రాసక్రీడ అద్వైత క్రీడ. ఆత్మ క్రీడ. ఇక్కడ ఇద్దరు లేరు. రసస్వరూపి అయిన భగవంతుడే ఆస్వాద్యుడు, ఆస్వాదకుడు కూడా. భోగ్యమూ తానే, భోక్తా తానే. కాన, ద్వైత బుద్ధి- భావంతో ఈ లీలా రసానుభూతిని పొంద చూడడం అసంగతం. కాక, ఏకరూపులమయ్యే ఈ లీలను ఆకళింపు చేసుకోగలం. ‘రసానాం సమూహః రాసః’- బహు విధాల రసా- ఆనందాల పుంజీ- రాశీ భూతమైన ఆనందమే కుంజ విహారి మురారి ఆడిన రాసక్రీడ. ఇందులో ఆనందం బిందువులు- ఖండితంగా, విడివిడి తునకలుగా కాక, కలివిడిగా తలమునకలుగా బలపడి అనంత రస సింధువుగా విలసిల్లుతుంది. ఈ ఆనందంలో భద్రము, క్షుద్రమూ- హెచ్చు, లొచ్చు (తక్కువ) అన్న భేదం ఉండదు. అది ఏకరసం- హాని వృద్ధి రహితం.
గోపీత్వం అంటే స్త్రీత్వం కాదు. అది దివ్య ఉన్మాదం. మహా ప్రేమ భావం. స్త్రీ పురుషులందరూ గోపీత్వం- గోపీ భావం పొందవచ్చు. ‘స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగన్నాథైక పూరుషం’- గోపాలు డొక్కడే పురుషుడు. సమస్త జీవులూ స్త్రీలే- గోపికలే. జీవుడు ప్రేయసి, జగన్నాథుడు ప్రియుడు. ఈ రస రాజమే ‘మధుర’ రసం. ఈ మధుర రస సాగరమే రాసం’. రాధా గోవిందుని కొరకు రోదించే వారే గోపికలు. భుజాలపై సంసారం, బుద్ధిలో భుజగశయనుడు! బైట సంసారం, లోన కంసారి! వారే గోపికలు. రాధాదేవి రాసేశ్వరి, యోగ మాయా స్వరూపిణి. ‘రసో వై సః’- బ్రహ్మ రస స్వరూపుడైనా ‘యోగ మాయ’ లేనిదే రాసం లేదు. రాధాబాల ‘లీలా వినోదిని’. రస స్వరూపుడైన వసుదేవ సూనుడు సౌందర్య, మాధుర్య లావణ్య నిధి. వాసుదేవుడు చిదంశ, బృందావనం సదంశ, గోపికలు రసాంశలు- ఆనందాంశలు. వ్రజభూమి రస్య- రస- రసికుల త్రిపుటి. రాసం ఈ త్రిపుటీ భంగలీల. శ్రీకృష్ణ పరమాత్ముని త్రిభంగీ తత్తమే మహత్తమయమైన రాసలీల!
