శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! గోకులంలో నందాది వృద్ధ గోపకులు ఇంద్ర యాగానికి సిద్ధపడటం చూచి సర్వజ్ఞుడైన శౌరి వారిని ఇలా ప్రశ్నించి వారించాడు- ‘నాన్నగారూ! మీరీ జన్నాన్ని (యాగాన్ని) పరిపాటిగా- పరం పరగా వస్తున్న ఆచారంగా భావించి చేస్తున్నారా లేక యాగ రహస్యం తెలిసి ఆచరిస్తున్నారా? దీనికి, ‘పుత్రకామేష్టి’వలన పుత్రప్రాప్తి వలె దృష్ట- ఐహిక ఫలమా లేక జ్యోతిష్టోమానికి స్వర్గప్రాప్తి వలె అదృష్ట ఆముష్మిక- లోకాంతర ఫలమా? శాస్త్రవిధి విధానం తెలిసి చేస్తేనే కర్మలు ఫలిస్తాయి. తెలియక చేస్తే ఫలించవు కదా! మీ ఉద్దేశం నాకు చెప్పండి’. ‘ఇంత చిన్నవాని మాటలు ఎంతలేసి పెద్దవో’ అంటూ చెంతనున్న వారంతా ఒకింత వింతగా చూచారు.
రాజా! గడుసరి కొడుకు గోవిందునికి తండ్రి నందుడు ముక్తసరిగా ఇలా సమాధాన మిచ్చాడు.. ‘కుమారా! ఇది పరంపరగా వస్తున్న ఆచారమే. ఇంద్ర యాగం చేస్తే దేవేంద్రుడు సంతసించి నిరంతర వర్షధారలు కురిపిస్తాడు. అంత పాడిపంటలు మరింతగా పెరుగుతాయి. మన జీవితాలు సుఖవంతాలవుతాయి’. జనకుని పలుకులు విని జనార్దనుడు బాల ముకుందుడు సునాసీరు- ఇంద్రునికి కినుక చాల హెచ్చునట్లు నందునితో ఇలా అన్నాడు.. తండ్రీ! కర్మ చేతనే ప్రాణి వర్గానికి జన్మ, వృద్ధి, క్షయాలు.
కర్మలే జీవుల సుఖదుఃఖాలకు కారణం. కర్తకు వాని కర్మలే తగిన ఫలాలను ప్రసాదిస్తూండగా మధ్యలో ఈశ్వరుని- ఇంద్రుని ప్రసక్తి ఎందుకు? ఆ ఈశ్వరుడు కూడా కర్మ చేసిన వానికే ఫలమిస్తాడు కాని, ఏ కర్మా చేయని వానికి ఏమీ ఇవ్వడు కదా! కర్మఫలాలను ఏ ధర్మదేవతా తప్పించలేదుగా! జీవునికి కర్మమే దైవతం. ‘తస్మై నమః కర్మణే’- అతడు కర్మనే దైవంగా భావించి సంభావించాలి- ఆరాధించాలి. కర్మల, ఆయా ఫలాల మర్మ- రహస్యమిలా ఉండగా నడుమ బిడౌజుని- అమరేంద్రుని ప్రమేయం ఏముంది? కనుక, అతనికి కినుక పూనవలసిన పని లేనేలేదు.
ఒకవేళ కోపగించినా మనకొచ్చే ఆపద ఏమీలేదు. కాన, పితాశ్రీ! మన హితానికి- సుఖజీవితానికి హేతువులైన మన గోజాతిని పోషించే గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. పతితులకు, అనాథలకు అన్న సంతర్పణం చేద్దాం. గిరి, గోవులను పరిక్రమిద్దాం- ప్రదక్షిణలు గావిద్దాం’. నిలింపపతి ఇంద్రుని సొంపు- సంపద సమృద్ధి మదం, దింపు- తొలగించే, తలంపుతోనే పరమాత్మ ఇలా పలికాడు. నందాదులంతా ఆనందంగా అంగీకరించారు.
మ॥ ‘సకలాభీరులు వీడె కృష్ణుడన నైజంబైన రూపంబు తో
నకలంక స్థితి నుంచి శైలమిదె మీ రర్చింప రండంచు దా
నొక శైలాకృతి దాల్చి గోపకులతో నొండొండ పూజించి గో
పక దత్తాన్నము లాహరించె విభుడా ప్రత్యక్ష శైలాకృతిన్’-
శుకముని.. రాజా! లీలా పురుషోత్తముడు బాల గోపాలుడు, గోపకులందరూ ‘ఇడుగో కృష్ణుడు’ అనుకొను రీతిగా గొల్లల మధ్య నిర్మలాకృతితో నిశ్శంకగా నిలబడి వారితో- ‘ఇదిగో పర్వతం. దీనిని పూజించడానికి మీరందరూ పూనికతో రండి’ అంటూ తాను తత్క్షణం పర్వతాకారం ధరించాడు. ఆ ఆభీరుల- గొల్లలతోనే కలసి గిరిరూపం దాల్చిన హరి తన్నుతానే వరివస్య- పూజ చేసుకొంటూ వారు అర్పించిన నైవేద్యాలన్నిటిని వేదవేద్యుడు పరామోదంతో ఆహరించాడు- ఆరగించాడు.
