‘భగవాన్ భక్త భక్తిమాన్’- భగవంతుడు భక్తులకు భక్తుడు. ఈ భాగవత సిద్ధాంతానికి ‘కుచేలోపాఖ్యానం’ భాస్వంతమైన దృష్టాంతం. ‘దరిద్ర దోషేణ కరోతి పాపం’- (దారిద్య్రం మనిషిని పాపం చేయడానికి పురిగొల్పుతుంది) అన్నది లోక సహజంగా జన సామాన్యానికి వర్తించే నగ్న సత్యం. కాని, కుచేలుని విషయంలో ఇది భగ్న- ఓడిపోయిన సత్యం. ఆ మహా భాగవతుడు దీనికి అపవాదం. అంత లేమిలో కూడా ఒక వ్యక్తి పాపమేమీ చేయకుండా, ఎవరి ముందూ చేయి చాపకుండా జీవించడం కత్తి మీద సాము వంటిది. కుచేలుడు దరిద్రుడైనా నిష్పాపుడు- పాప రహితుడు, పవిత్రుడు కనుకనే పరమాత్మ అతనికి అంతగా సేవ చేశాడు. దరిద్రుడవడం అపరాధం కాదట, ఆ దరిద్రంలో హరిని, శ్రీధరుని విస్మరించడం అపచారమట. ‘యోమద్భక్తః సమేప్రియః’ (గీత)- ‘నా భక్తుడు నాకు ప్రియుడు’ అన్న తన మాటకు ప్రత్యక్ష నిదర్శనంగా సుదర్శనాయుధుడు కృష్ణుడు భక్త లోకానికి ప్రదర్శించిన భాగవత సేవానురక్తి కడు దర్శనీయం.
శుకుడు పరీక్షిత్తుతో- రాజా! భక్తుని ఉపచారాలలో తలమున్కలై ఉన్న కాంచన చేలుడు భగవంతుడు కువల్కలు- కుచేలుని మేన- శరీరాన ఇంపైన కస్తూరి, కర్పూరాలతో మిళితమైన చందనాన్ని సొంపారగ అలదినాడు- కలయ పూశాడు. మార్గాయాసం పోయేలా తాళవృంతం- వీవనతో విసరాడు. అపారమైన భక్తితో గుబాళించే ధూపాలతో ఆ పాపరహితుని పూజించి తాపం పోగొట్టాడు. మించు- చక్కని మణిదీపాలతో నివాళులర్పించాడు. జగత్పతి శ్రీహరి అతని సిగలో పరిమళ భరితాలైన విరుల- పూల మాలలు తురిమాడు. కర్పూర తాంబూలమిచ్చాడు.
సాదరంగా స్వాగతం పలికి.. సత్పాత్రుడైన తన ఆంతరంగిక భక్తునికి గంగిగోవును దానమిచ్చాడు. కుశల ప్రశ్నలు గావించాడు. అంతట కుచేలుని గాత్రం- శరీరం పులకించింది. నేత్రాల నుండి ఆనందబాష్పాలు జాలువారాయి. అనంతరం, వెన్నుని- శ్రీకృష్ణుని మన్ననలకు పాత్రురాలు, అన్నువు- ఇంతు (స్త్రీ)లలో మేలుబంతి (శ్రేష్ఠురాలు), పట్టపురాణి యైన రుక్మిణీదేవి తన హస్త కంకణాలు ఇంపుగా ధ్వనిస్తుండగా, వింజామర వీచుచూ అవనీసురు- విప్రుని అలసట తొలగింపసాగింది. ఆ అద్భుత, అపూర్వ దృశ్యాన్ని పరికిస్తున్న అంతఃపురకాంతలు భ్రాంతలై- భ్రమలో పడ్డవారై అబ్బురపడుచూ తమ స్వాంతా- మనస్సులలో ఇలా అనుకున్నారు…
ఉ॥ ‘ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీ దివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫురదుపాస్యకుడై తనరారు నీ జగ
త్సామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్న వా
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్’
‘ఈ అర్ధనగ్న, నిర్ధన కుతపుడు- క్షితిసురుడు (బాపడు) గత జన్మలో ఎట్టి తపస్సు ఆచరించాడో, ఏమో? మహాయోగుల కోటి- బృందంచే ఉపాసింపబడే ఈ జగన్నాథుని పాన్పుపై ఆసీనుడై ఉన్నాడే! ఎంతటి మేటి మునీశ్వరులు కూడా ఈ మహీసురునికి సాటిరారు గదా!’ అంతేగాక..
