మనుషులుగా మనమందరం భగవంతుడి బిడ్డలం. దేవతల అనుగ్రహంతోనే మన జీవితాల్ని సార్థకం చేసుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఈ క్రమంలో ఎవరి ఇష్టదైవాలు కొలువైన ఆలయాలకు వారు వెళ్లటం, అర్చనలు చేయించుకోవటం, దేవతలను ప్రార్థించటం సర్వసాధారణంగా జరుగుతుంది. కొలిచే దేవత ఎవరైనప్పటికీ ఆలయ సందర్శన మనందరి జీవితాల్లో ఓ భాగం. గుడికి వెళ్లటం ద్వారా మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొండంత అండ మన చెంతనే ఉందన్న ధైర్యం కలుగుతుంది. ఇక అంతా మంచే జరుగుతుందన్న భరోసా లభిస్తుంది. ఇదంతా జరగటం వెనుక ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి.
ఆగమశాస్త్రాలతోపాటు పురాణాలు, శాస్త్రాలు సందర్భానుసారంగా ఆలయాలను సందర్శించుకునే విధానాన్ని, అనుసరించవలసిన నియమాలను పేర్కొంటున్నాయి. వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి. మనం గుడికి వెళ్లకపోతే దేవుడు కోపిస్తాడని అనుకోవాల్సిన అవసరం లేదు. గుడికి వెళ్లకపోతే మంచి జరగదనో, శాపం తగులుతుందనే భయంతోనో ఆలయాన్ని సందర్శించాల్సిన పని లేదు. చెయ్యాల్సిందంతా విధివిధానంగా, త్రికరణశుద్ధిగా చేసి మనం ఆలయానికి వెళ్లామా లేదా? స్వామిని దర్శించుకున్నామా లేదా? అని మాత్రమే ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడు స్వామి తప్పకుండా మన గోడు వింటాడు. మనల్ని కరుణిస్తాడు. బాధలు తీరుస్తాడు.
ఆలయానికి వెళ్లడమంటే దేవుడిని భౌతికనేత్రాలతో చూడటం, మొక్కులు చెల్లించుకోవటం, అర్చనలు చేయించుకోవటం, తీర్థప్రసాదాలు స్వీకరించటం, మనకు అంతా మంచే జరగాలని కోరుకోవటం… ఇవి మాత్రమే కాదు. ఇవన్నీ మనం పాటించే కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు, విధివిధానాల్లో భాగం మాత్రమే. దైవదర్శనం కోసం మనం ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలో ఇవన్నీ అంతర్లీనంగా సాగుతాయి. వీటన్నిటి వెనుకా దాగి ఉన్న పరమార్థాన్ని తెలుసుకుని దైవదర్శనం చేసుకోవాలి. అప్పుడే ఆలయానికి వెళ్లిన అసలైన పరమార్థం సిద్ధిస్తుంది. ఇదంతా జరగటం కోసమే ఆలయానికి వెళ్లాలే కానీ మన కోరికల చిట్టా భగవంతుడి ముందు విప్పటానికి కాదు. కష్టాలు చెప్పుకొని కోర్కెలు విన్నవించుకోవటానికి కానప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలనే ప్రశ్న కలుగుతుంది.
భగవంతుడికి మన కష్టాలు చెప్పుకోకూడదా? మొక్కుకోవటం తప్పవుతుందా? అంటే… అవి ఎంతమాత్రం తప్పు కానే కాదు. కానీ, కేవలం మనకేదో మంచి జరిగితే నీకిది చేస్తానంటూ భగవంతుడితో బేరసారాలాడటం మాత్రం తప్పు. మనకు మంచి జరగాలని, అందుకు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని తప్పనిసరిగా కోరుకోవాలి. మన ప్రారబ్ధకర్మల నుంచి విముక్తి కలిగించమని స్వామిని అనేకవిధాలుగా అర్థించాలి కూడా. అయితే ఇవి భక్తినివేదన తీరులో ఉండాలి. అంతేకానీ బేరసారాల మాదిరిగా నాకిదైతే నీకిది అన్నట్టుగా ఉండకూడదు.
