ద్వాదశ మాసాల్లో కార్తికం కృష్ణుడికి అతి ప్రియమైనది. పరమ పవిత్రమైన ఈ పుణ్య కాలంలో.. విష్ణుమూర్తిని ఆరాధించిన వారికి స్వామి సాన్నిధ్యం లభిస్తుందని పద్మ పురాణం చెబుతున్నది. కార్తికంలో శ్రీకృష్ణుడి కోసం చేసే ఎంత అల్పమైన సేవ అయినా పరమపదాన్ని అనుగ్రహిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ మాసంలోనే కృష్ణభగవానుడు దామోదర లీలను ప్రదర్శించాడు. తన భక్తులను అనుగ్రహించాడు.
ఒకానొకసారి బృందావనంలో ఇరుగుపొరుగు స్త్రీలంతా కలిసి యశోదమ్మ దగ్గరికి వచ్చారు. ‘నీ ముద్దుల తనయుడు మా ఇళ్లల్లో కుండలను పగలగొట్టి వెన్నను దొంగలిస్తున్నాడని, వాటిని రక్షించుకునేందుకు మేమెన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా ఉంద’ని వాపోయారు. అంతటితో ఆగక, ఇంట్లో బిడ్డకు ఆహారం ఇవ్వడానికి తగినంత శ్రద్ధ తీసుకోవడం లేదనీ, అందుకే కృష్ణుడు తమ ఇళ్లకు వస్తున్నాడనీ ఆరోపించారు. ఆ ఫిర్యాదులన్నీ విన్న యశోద.. చిన్ని కృష్ణుడి కోసం ప్రత్యేకమైన సువాసనగల వెన్నను సిద్ధం చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ఆవులకు సువాసనతో కూడిన అత్యంత శ్రేష్ఠమైన గడ్డిని తినిపించింది. వాటి పాలతో పెరుగును సిద్ధం చేసి, వెన్నకోసం చిలకడం ప్రారంభించింది. ఇంతలో, చిన్నికృష్ణుడు ఆకలి అంటూ పాల కోసం యశోదమ్మ దగ్గరికి వచ్చాడు. బిడ్డను ప్రేమగా తన ఒడిలోకి తీసుకుని పాలు పట్టడం ప్రారంభించింది యశోద. అలా కృష్ణుడు తల్లి పాలను తాగుతుండగా, వంటగదిలోంచి పాలు పొంగుతున్న శబ్దం వినిపించింది. వెంటనే బిడ్డను నేలపై ఉంచి యశోదమ్మ వంటగదిలోకి పరిగెత్తింది. ఆకలిగా ఉన్న కృష్ణుడు కోపంతో పక్కనే ఉన్న వెన్న కుండలను పగులగొట్టి, అమ్మ చూస్తే కొడుతుందని అక్కడి నుంచి పారిపోయాడు. తిరిగి వచ్చిన యశోదమ్మకు వెన్న కుండలన్నీ పగిలిపోయి ఉండటాన్ని చూసి ఏమి జరిగిందో ఊహించింది. కృష్ణుడు ఎక్కడంటూ వెతకగా, తమ ఇంట్లోనే మరో గదిలో వేలాడుతున్న కుండలోంచి వెన్న తింటూ కనిపించాడు. తాను తినడమే గాక బృందావనంలోని కోతులకు కూడా పంచిపెడుతుడుతున్నాడు. కోపగించుకున్న యశోదమ్మ, అతి కష్టం మీద కృష్ణుడిని చేజిక్కించుకొని తాడుతో రోకలికి కట్టేసేందుకు యత్నించింది. ఎంత ప్రయత్నించినా ఆ తాడు మాత్రం రెండంగుళాలు తక్కువ వస్తున్నది. ఎన్ని తాళ్లు తెచ్చి కట్టినా ప్రతిసారీ రెండంగుళాలు తగ్గుతున్నది! ఈ ఉదంతాన్ని విన్న ఇరుగుపొరుగు గోపికలంతా సంఘటనా స్థలానికి చేరుకొని యశోదమ్మ పడుతున్న కష్టాలను చూసి నవ్వడం ప్రారంభించారు. తాను తాడుకు బద్ధుడు కాకున్నా, తన తల్లి యశోదమ్మ మాతృవాత్సల్యంతో చూపే ప్రేమకు మాత్రం బద్ధుడయ్యాడు. తాడుకు కట్టుబడ్డాడు. తన భక్తులకు తానెన్నడూ బద్ధుడనేనని దామోదర లీలలో మరోసారి నిరూపించాడు ఆ దేవదేవుడు.
అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు ఈ పవిత్ర కార్తికంలో ప్రతి ఒక్కరూ దామోదర వ్రతాన్ని ఆచరించాలని సూచించారు. ఈ వ్రతంలో భాగంగా దామోదరునిగా ఉన్న చిన్నికృష్ణుడిని దామోదరాష్టకంతో కీర్తిస్తూ నేతి దీపాన్ని సమర్పించాలి. హరేకృష్ణ మహామంత్రాన్ని గానం చేస్తూ కూడా దీపాన్ని సమర్పించవచ్చు.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే॥