భారతావనిలోని బృందావనం బృహదారణ్యకమని భక్తుల, బ్రహ్మవేత్తల భావం.బృందావనంలోని మట్టి, ఇష్టిక- ఇటుకలు, రాళ్లు-రప్పలు, ఇసుక రేణువులు,వేణువులు- వెదురులు, లతలు, వనస్పతులు, నికుంజ తతులు- పొదరిళ్ల సమూహాలు, గుంజ- గురువెందలు సర్వం కంజాక్షుని- కృష్ణుని స్వరూపాలే,చిన్మయాలే! హ్లాద- ఆనంద స్వరూపుడైన మాధవుని వేణుగానం నాద బ్రహ్మ! అనాది బ్రహ్మచారి అయిన కృష్ణుడు కృషకు- కర్షకుడై ‘వామదృశాం’- గోప భామల హృదయ క్షేత్రాలలో ‘క్లీం’- కామరాజ బీజం నాటాడు.
‘ప్రేమైవ గోప రామాణాం కామ ఇత్యగమత్ ప్రథామ్’- గోపాంగనల దివ్యప్రేమనే ‘కామం’ అనే నామంతో వ్యవహరించడం లోకాచారమయింది. వారిది ప్రేమమయ కామం. అబ్జాత నయనుని- శ్రీరాముని, శ్రీకృష్ణునిపై శూర్పణఖ, కుబ్జలది కామమయ ప్రేమ. కామంతో అదుపుతప్పి అయినా అకాముని- కృష్ణుని వద్దకు కాలు కదిపితే, జీవితంలో అది ఒక పెద్ద కుదుపు- మలుపు. ఆ కామం కమనీయమైన ప్రేమగా- భగవత్కామంగా మారుతుంది. భగవత్కామం ఆమం- పచ్చి, అపరిపక్వత, రోగంతో కూడిన భౌతిక కామం కాదు. ప్రాపంచిక (ఐంద్రియ) కామం బాధకం, బంధకం. పరమాత్మ (ఆత్మీయ) కామం మోదకం, మోక్షదం.పరీక్షిన్నరేంద్రుడు శుకయోగీంద్రుని ఇలా ప్రశ్నించాడు..
కం॥ ‘ జారుడని కాని కృష్ణుడు
భూరి పరబ్రహ్మ మనియు బుద్ధి దలంపన్
నేరరు; గుణమయ దేహము
లేరీతిన్ విడిచిరింతు? లెరిగింపు శుకా!’
గురుదేవా! గోపికలు గోవిందుని- కన్నయ్యని జారుడని- తమకు వన్నెకాని (ప్రియుని)గానే భావించి వలచారు గాని, భూరి- లోకోత్తరుడైన పరబ్రహ్మగా, వెన్నుడు (విష్ణువు) అనే తెలివితో తలచినవారు కాదు గదా! అట్టి విషయాసక్తి కల గోప భామినులు సత్తరజస్తమో గుణాలతో కూడిన తమ మాయామయ కాయా(దేహా)లను అంత వడిగా ఎలా పాయ-విడువగలిగారో నాకు నుడవ (చెప్ప)వయ్యా!
శుక ఉవాచ… అవనీపతీ! ‘నహి వస్తుశక్తిః బుద్ధి (శ్రద్ధాదిక) మపేక్షతే’ (శ్రీధరాచార్యులు)… వస్తువు- పదార్థంలోని శక్తి, అనగా దాని గుణం వినియోగదారుని బుద్ధి అనగా భావాన్ని అనుసరించి ప్రవర్తించదు. అది బుద్ధిని అపేక్షించక, స్వతంత్రంగా తన పని తాను చేసుకుపోతుంది. అమృతాన్ని విషమని భావించి తాగినా అది అమరత్వాన్ని కలిగిస్తుంది కదా! తెలిసి తొక్కినా, తెలియక తొక్కినా నిప్పు కాలుస్తుందన్న ముప్పు ఎప్పుడూ ఉంటుందిగా! స్త్రీ, పుం, నపుంసక భేదం లేక సర్వం తానే అయిన భగవంతునికి జారత్వముంటుందా? తనయందు అవ్యభిచారిణీ- అనన్యభక్తి (పరమ ప్రేమ) కలవారిని (సంసార సాగరం తారయన్ ‘తారః’- శంకరభాష్యం) సంసార సాగరం నుండి ‘తారుడు’- తరింపజేయు మారజనకుడు- కృష్ణుడు ‘జారుడు’ వ్యభిచారి అవుతాడా? జనార్దనుడు- మాయా మర్దనుడు కంసారి, జీవుల అవిద్యా కామ కర్మలను అనగా సంసారాన్ని జీర్ణింప (నశింప)జేసే జారుడు. జన్మజన్మల పాపాలను హరించే చోరుడు- జార చోర శిఖామణి!