ఆలయాలు అనంతమైన శక్తికి కేంద్రాలు. భక్తుడిని భగవంతుడి సన్నిధికి చేర్చే వారధి దేవాలయం. గుడి సందర్శన మనలో చైతన్యాన్ని నింపాలి. దైవికమైన భావనలు మనలో మరింతగా పెరగాలి. ధర్మబుద్ధి ద్విగుణీకృతం కావాలి. ఆలయ సందర్శన మనకు లౌకిక పరిధులు దాటి అలౌకికమైన ఆనందాన్ని కలుగజేయాలి. మనలో సానుకూలశక్తుల్ని మరింతగా వృద్ధి చెందించాలి. మనిషి మనీషిగా మారేందుకు బీజం పడాలి. ఇవన్నీ సాకారం కావటానికే ఆలయానికి వెళ్లాలి. స్వామిని దర్శించుకోవాలి. అభిషేకించాలి. అర్చించాలి. ఇదంతా జరగాలంటే ఆలయ సందర్శనలోని అసలైన ఆశయాన్ని గుర్తించాలి. అందుకు సంబంధించిన విధివిధానాలను పూర్తిగా పాటించాలి.
ఏదైనా గుడికి వెళ్లాలని అనుకున్నప్పుడు ముందుగా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఆలయ సందర్శన హడావుడి వ్యవహారం కాకూడదు. ఇంట్లో వారు వెళ్తున్నారు కాబట్టి మొహమాటానికి, ఇక తప్పదు అన్నట్టు వెళ్లకూడదు. ఆలయ సందర్శన కూడా ఓ యజ్ఞం. గుడికి వెళ్తున్నామంటే ఓ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నట్లే లెక్క. యజ్ఞదీక్ష తీసుకున్న వ్యక్తి ఎంతటి నియమనిష్ఠలతో ఉంటాడో ఆలయ సందర్శనకు సంకల్పించుకున్న వ్యక్తి అంతే నియమాలు పాటిస్తూ భక్తిశ్రద్ధలతో ఉండాలి. పరమపవిత్రమైన ఓ కార్యానికి పూనుకొన్న వ్యక్తి ఎంతటి సహృదయంతో, ఎటువంటి వికారాలు లేకుండా ఉంటాడో ఆలయానికి వెళ్లాలనుకున్న వ్యక్తి కూడా అదేవిధంగా ఉండాలి. అప్పుడే దేవాలయాన్ని సందర్శించుకున్న పరమార్థం సిద్ధిస్తుంది. భగవంతుడితో భక్తుడికి అనుబంధం ఏర్పడుతుంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే ఆలయం ఓ అయస్కాంతక్షేత్రం. ఆ క్షేత్రంలోకి ప్రవేశించటానికి మనకు కొంత శక్తి అవసరమవుతుంది. ఈ శక్తి పాటించే నియమాల ద్వారా మనకు కలుగుతుంది. అయస్కాంతం ఇనుమును మాత్రమే ఆకర్షిస్తుంది. ఇనుము దృఢత్వానికి సంకేతం. భక్తుడు కూడా అంత దృఢమైన మనసుతో ఉండాలి. అప్పుడే భగవచ్ఛక్తి మనల్ని తనవైపు తిప్పుకొంటుంది.