వందారు మందారుడైన (కైమోడ్చు వారికి కల్పవృక్షమైన) అరవిందాక్షుడు నందనందనుడు ఇలా ఈ గోవర్ధన లీలలో ‘పూజ్య- పూజక- పూజలు’ (పూజింపబడువాడు, పూజించేవాడు, పూజా కార్యక్రమం) ఈ త్రిపుటి తానే అయ్యాడు. గోపకులు శ్రీహరితో కూడి గిరికి పూజలు, కానుకలూ సమర్పించి, ఆనంద లహరిలో ఓలలాడుతూ ఆలమందలతో దానికి పరిక్రమ చేశారు. అనంతరం మాధవునితో కలసి మందకు మరలిపోయారు.
అప్పుడు జరిగినదంతా తెలుసుకొని జంభాసురవైరి- ఇంద్రుడు సంరంభం (కోపం, ఆటోపం)తో దంభోళి (వజ్రాయుధం) జళిపించి…
క॥ ‘గురుదేవ హీను బాలుని
గిరి భూజ ప్రముఖ వాసు గృష్ణు ననీశుం
బరిణామ శీలు గుల గుణ
విరహితు జేపట్టి యింద్రు విడిచిరి గొల్లల్’…
‘ఈ కృష్ణుడు గురువు దైవము లేనివాడు, బాలుడు, కొండల్లో కోనల్లో ఉండేవాడు. ఎవ్వరి మీద ఎలాంటి విభుత్వం- ఆధిపత్యం లేనివాడు, చంచల స్వభావుడు, కుల రహితుడు, గుణహీనుడు ఐన ఈ కుర్రని మాటలు విని విర్రవీగి ఈ గొల్లలు వేలుపు దొరనైన నన్ను త్యాగం చేశారు. నా యాగాన్ని విడిచారు. ఇక వీరి ఆటలు సాగనివ్వను.’ అని ఉగ్రుడై.. ఉరుములు, మెరుపులతో రాళ్లవాన కురిపించి, నంద గోకులాన్ని ఆగమాగం చెయ్యండని ప్రళయ భయంకరమైన సంవర్తక మేఘ బృందాలను ఆదేశించాడు. అవి మందను ఆవరించాయి. దట్టంగా కారుచీకట్లు కమ్మించాయి. విరామ మెరుగని వడగండ్ల వానతో పిడుగులు రువ్వాయి. గోపయ్యలు కొయ్యబారి పోయారు. ఎటు చూచినా ఆవుల లేగల అంబారావాలు, ఆర్తనాదాలు. ఆ జడివానకు తాళలేక బడుగు (సన్నని) నడుముల గోపికలు గడగడ వణుకుతూ గోవిందునికి మొర పెట్టుకున్నారు.
అందమైన పై కందపద్యంలో దేవేంద్రుడు ఉపేంద్రుని- కృష్ణుని నిందిస్తున్నట్లు పైపైన అనిపిస్తున్నా నిజానికి విచారిస్తే అవి స్తుతివాక్యాలుగానే గోచరిస్తాయి. పరబ్రహ్మము (నిర్దోషం హి సమం బ్రహ్మ- గీత) దోషరహితం కాన ఆయన యందు నింద పొసగదు- వర్తించదు. ఎలాగన.. గురుదేవహీనుడు- ‘కృష్ణంవందే జగద్గురుమ్’- తానే జగత్తుకు గురువైతే తనకు మరో గురువు ఉంటాడా? తానే ఆదిదేవుడు, మహాదేవుడు, దేవాధిదేవుడు. తనకు మరో దేవుడు లేడు. బాలుడు- ‘బాలు భంగి నితడు భాసిల్లుగాని సర్వాత్ముడాది విష్ణువగుట నిజము’- బాలుని వలె కనిపించుటే కాని ఇతడు సర్వాత్ముడైన ఆ శ్రీహరియే!- అంటుంది యశోద విశ్వరూప సందర్శనంలో.
