ఎంత దయో దాసులపై..
కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పిలుస్తున్నా విని పలికే స్థితిలో లేడా విశ్వయోని- జగత్కారణుడు శ్రీనివాసుడు! పతి ఎడబాటు సైపలేని ఆ పడతి పడుతున్న- ‘అడగాలా వద్దా’ అన్న తడబాటును విడివిడి- పొడిపొడి పలుకులలో ఎంతో కలివిడిగా రూపుకట్టించాడు మహాకవి పోతన వీనులవిందైన ఈ కుందనపు కందంలో..
- కం॥ ‘ఎంత దయో దాసులపై
- పంతంబున మకరి పట్టి బాధింపగ శ్రీ
- కాంతుడు చక్రం బంపెను
- దంతావళ రాజు కాయ దత్తాత్రేయా!’

కరిని కాపాడాలనే కడు ఉత్సుకత, ఉత్సాహంతో వడివడిగా పడి పోతున్న హరి వెంట పరుగిడుతున్న హరిణి పైటకొంగు మాత్రం ప్రియుని చేతిలో చిక్కువడే ఉంది. ‘ఎక్కడికి స్వామీ!’ అని ఆ జగజ్జనని మిక్కిలి మక్కువపడి పనిగట్టుకు పిలుస్తున్నా విని పలికే స్థితిలో లేడా విశ్వయోని- జగత్కారణుడు శ్రీనివాసుడు! పతి ఎడబాటు సైపలేని ఆ పడతి పడుతున్న- ‘అడగాలా వద్దా’ అన్న తడబాటును విడివిడి- పొడిపొడి పలుకులలో ఎంతో కలివిడిగా రూపుకట్టించాడు మహాకవి పోతన వీనులవిందైన ఈ కుందనపు కందంలో..
కం॥ ‘అడిగెదనని కడువడిఁజను
నడిగినఁ దనుమగుడ నుడుగఁ డని నడ యుడుగున్
వెడవెడ చిడిముడి తడఁబడ
నడుగిడు, నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్’
‘ఎక్కడికి, ఎందుకీ దౌడు?’ అని అడగాలని వడివడిగా ముందుకు అడుగులు వేసేది. అడిగినా పలుకడే అని ఆ కలికి (లక్ష్మి) సడిచేయక నడక మానేది. కినుక పూని వడి (వేగం)మాని వెనుకకు మరలి తొట్రుపడుతూ మరల మందకొడిగా ముందుకుసాగేది. మళ్లీ ఆగేది. అడుగులు వెయ్యలేక అలాగే తడబడుతూ నడిచేది. ఇందుశీతల- చంద్రుని వలె చల్లనైన ఇందిర మనసులోని ఆందోళనకు అద్దంపట్టే అక్షరాల కూర్పు పై పద్యంలోని నేర్పు! అక్షరాలన్నీ లఘువులే కనుక దీన్ని ‘సర్వ లఘుకంద’మని అంటారు. పద్యపు నడవడిలోని ‘డ’కారాల మువ్వల సవ్వడి భావుక హృదయాలకు కవనపు బువ్వ!- కవితా ఇష్టమిష్టాన్నం! ‘ఒకే అక్షరాన్ని తిరిగి తిరిగి ప్రయోగించి ఉద్దిష్ట (ఉద్దేశించిన) భావానికి ఊతం సాధించడం ఈ పద్యంలో పోతన్న చేసిన గారడీతనం’ అన్నారు సినారె.
మేఘం వెంట మెరుపు తీగవలె విష్ణువు వెంట వైష్ణవి- లక్ష్మి కూడా వెళ్లసాగింది. వినువీధిలో వేంచేస్తుండగా విబుధవరులు- బ్రహ్మాది దేవతలు వీక్షించిన విష్ణుమూర్తిని పోతన మరల మరో మత్తేభ వృత్తంలోనే వర్ణించాడు-
మ॥‘ వినువీధిం జనుదేరఁ గాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తి నిరాకరిష్ణుఁగరుణా వర్ధిష్ణు యోగీంద్ర హృ
ద్వన వర్తిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరి
ష్ణు, నవోఢోల్లసదిందిరా పరిచరిష్ణున్ జిష్ణు రోచిష్ణునిన్’
