వల్ కాజిమీనల్ గైజ వల్ ఆఫీన అనిన్నాసి వల్లాహు యుహిబ్బుల్ ముహ్ సినీన్ (ఖురాన్ 3:134) కోపాన్ని నిగ్రహించుకునేందుకు ఈ వాక్యాన్ని పదేపదే చదవాలని ఉలమాలు చెబుతుంటారు. మనిషికి కోపం రావడం సహజం. కానీ, ఆ కోపం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. రక్తసంబంధాలను దెబ్బతీస్తుంది. కోపంలో నోరు జారే మాటలు మనవాళ్లను దూరం చేస్తాయి. కోపానికి గురైన ప్రతిసారీ ఏదో ఒక నష్టం తప్పదు. కోపం ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలకు కారణం అవుతుంది. ఇలా ఎన్నో కష్టనష్టాలు కలుగజేసే కోపాన్ని అణచుకోవాలని ఖురాన్ పేర్కొన్నది. ‘కోపాన్ని దిగమింగేవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు.. ఇలాంటి సజ్జనులంటే అల్లాహ్కు ఎంతో ప్రీతి’- అని పై ఖురాన్ వాక్య భావం.
అల్లాహ్ మీద భయభక్తులు కలవారు ఎదుటివారిని కోపగించుకోరాదు. యుద్ధ మైదానంలో శత్రువులను చిత్తుచేసేవాడు కాదు వీరుడు, కోపాన్ని అణచివేసుకున్నవాడే ధీరుడు అంటారు ప్రవక్త (స). కోపం షైతాను ద్వారా వస్తుంది. షైతాన్ అగ్ని స్వరూపుడు. అందుకే కోపం వచ్చినప్పుడు మంచినీళ్లు తాగాలని ప్రవక్త (స) చెప్పారు. నిల్చుని ఉన్నప్పుడు కోపం వస్తే కాసేపు కూర్చోవాలనీ, కూర్చుని ఉన్నప్పుడు ఆగ్రహం వస్తే.. పడుకోవాలని సూచించారు. ‘కోపం వచ్చినప్పుడు కూడా క్షమించేవారి కోసం అల్లాహ్ దగ్గర శ్రేష్ఠమైన సుఖ సౌఖ్యాలు ఉన్నాయ’ని ఖురాన్ చెబుతున్నది.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076