గిరి భూజ ప్రముఖవాసుడు- చరాచరాలందు అంతటా వ్యాపించి ఉన్నవాడు, అనీశుడు- సర్వేశ్వరుడు కాన తనకు మరో ఈశుడు- అధిపతి లేనివాడు, పరిణామశీలు- ధర్మరక్షణకై పలు రూపాలలో పరిణమించు- అవతరించువాడు. పరబ్రహ్మ ఎలా అగుపించినా పరబ్రహ్మే! కులహీనుడు- కులమనగా శరీరమని కూడా అర్థం. జీవుని వలె పాంచభౌతిక, పార్థివ- మృణ్మయ దేహం లేనివాడు. గుణహీనుడు- సత్తరజస్తమో గుణాలు లేని గుణాతీతుడు! ఇలా నిందరూపంలో ఉన్న స్తుతికి ‘వ్యాజస్తుతి’ అనిపేరు. ఇది బమ్మెర వారి స్వీయ రచన!
క॥ ‘వారి బరువయ్యె మందల
వారికి, నిదె పరులు లేరు వారింపంగా
వారిద పటల భయంబును
వారిరుహ దళాక్ష! నేడు వారింపగదే!’
‘వారిజనేత్రా (పద్మాక్షా)! మందలోని వారినందరినీ ఈ ఉపలవృష్టి- రాళ్లవాన కొందల (క్షోభ, కలత) పెడుతోంది. ఈ ఉపద్రవాన్ని నివారింప గలవారు నీవు తప్ప మరెవరున్నారు? దయా వారిధీ! ఈ సంవర్తక వారిదా (మేఘా)ల భయాన్ని వారించి కాపాడు’. శుకుడు.. రాజా! ఆపన్నులైన గోకులవాసుల విన్నపాన్ని కన్నయ్య విన్నాడు. ఉన్నతమైన అమరాధిపత్యం అబ్బిందని కన్నుకానని అహంకారంతో అమరేంద్రుడు- (పెరుగులు, నేతులు తాగి క్రొవ్విన- బలసి గర్విస్తున్న ఈ గొల్లలు తన్ను తృణీకరిస్తున్నారని) మిన్ను నుంచి ఇలా శిలా వర్షం కురిపిస్తున్నాడని సర్వజ్ఞుడు హరి గ్రహించాడు. ఇంద్రునికి గర్వభంగం కావించాలని, నందుని మందలో కుందుతున్న- విలవిల్లాడుతున్న వారి నందరినీ వారి వారి ఆలమందలతో సహా ఒకచోట చేరమన్నాడు బాలకృష్ణుడు.
క॥ ‘కిరియై ధర యెత్తిన హరి
కరి సరసిజ ముకుల మెత్తుగతి ద్రిభువన శం
కరకరుడై గోవర్ధన
గిరి యెత్తెం జక్క నొక్క కేలన్ లీలన్’…
అలా పలికి, కిరి- ఆది వరాహమూర్తియై ఇలను- భూమిని ఉద్ధరించిన హరి, ముల్లోకాలకు శంకరుడై- మోదం కలిగించడానికి, కరి- ఏనుగు గున్న తామర మొగ్గను పైకెత్తు రీతిగా గోవర్ధన గిరిని ఒక్కచేతితో అవలీలగా ఎత్తి పట్టుకున్నాడు.
శా॥ ‘బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దానమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలా చకిత గోపీ గోప గోపంక్తికన్’
శుకుడు- రాజా! పసివాడు ఆటలాడుతూ ఒక పూలగుత్తిని గొడుగుగా భావించి తన సుతిమెత్తని చేతిలో ధరించిన రీతిగా, ఇలా గోవర్ధన శైలాన్ని బాలకృష్ణుడు లీలా దరహాసం చిందిస్తూ తన వలకేల- కుడిచేత ధారణ చేశాడు. దారుణమైన వారిద- మేఘాల శిలా వర్షానికి పిల్లపాపలతో ఆపసోపాలు- అవస్థలు పడుతున్న గోప గోపీ గోగణానికి అండగా ఆ కొండను పెద్ద గొడుగుగా పట్టుకున్నాడు. మూలంలో ‘ఛత్రాకమివ బాలకః’- (చిన్న పిల్లవాడు పుట్టగొడుగును పట్టుకొన్నట్లు) అని మాత్రమే ఉన్నదానికి సహజ పాండిత్యుడు పోతన్న చేసిన సరస శ్రావ్యమైన పెంపుదల పై కంద, శార్దూల పద్యాలు.
క॥ ‘దండిని బ్రహ్మాండంబులు
చెండుల క్రియ బట్టి యెగుర జిమ్మెడు హరికిన్
గొండ బెకలించి యెత్తుట
కొండొక పనిగాక యొక్క కొండా తలపన్’
రాజా! బ్రహ్మాండాలను సైతం చెండు- బంతులవలె ఎగరేసే గండర గండడు- శూరుల కెల్ల శూరుడు, గోవిందుడికి ఒక కొండను పెళ్లగించి పైకెత్తడం చిల్లర- చిన్న పనిగాక ఎల్లరిచే ఎన్నదగిన ఘనకార్యమా?
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006