‘ఆత్మకు ఏదీ అంటదు. శుచి అశుచి మన శరీరాలకే’ అంటుంది బృదారణ్యక ఉపనిషత్తు (6-3-16).
ఆంజనేయుడు ద్రోణాద్రిపై తపస్సు చేసుకొంటూ రోజూ ఉదయాన్నే వచ్చి శ్రీ రాముడికి తైలం మర్దించి తల స్నానం చేయించి వెళ్లేవాడట. దారిలో ఒక పట్టణంలో శ్రీమంతుడైన వైశ్రవణుడు అనే వైశ్యుడు ఉండేవాడు. ‘రాముడే ప్రత్యక్ష దైవం. అయోధ్యకు వెళ్లావా’ అని ఎవరైనా అడిగితే ‘నాక్కెడిది తీరిక’ అనేవాడు. ఒక జ్ఞాని ఎప్పుడైనా రామ నామం స్మరించు అన్నాడు.
వైశ్యుడు మల విసర్జన వేళలోనూ స్మరించవచ్చా! అని అడిగితే… ‘పరిశుభ్రత శరీరానికే! మనసుకు కాదు. స్మరణ మనసుతో కదా! ..’ అన్నాడు. ధనం మీది ధ్యాసతో మల విసర్జన బాధాకరమైనప్పుడల్లా వైశ్రవణుడు ‘రామ నామ స్మరణ’ చేయసాగాడు. ఒకసారి హనుమ అయోధ్యకు వెడుతూ ఇది చూశాడు. ‘ఛీ!ఛీ!’ అనుకొని తక్కువ ఎత్తులో ఎగురుతూ ఆ వైశ్యుని వీపున ఒక్క చరుపు చరిచాడు.
తరువాత అయోధ్య చేరి శ్రీ రాముడికి నూనె రాస్తున్నాడు హనుమ. రాముడు బాధతో మూలుగుతున్నాడు. అడిగితే వీపు మీద ఒక భక్తుడు అరచేత్తో బాదాడన్నాడు రాముడు. ‘ఎవడు? వాడిని ఇప్పుడే శిక్షిస్తాను’ అన్నాడు హనుమ. ‘మన భక్తుడే పోనీలే’ అన్నాడు రాముడు. ‘వాడు ఎక్కడున్నాడ’ని అడిగాడు హనుమ. ‘ఇక్కడే ఉన్నాడు. నాకు తైల మర్దన చేస్తున్నాడు..’ అన్నాడు రాముడు. ‘స్వామీ! నేను కొట్టానా!’ అంటూ విలపించాడు హనుమ. ‘నువ్వు ప్రత్యక్షంగా కొట్టలేదు. నా నామం జపించే భక్తుడిని కొట్టావు. నాకు తగిలింది.. ఆ దెబ్బే అతనికి తగిలితే కాలం చేసేవాడు. నీకు అపవాదు వచ్చేది. నువ్వూ భక్తుడివేగా! అతను మరణిస్తే రామ నామం అచ్చి రాదనీ ప్రచారం జరిగేది. అందుకే నేనే ఆ దెబ్బ భరించాను’ అన్నాడు రామచంద్రుడు.
హనుమ వెంటనే శ్రీరాముడి పాదాలపై పడిపోయాడు. ‘స్వామీ! ఇహపర సాధకమైన రామ నామాన్ని జపించే వారిని సర్వదా సర్వధా రక్షిస్తాను. ఎవరు, ఏ కాలం, ఏ ప్రదేశం, ఏ నియమం.. చూడను’ అని ప్రతిజ్ఞ చేసి వైశ్యుని ఇంటికి వెళ్లి క్షమాపణ కోరాడు హనుమ.
– డా॥ వెలుదండ సత్యనారాయణ