చ॥ ‘తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడగా దలంపక యదుప్రవరుం డెదురేగి మోదముం
దనుకగ గౌగిలించి యుచిత క్రియలం బరితుష్టు జేయుచున్
వినయమునన్ భజించె, ధరణీసురుడెంతటి భాగ్యవంతుడో!’
ఆహా! మృదువైన హంసతూలికా తల్పంపై వనితామణి రుక్మిణీదేవితో వినోదిస్తున్నప్పుడు.. ‘ఆ అయ్య- నల్లనయ్య, ఆ శయ్యల మీద సర్వహక్కులూ నావే’ అని తనంత తానే ఇయ్యకొనే- సమ్మతించే రుక్మిణిని కూడా లెక్క చేయక- ఆ మదిరాక్షి ఎదలో ఏమనుకుంటుందో అని కూడా తలవక, యదు భూషణుడు భూదేవునికి ఎదురుగా వెళ్లి మిక్కిలి ముదము- సంతోషంతో అక్కున చేర్చుకున్నాడే! సముచితంగా సత్కరించి, సంతసింపజేసి, ఎంతో వినయంతో ఈ మహానుభావుని అర్చించాడే! ఈ అవనీసురుని- పాఱుని అదృష్టాన్ని ఎంతని కొనియాడేది? అని వనితామణులు అందరూ ఆ పరమ భాగవతునికి మొక్కారు.
అంతఃపురకాంతలు ఇలా తలపోస్తుండగా షోడశ కళాధరుడు శ్రీధరుడు శ్రీదాము- సుదాము (కుచేలు)నికి షోడశోపచారాలు చేశాడు. శ్రీదేవి- రుక్మిణితో కూడా సేవ చేయించాడు. కుచేలుడు బాల్యమిత్రుడు, ఇష్టసఖుడే గాక శిష్ట పూజితుడు, వరిష్ఠ బ్రహ్మవేత్త, మహా భాగవతోత్తముడు. అన్నిటినీ మించి జ్ఞానీ భక్తుడు. ‘తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే, ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం స చ మమప్రియః’ (గీత). ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని- ఈ నలుగురు భక్తులలో, నిరంతరం నా యందే ఏకీభావం (తాదాత్మ్యం) పొంది, అనన్య భక్తియుతుడై ఉన్న జ్ఞాని అతి ఉత్తముడు. ఎందుకనగా, వాస్తవంగా నన్ను- నా తత్త్వాన్ని తెలుసుకొన్న జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడూ నాకు ఎంతో ప్రియుడు. ‘ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్’ (గీత). ఈ నలుగురు భక్తులూ ఉదారులే. కాని, జ్ఞాని సాక్షాత్ నా స్వరూపమే! అని లోకానికి- అవనీ జనులకు చాటి చెప్పాలి. అందుకే రుక్మిణీ వల్లభుడి ఈ ప్రేముడి (ప్రేమా భక్తి, స్నేహం)తో కూడిన ఇంత హడావుడి!
శుక ఉవాచ- రాజా! మురహరుడు ప్రేమతో తన కేలుదమ్మి- కరపద్మంతో నేలవేలుపు (బ్రాహ్మణుడు) కుచేలుని చేయి పట్టుకొని, గురుకులవాసం చేసిన వాసరాల- దినాలలో భాసురంగా జరిగిన విశేషాలను ప్రస్తావిస్తూ ఇంకా ఇలా పలికాడు- ‘భూసురోత్తమా! ఉత్తమమైన వైదిక వంశంలో జన్మించి, నీకు అర్ధాంగియైన వధూరత్నం విధిగా నీకు తగిన విధంగా వ్యవహరిస్తోందా? ఇంతకూ, నీ మతి- మనసు గృహ, ఆరామ, క్షేత్ర, ధన, కనక, వస్తు, వాహన తతి- సముదాయం మీద, సతీ, సంతతి మీద రతి- ఆసక్తి కలిగి ఉన్నట్లుగా కనిపించడం లేదు. నా కర్మగతి- కర్మాచరణంలో నా ప్రవృత్తికి కారణం (నేను కర్మలు అనుష్ఠించడం) కేవలం లోక సంగ్రహం- లోక కల్యాణం మాత్రమే. కొందరు ఉత్తములు నాలాగే కామమోహాలకు లొంగకుండా తమ విధ్యుక్త ధర్మాన్ని ఆచరిస్తుంటారు. అట్టివారు ప్రకృతి సంబంధమైన త్రిగుణాలకు అతీతంగా ఉంటూ కర్తవ్య నిష్ఠతో జీవిస్తారు.’