మ॥ ‘మును నే జెప్పితి జక్రి కిం బగతుడై మూఢుండు చైద్యుండు పెం
పున గైవల్య పదంబు నొందె; బ్రియలై పొందంగ రాకున్నదే?
యనఘుం డవ్యయు డప్రమేయు డగుణుండై నట్టి గోవింద మూ
ర్తి నరశ్రేణికి ముక్తి దాయిని సుమీ! తెల్లంబు భూవల్లభా!’
శుకుడు- రాజా! మూఢుడైన శిశుపాలుడు, గూఢుడు (గంభీరుడు) ఆఢ్యుడు (సమృద్ధుడు, శ్రేష్ఠుడు) అయిన మురవైరి- హరితో వైరం పూని కూడా మోక్ష పదవిని చూర గొన్నాడని, ప్రాకృత- గుణమయ శరీరాన్ని విడిచి విష్ణు పార్షదుడయ్యాడని ఇంతకుముందే నేను నీకు వివరించాను. మరి, గోవిందునికి ప్రియమైనవారు పొందరాని పదం అంటూ ఏదైనా ఉందా? అనఘుడు- పాప రహితుడు, అనంతుడు- దేశ, కాల, వస్తువుల అవధులు లేనివాడు, అప్రమేయుడు- మనోవాక్కులకు అందనివాడు, అగుణుడు- ప్రాకృత గుణ రహితుడూ అయిన అచ్యుతుని అవతారం మానవులకు అవశ్యం- కచ్చితంగా ముక్తి దాయకం అనడంలో అనుమానమేముంది? మూలంలోని (29వ అధ్యాయం- 13, 14 శ్లో॥) రెండు శ్లోకాలకు పై మత్తేభం, పుణ్యశ్లోకుడు, భక్తి కవితా విద్యారణ్యుడు, భావుక భక్త వరేణ్యుడూ పోతన అమాత్యుని హృద్యమైన అనువాదం! ‘కిముతాధోక్షజ ప్రియాః’ అన్నదానికి ‘చక్రి కిం.. బ్రియలై పొందంగ రాకున్నదే?’ అన్నది మాకంద మాధుర్యం చిందించే అందమైన తెనుగు సేత!
ఆ॥ ‘బాందవమున నైన బగనైన వగనైన
బ్రీతినైన ప్రాణభీతినైన
భక్తినైన హరికి బరతంత్రులై యుండు
జనులు మోక్షమునకు జనుదు రధిప!’
చుట్టరికంతో కాని, గిట్టని భావం- వైరంతో కాని, గుట్టయిన కామం- ప్రణయంతో కాని, తేనెపట్టు వంటి ప్రీతి- మిక్కిలి మక్కువతో కాని, కట్టి కుడుపు ప్రాణభీతి- మరణ భయంతో కాని, నందు పట్టి (బాలకృష్ణుని) యందలి రెట్టింపు భక్తితో కాని, ఎట్టి భావంతోనైనా సరే, గోవిందునికి పరతంత్రులై- ధ్యాన పరవశులై ఉండునట్టి మానవులు ముక్తి భాజనులౌతారు. ‘అంతేకాదు, హరి సోకిన- తాకిన మాత్రాన గిరులూ, తరులూ మున్నగు అచరాలు- స్థావరాలు కూడా ముక్తి పొందగలవన్న విషయంలో ఎందునా సందేహం లేదు’- ఈ వాక్యం శ్రీధరుల భాష్యానికి అమాత్యుని అనువాదం.