పోతన ఉవాచ- పంతం పూని అసురులను అంతమొందించిన వాడు, దయాసాగరుడు, యోగీంద్రుల హృదయ సీమల యందు మెదలువాడు, క్షమాశీలుడు, భక్తుల వైభవ, ప్రాభవ సిద్ధులను వృద్ధిపరచువాడు, నిత్యనూతన యవ్వనంతో చెలువొందే, చందురు తోబుట్టువు ఇందిరను సేవించువాడు, విజయశీలుడు, విశేష తేజోవిరాజితుడు అయిన అచ్యుతుని అమరులు ఆకాశమార్గంలో అవలోకించారు. భక్తుల హృదయాలకు చందనం వంటి ఆనందరూపునికి వందనాలు అర్పించారు. ఆ ఘనునికి వెనువెంటనే చనుదెంచుచున్న- వస్తున్న, దేవేరి సిరి (శ్రీదేవి), అరి (సుదర్శనం) మొదలైన వారి దివ్యదర్శనం గాంచి, కరిని కనికరింప వస్తున్న హరికి- ‘ముర’ అసుర భంజనునికి ‘ఓం నమో నారాయణాయ’ అని నినదిస్తూ నమస్సుమాంజలులు సమర్పించారు. ఆ సమయంలో మత్తేభరాజుకు విముక్తి కలిగించాలనే తొందరలో మైమరచి మాధవుడు అమరుల మొక్కులు అందుకోలేదు. ప్రభవిష్ణువు విష్ణువు ఇభ (గజ) రాజుకు అభయ ప్రదానం చేసే శుభ సమయంలో కూడా మహాకవి మత్తేభ వృత్తాన్ని మరువలేదు. ఈ ఘట్టంలో..‘తన వెంటన్ సిరి, లచ్చి వెంట నవరోధ వ్రాతమున్’ అన్న విధంగా ఒకదాని వెంట ఒకటిగా ఏడు మత్తేభాలు- పద్యాలు పరుగెత్తినాయి. ‘రావే ఈశ్వర! కావవే..’ అన్న కరీంద్రుని కుయ్యి (మొర) విన్న ఆపన్న ప్రసన్నుని- వెన్నుని మనసు వెన్నవలె కరిగింది. మదిలో తుదివరకూ మొరలిడిన మత్తేభమే మెదిలింది. ఆ పరమాత్మనే తన హృదిలో పదిల పరచుకొన్న మృదుల హృదయుడు మహాకవి పోతన్నకీ, మహావిష్ణువుకీ సాధారణీకరణం- భావ సాదృశ్యం సిద్ధించింది. అందుకే అమాత్యునికి కూడా అసాధారణంగా, అసదృశంగా మత్తేభ వృత్తాలే చిత్తంలో దొర్లి వచ్చాయని ‘కరుణ శ్రీ’ గారి కమనీయ భావన!
మ॥‘కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగాఁ బంపె, స
త్వరితా కంపిత భూమి చక్రము మహోద్యద్విస్ఫులింగచ్ఛటా
పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండభాండచ్ఛటాం
తర నిర్విక్రముఁ పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ జక్రమున్’
ఇవ్వారి ప్రచారోత్తమున్ వారింపందగు వారలెవ్వరు?-(గజేంద్రుడు) కరుణావరుణాలయుడు (దయా సముద్రుడు) శౌరి- విష్ణువు, వారి (జల) చరమైన మకరిని వారించ- చంపడానికి తన సుదర్శన చక్రాన్ని పంపాడు. అది వసుమతీ (భూ) వలయాన్ని వణికింప జేసే వేగం కలది! తన నుంచి వెలువడే అగ్నికణాల కాంతులతో ఆకాశాన్ని ఆవరించగలది, విక్రమించి శుక్రగ్రహాన్ని కూడా నిగ్రహించ గలది! పెక్కు బ్రహ్మాండ భాండాలను తేజఃపుంజాలతో- వెలుగుల సమూహాలతో పూరింపగలది! దేవతా బృందాలను దయతో కాపాడేది! తరగని శక్తితో తిరుగులేక తిరిగేది!
చక్రాయుధం చిత్త (మనో)వేగంతో చకచకా చని, కామక్రోధాది అరిషడ్వర్గానికి అతిథి గృహమైన, కరిరాజు రుధిర (రక్త) ధారల రుచి మరిగిన మకరి శిరస్సు ఖండించి ప్రాణాలు హరించింది. ఈ ప్రసంగంలో సందర్భోచితంగా సద్యఃస్ఫురణతో సహజపాండిత్యుడు ‘మకరం’ మీద ఎంతో సుకరంగా అలవోకగా, ఆలంకారికంగా అందగించిన చిత్రమైన ఒక కందం చెప్పి పాఠక బృందాన్ని అలరించాడు, ఆలకించండి!…
కం॥ ‘మకర మొకటి రవిఁజొచ్చెను
మకరము మరియొకటి ధనదు మాటున డాఁగెన్
మకరాలయమున దిరిగెడు
మకరంబులు కూర్మరాజు మరవున కరిగెన్’
ఆ సమయంలో ద్వాదశ రాశులలో ఉండే నక్రం (మకరం) చక్రానికి భయపడి అర్కుని (సూర్యుని) చాటున నక్కిందట! నవ నిధులలోని మరో మకరం ప్రాణ భిక్షకై యక్షరాజు కుబేరుని మాటున దాగి రక్షణ పొందిందట! ఇక మకరాలయం (సముద్రం)లో తిరిగే మొసళ్లు ఊరికే చావటానికి ఇచ్చగించక కచ్ఛపరాజు- ఆదికూర్మం దరిజేరి దాగున్నాయట!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

