ఒక సాధువు భక్తి గీతాలు పాడుకుంటూ ఊరిలోకి ప్రవేశించాడు. ఆ విషయం తెలుసుకున్న ఓ గృహిణి వారి ఇంటికి సాధువును సాదరంగా ఆహ్వానించింది. ఫలం పుష్పం ఇచ్చి ఆయన పాదపద్మాలకు నమస్కరించి నాలుగు మంచి మాటలు చెప్పమని కోరింది. ఆ సాధువు అష్టావక్ర గీతలోని కొన్ని ముఖ్య విషయాలను చెబుతూ ఉన్నాడు. ఇంతలో ఒక యాచకుడు ఇంటి ముందు నిలబడి ‘అమ్మా ఆకలి!’ అని అరిచాడు. విననట్లు ఉండిపోయింది గృహిణి. ఆమెకు యాచకుడి అరుపు వినపడలేదేమోనని అనుకున్నాడు సాధువు. యాచకుడు అక్కడే నిలబడి ఉండటం గమనించాడు.
తను చెప్పేది ఆపి ‘పాపం… కొంచెం దానం చేయండమ్మా!’ అన్నాడు. వండిన పదార్థాలు కుటుంబసభ్యులకే చాలవని ఆమె బదులిచ్చింది. అయినా సాధువు ఓపికగా ‘అలా అనకమ్మా! ఆకలిగా ఉన్నట్లు ఉన్నాడు. పాపం… కొంత దానం చేయండమ్మా’ అన్నాడు. ఎప్పుడూ వచ్చే అతనేనని, రేపు ఎప్పుడైనా దానం చేస్తానని చెప్పింది ఆ ఇల్లాలు. సాధువు నవ్వుతూ ‘పాపపుణ్యాలను నమ్ముతారా?’ అని ఆమెను ప్రశ్నించాడు. ‘ఎందుకు నమ్మను… పాపాలు చేసిన వారు నరకానికి వెళ్తారని, పుణ్యాలు చేసినవారు స్వర్గానికి వెళ్తారని చిన్నప్పటినుంచీ వింటున్నాను’ అని బదులిచ్చింది. ‘అవి నమ్మేటప్పుడు… దానం చేస్తే చేసిన పాపం కొంత కొట్టుకుపోతుందని కూడా తెలిసి ఉంటుంది.
మనం తెలిసో తెలియకో ఎన్నో పాపాలు చేస్తాం. ఎందరి మనసులో బాధపెట్టి ఉంటాం. కొన్నిటిని మాత్రమే గుర్తించగలం. అన్నిటినీ గుర్తించలేం. మంచో చెడో అతను భిక్షమెత్తుకుంటున్నాడు. మిమ్మల్ని నేను ఆ యాచకుడికి కొత్తగా దానం చేయమనడం లేదు. చేసిన పాపాన్నే ఆహార రూపంలో దానం చేయమంటున్నాను. దానం చేసేటప్పుడు ఇచ్చే చేయి ఎప్పుడూ పైన ఉంటుందని తెలుసుకో’ అన్నాడు. సాధువు మాటల ఆంతర్యం ఆమెకు అర్థమైంది. దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు ఒకటేనని గుర్తించి కొద్దిగా ఆహారాన్ని యాచకుడికి వేయడానికని వంటగదిలోకి వెళ్లింది.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821