రాసలీలలో, వ్యాస పుత్రుడు శుకుడు ఏ గోపిక పేరూ పేర్కొనక కాశ్చిత్, అన్యా, అపరా, ఏకా ఇత్యాది సర్వనామాలనే సంధించాడు. అమాత్యుడు కూడా ‘ఒక్క, ఒకతె’ అని బాదరాయణినే అనుసరించాడు. సర్వేశ్వరుడు వేణుగానం చేసి సర్వజీవులను రాసక్రీడకు ఆహ్వానిస్తాడని, అందరూ అధికారులే అని శ్రీధరుని వ్యాఖ్యానం. ఇక, రాసలీలలోనే కాదు, భాగవతంలో ఎక్కడా రాధానామ ఉచ్చారణ కూడా కనిపించదు. అయితే, ‘శ్రీభగవానువాచ, శ్రీ శుక ఉవాచ’ అని అన్నప్పుడు ‘శ్రీ’కారం రాధకు సంకేతం. భగవంతుడు మాధవుడు రాధా వల్లభుడు. వైయాసకి- శుకుడు రాధకు శిష్యుడు. గత జన్మలో ఈ బాదరాయణి- శుకుడు రాధ పెంపుడు శుకము- చిలుక. ఆ శుకమే ఇప్పటి ఈ శుకుడు. తన శ్రేయస్సు- మేలు కోరువాడు, ప్రేయస్సయిన- ప్రియమైన తన గురువు నామాన్ని ప్రత్యక్షంగా పలకడాన్ని శాస్త్రం నిషేధించింది. మరీ విశేషంగా, రాధా నామం ఉచ్చరించిన మాత్రాన సచ్చరిత్రుడైన శుకదేవునికి ఆరు మాసాలపాటు మూర్ఛ- సమాధి వస్తుందట! అందుకని పరీక్షిత్తు మేలుకోరి శుకముని పరమపావని రాధారమణి నామధేయాన్ని పలుకకుండా నిండా జాగ్రత్త వహించాడట!
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! ఆ పల్లవాధరలు- గోపికలు నల్లమబ్బుల నడుమ తటిల్లతల- మెరుపు తీగల్లాగ ప్రకాశిస్తూ నల్లనయ్యతో ఉల్లాసంగా ఆడారు, పాడారు.
క॥ ‘అంకరహితేందు వదనలు
పంకజలోచనుని గూడ పరగ నటింపం
గింకిణుల నూపురంబుల
కంకణముల మ్రోత లెసగె గర్ణోత్సవమై’..
మచ్చలేని తొగ నెచ్చెలి- చందురుని వంటి మోములు గల మచ్చెకంటులు- మీనాక్షులు, కంజాక్షుడు కృష్ణునితో కూడి చక్కగా నాట్యం చేసే వేళ, వారి నడుముల కింకిణులు, చిరుగంటలు, కాలి అందెలు, కర కంకణాలు గల్లు- గల్లున మ్రోగుచూ వీనులకు విందుగా
వినిపించాయి.
క॥ ‘హరిణీ నయనల తోడను
హరి రాసక్రీడ సేయ నంబర వీధిన్
సురనాథులు భార్యలతో
సొరిది విమానంబు లెక్కి చూచిరిలేశా!
రాజా! లేడికన్నుల వంటి కన్నులు గల ఆ కిన్నెర కంఠులు- గోపికలతో రాజీవాక్షుడు చేసిన రాసక్రీడను వినువీధిలో విబుధ (దేవ) వల్లభులు వారి దేవేరు- భార్యలతో బారులు తీరి విమానాలెక్కి వీక్షించారు.
క॥ ‘రామల తోడను రాసము
రామానుజుడాడ జూచి రాగిల్లి మనో
రాముల మీద వియచ్చర
రామలు మూర్ఛిల్లి పడిరి రాజకులేంద్రా!
‘రాజా! రామానుజుడు- వాసుదేవుడు గోపభామలతో రాసలీల ఆడుతుండగా చూచి కామ పీడితలై దేవతా రామలు- సతులు పారవశ్యంతో తూలి తమ ప్రియతమ పతులపై వాలిపోయారు.’ మాకంద (మామిడి) ఫలం లాంటి హృద్యమైన పై కంద పద్యంలో అమాత్యుడు పోతన, ప్రాస స్థానంలో ‘రామ రామ’ అని పునరుక్తిగా పలుకుతూ, వాసుదేవుని రాసలీల సకల జన మనోల్లాసకరమైన రామరాజ్యం వలె భాసిల్లిందని సమంజసంగా వ్యంజింపజేశాడు.
