కార్పణ్య దోషోపహత స్వభావః
పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః
యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నమ్
(భగవద్గీత 2-7)
‘కృష్ణా! నేను కార్పణ్య (పిరికితనము) దోషానికి లోనై, నా స్వభావానికి దూరమయ్యాను. ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం లోపించి కర్తవ్యాన్ని నిర్ణయించుకోలేక పోతున్నాను. నేనిప్పుడు నీకు శిష్యుడిని. శిష్య వాత్సల్యతతో నాకేది శ్రేయస్కరమో దానిని ఉపదేశించు’ అంటున్నాడు, అర్జునుడు. సర్వసమర్పణ భావనతో పార్థుడు తన సమస్యను పరమాత్మకు నివేదించాడు.
అర్జునుని మాటలు సమంజసంగా కనిపిస్తున్నా ధర్మబద్ధమైనవి కావు. భావోద్వేగాలకు లోనైన వేళ మనసు ఆవేశపూరితం అవుతుందే కాని ధర్మాన్ని గ్రహించదు. ప్రశాంతత నిలిస్తేనే విచక్షణ జ్ఞానం వెలుగుచూస్తుంది. పూర్వం ఎన్నో యుద్ధాలలో అర్జునుడు ప్రతివీరులను సంహరించాడు. దానితో వచ్చిన యశస్సును ఆస్వాదించాడు. అప్పుడు వ్యామోహం కలగలేదు. ఎందుకు? వారంతా పరాయివారు.. ఇప్పుడు ఎదురుగా నిలిచిన వారిని తనవారుగా భావిస్తున్నాడు. తనవారికొక ధర్మం, పరులకొక ధర్మమా? యుద్ధంలో తనవారు చనిపోతారు నిజమే కాని, యుద్ధం చేయకపోతే మాత్రం వారు శాశ్వతంగా జీవిస్తారా?
అర్జునుడి శక్తిసామర్థ్యాలను నమ్ముకొనే పాండవులు యుద్ధాన్ని కోరుకున్నారు. అర్జునుడు యుద్ధానికి భయపడి అస్త్రసన్యాసం చేయలేదు. భ్రమలో స్వజన సంహారమనే వ్యామోహానికి లోనై ఆ పనిచేశాడు. దుష్టశిక్షణ అనే కర్తవ్యాన్ని బాధ్యతతో నిర్వహించాల్సిన సమయంలో అర్జునునిలో ైక్లెబ్యత్వం (అధైర్యం) చోటుచేసుకున్నది. అర్జునుడు యుద్ధం చేస్తాడా, చేయడా.. కృష్ణుడికి అనవసరం. అర్జునుడి సమస్య మృత్యుభీతి. నిజానికి బాధ్యతారాహిత్యాన్ని సమస్యగా చూస్తున్నాడు. ఆ సమస్యను పరిష్కరించాలి.
అర్జునుడి మనస్సు ఇప్పుడు పూర్తిగా పరమాత్మ బోధను ఆకళింపు చేసుకునేందుకు సన్నద్ధమై ఉన్నది. ఆ సన్నద్ధతనే స్త్రీ శక్తిగా చెబుతారు. కృష్ణుడి మనసు ప్రశాంతమై బోధించేందుకు సన్నద్ధమై ఉన్నది.. దానినే పురుష శక్తిగా చెప్పుకొందాం. రెండూ ఒకదానికి మరొకటి అనుసంధానం కావడం వల్ల అక్కడ అయస్కాంత వలయం ఏర్పడి.. గురుశిష్యుల మధ్య భావ ప్రసరణ జరుగుతుంది. ‘గురోః మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయః’ అన్నట్టుగా గురువు మౌనంగా వ్యాఖ్యానం చేస్తున్నాడు.. శిష్యుడు శ్రద్ధగా వింటున్నాడు. గురువనే ఉనికి నుంచి శిష్యుడనే ఉనికికి జ్ఞానం ప్రవహించింది.
శిష్యుని అజ్ఞానం పటాపంచలైంది. ఏది కర్తవ్యమో దానిని బాధ్యతగా గుర్తించాడు. గురుశిష్యుల స్థాయి సమానం కావడం వల్ల బోధ శబ్ద రూపంలో జరగవలసిన అవసరం లేదు. కొంతమంది 700 శ్లోకాలు చెప్పేంతవరకు కౌరవ పాండవులు యుద్ధరంగంలో చూస్తూ కూర్చుంటారా? అంటారు. నిజమే కాని ఒక సూపర్ స్పెషలిస్ట్ మరొక సూపర్ స్పెషలిస్ట్ అనుమానాలను తీర్చే సమయంలో సాధారణ వ్యక్తికి తెలియజేసే విధంగా వివరించాల్సిన అవసరంలేదు. అలాగే పరిణతి చెందిన ఒక ఉనికి నుంచి పరిణతి చెందిన మరొక ఉనికికి ప్రవహించే జ్ఞానానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
సాధారణమైన వ్యక్తి స్థూలంగా మతాచారాలను, వాటి నియమాలను, పూజాదికాలను అవగాహన చేసుకుంటాడు. సూక్ష్మంగా చూసే వ్యక్తి ఆ ఆచారాల ఆంతర్యాన్ని అవగాహన చేసుకుంటాడు. సూక్ష్మాతిసూక్ష్మంగా అవగాహన చేసుకునే వ్యక్తి ఆంతర్యానికి ఆవల ఉనికిని చూడగలుగుతాడు. స్థూలంగా చూడటం భౌతికం, సూక్ష్మంగా చూడటం మానసికం, సూక్ష్మాతిసూక్ష్మంగా పరిశీలించడం ఆత్మగా చెప్పుకోవచ్చు.
అన్నిటికీ మూలాధారమైనది.. శ్రద్ధ మాత్రమే! ఆ శ్రద్ధ అర్జునునిలో పూర్ణంగా వికసించి గురువు బోధలను జాగ్రత్తగా ఆకళింపు చేసుకునేందుకు సన్నద్ధమయ్యాడు. భౌతికమైన, మానసికమైన, భావోద్వేగపరమైన పరిమితులు చెదిరిపోయాయి. యాంత్రికత కేంద్రంగా పనిచేసిన అర్జునుడి మనసు అయస్కాంత కేంద్రంగా మారింది.. పరివర్తన చోటుచేసుకున్నది. పిరికితనం, వ్యామోహం స్థానంలో కర్తవ్యం, బాధ్యతలు నిండిపోయాయి. నేను చేస్తున్నాననే భావన స్థానంలో తాను ఉపకరణం మాత్రమేననే సత్యం ఆవిష్కృతమమైంది.
– పాలకుర్తి రామమూర్తి