కుచేలుని ఒంటి మీద గృహస్థ ధర్మాన్ని సూచించే తొమ్మిది పోగుల జందెముంది. కాని, అతని ముఖంలో గృహస్థభోగానుభవానికి చెందిన లక్షణాలు కానరావడం లేదు. అందుకే సందేహించి పరమాత్మ అలా ప్రశ్నించాడని శ్రీధరాచార్యుల వ్యాఖ్య. అనుకూల, విమల, కులజ, కుశల, శీలసంపన్న- ఈ పంచ ‘ల’కారవతి- లక్షణయుత యువతి, ‘సతి’- శ్రీమతిగా ప్రాప్తించడం గృహపతి- గృహస్థు చేసుకొన్న పూర్వ పుణ్యఫలం, సద్గురు అపార కృపా సాధ్యం (దుర్లభా సదృశీ భార్యా సద్గురోః కరణాం వినా). ఆ సద్గురువు జగద్గురువు శ్రీకృష్ణుడేగా! ‘తస్య భార్యా కుచేలస్య.. పతివ్రతా’ అని మూలం. ‘లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య’ అని అమాత్యుల వారి అనుకథనం. కుచేలపత్ని సుచేల- సద్వస్త్రధారిణి. ఏమిటా వస్త్రం? పాతివ్రత్యం! సంపాదనపరుడు కాని, తనను సుఖపెట్టలేని శ్రీవారిని కూడా శ్రీధరుని- భగవంతునిగా భావించి సేవించే శ్రీమతి ఎంతటి పుణ్యవతి, ధన్యురాలు!
శుకుడు- రాజా! భగవంతుడు భక్తునితో ఇంకా ఇలా సంభాషించాడు…
కం॥ ‘ఎఱుగుదువె? మనము గురు మం
దిరమున వసియించి యతడు దెలుపగ వరుసన్
ఎఱుగగ వలసిన యర్థము
లెఱిగి పరిజ్ఞాన మహిమ నెఱుగుట లెల్లన్’
‘మిత్రమా! మన ఇరువురం గురు మందిరంలో ఉండి చదువుకున్న రోజుల్లో ఆచార్యులు ‘సాందీపని’ బోధించగా మనం నేర్వవలసింది నేర్చుకొని ప్రజ్ఞా నిధులమైన- చక్కని పరిజ్ఞాన ప్రాభవాన్ని పొందిన తీరు నీకు జ్ఞాపకముందా? మన గురువు సాందీపని ‘అజ్ఞాన తిమిర ప్రదీపం’- అజ్ఞానమనే అంధకారానికి ప్రజ్ఞానమనే దీపం వంటివాడు. బ్రహ్మవేత్త. వాస్తవానికి విజ్ఞాన ప్రదాత అయిన గురువునై ఉండి కూడా, సకల వర్ణాశ్రమాల వారికి ‘గురుసేవ’ పరమ ధర్మమని బోధించడానికే నేను ఆ మహాత్ముని సేవించాను. అదీగాక, సమస్త భూతాలలో ఆత్మగా ఉన్న నేను తపోవ్రత యజ్ఞదాన శమ దమాదుల వలన అంతగా సంతసించను. భక్తితో గురువును సేవించిన వారిని ప్రేమిస్తాను’. ప్రతి వ్యక్తికి గురువులు ముగ్గురు. జన్మదాత జనకుడు పూజ్యుడైన ప్రథమ గురువు. కర్మ విద్యా ప్రదాత, వేదాధ్యాపకుడు ద్వితీయ గురువు. బ్రహ్మజ్ఞాన ప్రదాత తృతీయ- అంతిమ గురువు. అట్టివాడు సాక్షాత్ నేనే!
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006