అందరిలో అధికుడు- సాటిలేని మేటి, అనంత కల్యాణ గుణగణాల పేటి- సంపుటి, చతుర నటమూర్తి, మాటల నేర్పరి అయిన మాధవుడు తన తీయని పాట రవళిని విని తనను చూడ వచ్చిన గొల్ల చేడియలను గాంచి తన వాగ్వైభవం తేటతెల్లమగునట్లు మృదువుగా ఇలా మందలించాడు… ఇందు వదనులారా! మీకు శుభమే కదా! మీ మందకు- గోకులానికి ఎలాంటి భయాలూ లేవు గదా! సింహాలు, శార్దూలాలు (పులులు), శుండాలాలు- ఏనుగులు మొదలైన క్రూర మృగాలు సంచరించే ఈ ఘోర రాత్రివేళలో అతివలు- అబలలైన మీరు ఇంత దూరం రావచ్చునా? ఏల వచ్చారు? మీరు వచ్చిన జాడ తెలియక మీ కుటుంబ పెద్దలందరూ- ‘మీరు మేరలు- హద్దులు మీరిపోయార’ని వ్రేపల్లెలో మీకై ఎంతగా గాలిస్తున్నారో? మగువలారా! ఇంత తెగువ (సాహసం)తో కూడిన పనులు మీకు తగునా? ఇంటి మర్యాదను బుగ్గి గావించి, మగవారిని సిగ్గులపాలు చేసి, అత్తమామలకు, తల్లిదండ్రులకు, తోబుట్టువులకు ఎగ్గు (అనాదరం, కీడు) కలిగిస్తూ కుల స్త్రీలు జార- మారు మగల మీది మరుల (మోహాల)తో ఇలా అరుదెంచవచ్చునా? లోకులు మెచ్చుకొంటారా? ‘జారు జేర జనదు చారుముఖికి’- సతీమతల్లి- సాధ్వీమణికి ఉపపతి- జారునితో పొత్తు వాంఛ నీయం కాదు.
చ॥ ‘ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసూ
న దళ విరాజితంబగు వనంబు, మనంబుల మేర దప్పెనో?
పొదడటు నేడ్చు బిడ్డలకు బోయుడు పాలు, విడుండు లేగలన్
మొదవులకున్, నిజేశ్వరుల ముద్దియలార! భజించుడొప్పుగన్’
సుందరీమణులారా! ఇది యమునా తీరమందలి అందమైన బృందావనం. సమృద్ధమైన జలాలతో గుబురుగా పెరిగిన చెట్లు చక్కని చిగురుటాకులతో, రెక్కలు తొడిగిన పూల గుత్తులతో చూడ సొంపుగా ఉన్నాయి. అచ్చట ముచ్చట (వేడుక) తీర్చుకొని ఇచ్చోటనుండి వెడలిపొండి. మీ మనసులు హద్దులు మీరాయి. ఇక మందకు మరలిపొండి. మీకై పలవరిస్తున్న మీ ముద్దుల పిల్లలకు పాలివ్వండి. మొదవు- పాడి ఆవులకు దూడలను వదలండి. కాంతలారా! నన్ను కోరి నాపై భ్రాంతి- అపేక్షతో మీరిచ్చటికి వచ్చారు. మీకు ఎంత మాత్రం కొరత లేదు. మీకు మేలే జరుగుతుంది. సఖులారా! మీరే కాదు, అఖిల ప్రాణులూ నాకు ప్రియమైనవే. ఐనా, మీరిచ్చట నిలువ రాదు. పతిసేవయే పడతులకు పరమధర్మమని పెద్దలు పలుకుతూ ఉంటారు.
కం॥ ‘ధ్యానాకర్ణన దర్శన
గానంబుల నా తలంపు గలిగిన జాలుం
బూనెదరు కృతార్థత్వము
మానవతుల్! చనుడు మరలి మందిరములకున్’
‘చెలులారా! అలుపెరుగక నన్ను తలచుట, నన్ను గూర్చి వినుట, నను కనుట, నాపైని పాటలు పాడుట, ఇలా అంచితం (శ్రద్ధ)గా నా యెడ మనసుంచితే చాలు. మీరు ధన్యురాండ్రవుతారు. ఇక మీరు మాటాడక మీ మందిరాలకు మరలిపొండి’.
(సశేషం)