శుకుడు- రాజా! ఇలా గోపికలు షోడశ- పదహారు విధాల శృంగారాలచే శోభితలై, అనేక భంగిమలతో, దేవగణాలు రసావేశంతో పరవశిస్తుండగా దేవదేవునితో కలసి నృత్యం చేశారు. ఆ రాససభలో రేణువాసాలే- తుమ్మెదలే గాయకులు. ఈ విధంగా షడ్గుణైశ్వర్య సంపన్నుడు శ్రీకృష్ణుడు- సర్వజీవుల ఆత్మలయందు క్రీడించు పరమాత్మ, ఎందరు గోపికలో అందరు గోవిందులుగా తానే ఏర్పడి, ‘యథార్భకః స్వప్రతిబింబ విభ్రమః’- ‘నిజ ప్రతిబింబంబుల తోడం గ్రీడించు బాలు పోలిక’… అమాయకుడైన పసిబాలుడు నిర్వికార భావంతో, అద్దంలోనో, నీటిలోనో తన ప్రతిబింబాల విలాసాలను చూచి వానితో ఉల్లాసంగా ఆడుకొనే విధంగా, నందగోపాలుడు గోపికలతో రాసక్రీడ సాగించాడు. అనగా, ఆ వాలుగంటుల- గోపికల కలయిక తనను అంటలేదని పరమార్థం. ఎలాగంటే, రాసం బింబ-ప్రతిబింబ న్యాయానుసారమైన దివ్య లాస్య విలాసం. ఇది అపురూపమైన స్వరూపానందమే కాని, విరూపమైన ఆభాసా (అవాస్తవిక) నందం కాదు.
కామ గంధమేలేని గోపీ ‘భామా కలాపం’! బింబ ప్రతిబింబాలు అభిన్నాలు. కారణం?- బింబం లేక ప్రతిబింబానికి స్వతంత్రమైన సత్త- ఉనికి లేదు. బింబానికి ప్రతిబింబం అనన్యం. కనుక, ‘జీవో బ్రహ్మైవ నాపరః’ (జీవుడు బ్రహ్మమే కాని అన్యుడు- ఇతరుడు కాదు). ‘జీవో దేవః సనాతనః’ (జీవుడూ సనాతనుడైన దేవుడే). శుకుడు- రాజా! ఇలా బాల గోపాలుడు రాసలీల చాలించి చెలువ- గోపికలతో కూడి జలక్రీడలాడటానికి తలపడ్డాడు. తరువాత నీటి నుండి వెడలవచ్చి, తనలో తాను (స్వరతిః) క్రీడించువాడైనా కరీంద్రుడు- కరేణువు- ఆడ ఏనుగులతో ఆడునట్లు, వేణు మాధవుడు పూబోణులతో క్రీడించి వారిని తృప్తి పరచాడు. ఇట్లు వెన్నుడు శరత్కాలపు వెన్నెల రాత్రులలో ఇంద్రియ- వీర్యస్ఖలనము లేకయే ఆ చంద్ర వదనలతో క్రీడించాడు.
కావున, ఇది కామలీల కాదు. నివృత్తిపరమైన కామవిజయ లీల! తనకంటే ఇతరంగా భోగ్య (అనుభవింపదగిన) పదార్థమున్న దన్న మతి- తెలివిలోనే ఇంద్రియ స్ఖలనం. ‘భ్రాజిష్ణుః భోజనం భోక్తా’, ‘అన్నమన్నాద ఏవచ’- (విష్ణు సహస్ర నామం) తినబడేది, తినేవాడూ రెండూ తానే కాన, ‘దృశ్య రూపేణ చ స్వయం’- ద్రష్ట అయిన తానే దృశ్యంగా కూడా ఉన్నాడు కాన, తన్ను తానే (ఆత్మరతి) అనుభవించాడు కాని, స్వాతిరిక్త- తనకన్నా అన్యమైన పదార్థాన్ని కాదు. ఇదే ఆత్మరతి, ఆత్మక్రీడ! రాసలీలకు ఇంతకుమించి ఎంచదగిన, అపశ్రుతి లేని- నిర్దోషం నిస్సంశయమైన, నిగమనం- ఉపసంహృతి
(ఉపసంహారం) ఇంచుక కూడా ఉండదేమో!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006