ముంబై, జూన్ 11 : ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందువరుసలో నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తంగా 13,223 మందిని రిక్రూట్ చేసుకున్నాయి. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6.28 లక్షలకు చేరుకోగా, అత్యధిక మంది బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)లో ఉన్నారు. 2024-25 నాటికి 6,14,980 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా..ఆ తర్వాత ఏడాదికి 6,28,203కి చేరుకున్నట్టు బ్యాంకింగ్ వార్షిక నివేదికలో వెల్లడైంది.
మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎనిమిదింటిలో ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలు ఉన్నాయి. మిగతా నాలుగింటిలో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు ఇప్పటి వరకు తమ వార్షిక నివేదికను విడుదల చేయలేదు.
