కొంది. మృకండుడు, మనస్విల మాఘస్నాన ఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యు దోషాన్ని తొలగించిందని పురాణ కథనం. ఈ పుణ్యస్నానం సమంత్రకంగా, సంకల్పం చెప్పుకొని చేయాలి. ఏదైనా కారణం వల్ల మాఘస్నానం చేయలేకపోతే కనీసం స్నానం చేసిన వారిని దర్శించి, వారికి శక్తిమేరకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించి, నమస్కరించినా పుణ్యం వస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.
దుఃఖ దారిద్య్ర నాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ
ప్రాతః స్నానం కరోమ్యద్య మాఘే పాప వినాశనం
మకరస్థే రవౌ మాఘ గోవిందాచ్యుత మాధవ
స్నాననేనానే నమోదేవ యథోక్త ఫలదోభవ॥
అనే శ్లోకం పఠిస్తూ, ప్రయాగను స్మరించుకుంటూ మాఘస్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఏదైనా ఆలయానికి వెళ్లి, దీపారాధన చేయాలి. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో
దీపారాధన చేస్తే ఎంతో మంచిది.
నీటికి ఉన్న శక్తి అమేయమైంది. స్నాన, ఆచమన మార్గాల్లో జలశక్తి మానవుడికి అందుతుందని వేదవాక్కు. స్నానం దేహాన్ని శుద్ధి చేయడంతోపాటు మనలోని ప్రకోపాలను తగ్గించి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అందుకే స్నానాన్ని నిత్యవిధిగా పెద్దలు ప్రకటించారు. ‘నిత్య స్నానం, నైమిత్తిక స్నానం, కామ్య స్నానం, క్రియాంశ స్నానం, అభ్యంజన స్నానం, క్రియా స్నానం’ అని ఆరువిధాల స్నానాలు ఉన్నాయి. వీటిలో వైశాఖ, కార్తిక, మాఘ మాసాల్లో చేసే స్నానాలు, యజ్ఞయాగాదుల్లో చేసే స్నానాలను కామ్య స్నానాలుగా చెబుతారు.
సూర్యుడు చరించే రాశిని బట్టి సూర్యోదయ సమయంలో భానుడి కిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే లోహిత, అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. ఆధునిక వైజ్ఞానికులు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి పూర్వం చేసే స్నానం శ్రేష్ఠమైనదని, ఎంతో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు. ఈ కోణంలో చూసినా మాఘస్నానం ఎంతో ఆరోగ్యకారకం.
‘నదీనాం సాగరో గతిః’- సకల నదీనదాలు తమ ప్రవాహం పూర్తి చేసుకుని చివరికి సముద్రంలోనే సంగమిస్తాయి. కనుక, సముద్ర స్నానం చేస్తే సకల నదుల్లోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ముఖ్యంగా సముద్రుడి ప్రత్యేకత ఏమిటంటే … నిత్యం సూర్యకిరణాల వల్ల ఎంతో నీరు ఆవిరి అవుతున్నా సముద్ర పరిమాణం తగ్గదు. అలాగే, ఎన్నో జీవనదులు తనలో కలుస్తున్నా సాగరుడి పరిమాణం పెరగదు. స్థిరత్వం ఆయన ధర్మం. అలాగే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ మనిషి స్థిరత్వాన్ని కోల్పోకూడదు. సాగర స్నానం అందించే సందేశం ఇదే.
సాగరుడు సంతోషప్రదుడు. సంవత్సరంలో నాలుగుసార్లు సాగర స్నానం చేయాలనీ, అవి కూడా ‘ఆషాఢ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ’ పర్వదినాల్లో చేయాలని, అలా సాగర స్నానాలు చేసినవారికి సముద్రుడు సంపూర్ణ ఆరోగ్యం కలుగజేస్తాడని పురాణాలు చెబుతున్నాయి. నదీప్రవాహ వేగానికి ఎదురుగా నడుము మునిగే వరకూ నిలబడి, కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలని విధి. అది కూడా సూర్యోదయానికి గంటన్నర ముందు కాలంలోనే చేయాలి.
నీటిలో విద్యుచ్ఛక్తి ఉందని సైన్సు చెబుతుంది. కానీ, ఈ సైన్సు పుట్టక ముందే ఈ సత్యాన్ని గుర్తించిన మన మహర్షులు బ్రాహ్మీ ముహూర్తాన్ని నదీ / సాగర స్నానానికి అనుకూల సమయంగా నిర్ణయించారు. సూర్యోదయ కాలం నుంచి, సూర్యాస్తమయం వరకూ ప్రసరించే సూర్యకిరణాలలోని విద్యుచ్ఛక్తిని నదీజలాలు, సాగర జలాలు తమలో నిక్షిప్తం చేసుకుంటాయి. చంద్రుడు తన కిరణాలలోని అమృతత్త్వాన్ని, ఔషధీ విలువలను నదీజలాలకు అనుగ్రహిస్తాడు. నీటిలో ఉండే ఈ అద్భుతశక్తులు తిరిగి సూర్యకిరణాలకు పరావర్తనం చెంది అంతరించి పోతాయి. అందుకే సూర్యోదయానికి పూర్వమే స్నానం పూర్తి చేయాలనే నియమాన్ని విధించారు పెద్దలు.
మరి ‘నడుము మునిగే వరకూ నదీ ప్రవాహ వేగానికి ఎదురుగా ఎందుకు నిలబడాలి’ అన్న సందేహం రావచ్చు. గర్భస్థ శిశువుగా ఉన్న పిండానికి నాభినాళం ద్వారానే జీవశక్తులు అందుతాయన్నది ఎవరూ కాదనలేని సత్యం. సాగర, నదీజలాలలో నిక్షిప్తమైన సౌరశక్తి, సోమశక్తులను ఈ నాభి నుంచి శరీరం గ్రహిస్తుంది. అందుకే నాభి మునిగే వరకూ నదిలో నిలబడి స్నానం చేయాలి. సముద్రానికి ప్రవాహం
లేకపోయినా, ఉత్తుంగ తరంగాలు తమ తాకిడితో ఆ శక్తులను శరీరానికి అందజేస్తాయి. కనుకనే సముద్రుణ్ని పూజిస్తూ చేసే నాలుగు స్నానాలలో ‘మాఘ పూర్ణిమ’ స్నానం ముఖ్యమైనది.
మాఘ మాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. సముద్రం, నదులు అందుబాటులో లేని పరిస్థితిలో బావుల దగ్గర గానీ, చెరువుల వద్దగానీ ‘గంగ, సింధు, కావేరి, కృష్ణ, గౌతమి’ నదుల పేర్లు స్మరిస్తూ స్నానం చేస్తే ఆయా నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. దేనికైనా భక్తి ప్రధానం. అది లేనప్పుడు ఎన్నిసార్లు కాకిలా మునిగి, కర్రలా తేలినా ఫలితం శూన్యం.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానం చేసినా ఆరు సంవత్సరాలపాటు అఘమర్షణ (మంత్ర సంకల్ప) స్నాన ఫలం లభిస్తుందని శాస్త్ర వచనం. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణ ఫలాన్ని ఇస్తాయి. మాఘస్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుంది.
స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. వైష్ణవ ఆలయానికి గానీ, శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా శక్తిమేరకు దానధర్మాలు చేయాలి. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు, దోషాలు నశిస్తాయని నమ్మకం.
– డా॥ కప్పగంతు రామకృష్ణ