ఆలయానికి వెళ్లాలని నిశ్చయించుకున్న వ్యక్తి పూర్తి శుచిగా ఉండాలి. శుచిత్వం అంటే ఆంతరంగికంగాను, బాహ్యంగానూ రెండు విధాలుగా శుభ్రంగా ఉండాలి. పరిశుభ్రమైన మనసు, శరీరం అద్భుతాలను చేస్తాయి. ఆ విషయాన్ని గుర్తించిన సనాతన భారతీయ సంప్రదాయం శుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తూ వచ్చింది. అసూయ, ఆందోళన, అనుమానం, అసహనం, ఈర్ష్య, ద్వేషం, కోపం మొదలైన అవగుణాలు లేని మనసు ఎంతో స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటుంది. దీన్నే మానసిక శౌచం అంటారు. స్వచ్ఛమైన మనసుతో చేసే పూజ, ధ్యానం, తపం ఎంత చిన్నవైనా అనంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. అందుకే యోగి వేమన ‘చిత్తశుద్ధి లేని శివపూజలేలరా?’ అంటారు. అలాగే మలినాలేవీ శరీరానికి అంటకుండా ఉండేలా స్నానాది విధులు చెయ్యటాన్ని బాహ్యశౌచం అంటారు. భౌతికమైన శుభ్రత మానసిక ఉన్నతికి పునాదిగా నిలుస్తుంది. శారీరకంగా, ఆంతరంగికంగా ఉండే పరిశుభ్రత మనిషికి ఏకాగ్రతను ఇస్తుంది. అతడిని లక్ష్యసాధన వైపు నడిపిస్తుంది.
నిత్యవిధుల్లో పూజా కార్యక్రమాలన్నీ ఈ శ్లోక పఠనంతోనే ప్రారంభమవుతాయి. భగవంతుడి అనుగ్రహం పొందాలంటే బాహ్య, అంతరంగ శౌచాలు తప్పనిసరి. పుండరీకాక్షుడి (విష్ణుమూర్తి) స్మరణం వల్ల శుచిత్వం వస్తుందని చెబుతుందీ శ్లోకం. బలం, ఆయుష్షు, ఆరోగ్యం, సంతోషం, ఆరోగ్యవంతమైన మనసు… ఇవన్నీ శుభ్రత వల్లనే లభిస్తాయని శాస్త్రాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. శుభ్రత లేని చోట పరమాత్మ ఉండడు. స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రార్థన, ధ్యానం లేదా ఆలయ సందర్శన ప్రారంభించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనలో తొలిమెట్టు. శాస్త్రగ్రంథాలు కూడా ‘శుచిత్వం మాతరూపేణ’ అని చెబుతాయి. శుచిత్వం మనకు తల్లివంటిది. తల్లి ఏవిధంగా బిడ్డకు సదా రక్షగా ఉంటుందో, అదేవిధంగా శౌచం కూడా మనల్ని రక్షిస్తుందని భావం.
ఆలయానికి వెళ్లాలని నిశ్చయించుకున్న తర్వాత పాటించాల్సిన తొలి నియమం శిరస్నానం చెయ్యటం. దీని ద్వారా శారీరక శుభ్రత సాధించాలి. ఆ తర్వాత శుభ్రమైన పొడివస్త్రాలు మాత్రమే ధరించాలి. గతంలో ఉపయోగించి, ఉతక్కుండా పక్కనపెట్టిన వస్త్రాలు ధరించి ఆలయానికి వెళ్లకూడదు. స్త్రీ పురుషులిద్దరూ శక్తిని బట్టి అవకాశం ఉన్నంతవరకు పట్టువస్త్రాలు, లేదంటే శుభ్రమైన సంప్రదాయ వస్త్రాలు మాత్రమే ధరించాలి. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు.
సంప్రదాయ వస్త్రాలు ధరించటం అర్థం లేని నియమం కాదు. నేటితరం అర్థం చేసుకోలేనంత విజ్ఞానం అందులో ఉంది. సంప్రదాయ వస్త్రధారణ మన మనసును పట్టి ఉంచే కళ్లెంలాగా పనిచేస్తుంది. మనం ధరించే వస్త్రాలు, వాటి రంగు మన మనసు మీద తప్పనిసరిగా ప్రభావం చూపిస్తాయి. ఆధునికత పేరుతో చిత్రవిచిత్రంగా ఉండే వస్త్రాలు ధరిస్తే వాటి ప్రభావం మనసు మీద పడి, మన ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది. మనసు దేనిమీదా స్థిరంగా లగ్నం కాదు. అంతిమంగా భగవంతుడి మీద కూడా మన దృష్టి నిలవదు. ఇటువంటి వస్త్రాలతో గుడికి వచ్చారంటూ చుట్టుపక్కల వారు మనల్ని అదోరకంగా చూస్తారు. ఇది కూడా మన బుద్ధిని ప్రభావితం చేస్తుంది. అధికమైన ధర పెట్టి కొన్న వస్త్రాలు మన పటాటోపాన్ని ప్రకటించి, అహంభావాన్ని పెంచుతాయి. మన ఆలోచనంతా మన వస్త్రాలు, అందమైన అలంకరణ చూసి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భావనతో నిండిపోతుంది. భగవంతుడి సన్నిధిలో ఎటువంటి అహంకార మమకారాలు, వికారాలు పనికిరావు. మన దర్పం, ఆడంబరం స్వామిని మనకు దూరం చేస్తాయి.
