టైటిల్ బావుంటే సినిమా సగం విజయం సాధించినట్టే. కథానాయకుడు శ్రీవిష్ణు ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తుంటారు. ఆయన సినిమాల పేర్లు క్యాచీ ఉంటాయి. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, సామజవరగమన, ఓం భీమ్ బుష్, సింగిల్, విష్ణు విన్యాసం.. ఈ టైటిల్సే కాదు, సినిమాలు కూడా హిట్సే. ఈ వరుసలోనే మరో గమ్మత్తైన టైటిల్‌తో శ్రీవిష్ణు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
బ్లాక్‌బస్టర్ ‘సామజవరగమన’ని శ్రీవిష్ణుకి అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ అని నామకరణం చేశారట. టైటిల్‌తోనే పాస్ మార్కులు పడిపోయాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అటు కుటుంబ ప్రేక్షకులను, ఇటు యువతరాన్ని టార్గెట్ చేస్తూ వినోదం, భావోద్వేగాల కలగలుపుగా ఈ సినిమా రూపొందనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివున్నది.