సర్వసాధారణంగా సంప్రదాయ వస్త్రాలు తెలుపురంగులో ఉంటాయి. తెలుపు స్వచ్ఛతకు చిహ్నం. వస్త్రాలు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో మన మనసు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలన్న సందేశం ఇందులో దాగుంది. తెలుపురంగు మన బుద్ధిలో ఉండే ప్రకోపాల్ని నియంత్రిస్తుంది. నియంత్రిత బుద్ధి భగవంతుడి మీద మాత్రమే లగ్నమవుతుంది. తద్వారా భగవంతుడి అనుగ్రహానికి చేరువయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. వస్త్రాల తర్వాతి అంశం అలంకరణ. దేవాలయానికి వెళ్లేటప్పుడు విపరీతమైన అలంకరణ పనికిరాదు. మనం వెళ్లేది భగవంతుడి ముందు మోకరిల్లటానికే గానీ సౌందర్యాన్ని ప్రదర్శించటానికి కాదనే విషయాన్ని గుర్తించాలి. సంప్రదాయ వస్త్రాలు ధరించిన తర్వాత స్త్రీ పురుషులిద్దరూ తిలకధారణ తప్పనిసరిగా చెయ్యాలి. తిలకం లేని నొసటితో దైవదర్శనం చెయ్యకూడదు. సంప్రదాయ భేదాలను బట్టి తిలకం, విభూది, తిరునామం… ఏదైనా ధరించవచ్చు. తిలకం లేదా కుంకుమ ధారణ చెయ్యటానికి అర్హత లేనివారు విభూది / గంగసింధూరం ధరించాలి. ఏదోఒక తిలకం లేనిదే దైవదర్శనానికి అర్హత కలగదు.
కుటుంబసభ్యులు లేదా మిత్రులు, బంధువులతో కలిసి ఆలయానికి వెళ్లటం చాలా మంచిది. అయితే ఈ సందర్భంలో మనం ఆడంబరం ప్రదర్శించటం మాత్రం తగదు. ఇటీవలి కాలంలో ఆలయానికి వెళ్లటం కూడా మన హోదాను ప్రదర్శించే చిహ్నంగా మారింది. ఇది పూర్తిగా తగని పని. అత్యంత వినయంగా దైవదర్శన చేసుకోవాలి. స్వామి కోవెల ప్రాంగణంలో ప్రవేశించగానే ఆ స్వామి తప్ప మన వ్యక్తిగత స్థాయి మర్చిపోవాలి. మనసా, వాచా, కర్మణా దైవానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. మనలోని అహంకారాన్ని అణచుకుని, స్వామికి శరణాగతి కావటమే దైవదర్శనం అంతరార్థం.
పూజాసామగ్రి ఏర్పాటులో ఎలాంటి లోపం చెయ్యకూడదు. అలాగని ఆర్భాటాలు చెయ్యాల్సిన పని కూడా లేదు. మన శక్తి లోపం లేకుండా దైవానికి ఏ వస్తువులు సమర్పించగలమో ఆ వస్తువులన్నిటినీ సిద్ధం చేసుకోవాలి. దైవానికి సమర్పణ చేస్తున్నామనే భావనతో పూజాద్రవ్యాలను ఏర్పాటుచేసుకోవాలి. అటువంటి ద్రవ్యాలతో చేసిన అర్చన మాత్రమే భగవంతుడికి ప్రీతిపాత్రమవుతుంది.