అవనీపతి పరీక్షిత్తు తపోధన్యాగ్రణి శుకునితో.. ‘మహామునీ! నళినీ (పద్మ) దళలోచనుని అనితర వీర్యగుణ సంపదలు అనంతాలు. వాని గురించి వేమారు- పలుమారులు ఎంతగా విని ఉన్నా స్వాంతా- చిత్తానికి తనవి తీరదు. ఎంతటి ఇంద్రియలోలుడైనా ఇందీవరుని అరవిందనేత్రుని- ముకుందుని దివ్య కథా వైభవాన్ని ఒక్కమారు విన్నా అతను తన ఐహిక సుఖాసక్తిని పోనిడి- మాని దేవదేవుని యందు భక్తి తత్పరతని పొంది తీరుతాడు. భగవత్కథ ఎంత విన్నా తృప్తి కలుగదు. ఇది భగవంతుని తోటి నిత్య వియోగం. కాని, కథ వింటుంటే ఎంతో ఆనందం, ఇది స్వామితోటి నిత్య సంయోగం. అదీగాక, పరమాత్ముని విషయంలో ప్రవర్తించే ఇంద్రియాలే సార్థకాలు. ఇతరాలు అనర్థకాలు- వ్యర్థాలు..
చ॥ ‘హరి భజియించు హస్తములు హస్తము, లచ్యుతు గోరి మ్రొక్కు త
చ్ఛిరము శిరంబు, చక్రధరు జేరిన చిత్తము చిత్త, మిందిరా
వరుగను దృష్టి దృష్టి, మురవైరి నుతించిన వాణి వాణి, య
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్’
‘మునీంద్రా! గజేంద్ర వరదుని- కృష్ణుని భజించే- సేవించే హస్తాలే హస్తాలు. భక్తితో భుజగేంద్ర శయనుని- అచ్యుతుని అంఘ్రి (పాద) పద్మాలకు ప్రణమిల్లే శిరసే శిరస్సు. ఆ మాధవుని యందు మగ్నమైన మనసే మనస్సు. మందరగిరి ధరుని, ఇందీవరశ్యాముని- గోవిందుని సుందర రూపాన్ని దర్శించే కన్నులే కన్నులు. ఆ కరుణాలవాలుని కీర్తించే నాలుకే నాలుక. మార జనకుని, వ్యాల- కాళియ మర్దనుని లీలలను పారవశ్యంతో ఆలకించే వీనులే- చెవులే వీనులు. కావున, మునివరా! ఆ పరమేశ్వరుని కనీవినీ ఎరుగని కరమరుదైన అశేష లీలా విశేషాలను గూర్చి ఇంకనూ నాకు వివరించు’ అని కోరగా హరి పాదపద్మాసక్తుడైన బాదరాయణి- వేదవ్యాస తనయుడైన శుకయోగి ఇలా నివేదించాడు..
సీ॥ ‘అనుడు వేదవ్యాస తనయుడా యభిమన్యు
తనయుని జూచి యిట్లనియె బ్రీతి
జనవర! గోవింద సఖుడు కుచేలుండు
నా నొప్పు విప్రుండు మానధనుడు
విజ్ఞాని రాగాదివిరహిత స్వాంతుండు
శాంతుండు ధర్మ వత్సలుడు ఘనుడు
విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్య్రంబు
బాధింప నొరుల గార్పణ్యవృత్తి
తే॥ నడుగ బోవక తనకు దానబ్బినట్టి
కాసు పదివేల నిష్కముల్గా దలంచి
యాత్మ మోదించి పుత్రదారాభిరక్ష
యొక విధంబున నడుపుచు నుండునంత’
నరేంద్రా! పూర్వం గోవింద సఖుడు- కృష్ణుని బాల్యమిత్రుడు- కుచేలుడు అనే భాసురుడైన- జ్ఞాన వైరాగ్యాలతో విరాజిల్లు, భూసురుడు ఉండేవాడు. అతడు మిక్కిలి స్వాభిమాని, గొప్ప విజ్ఞాని. రాగద్వేషాలు లేనివాడు. పరమశాంతికి ఖని- గని. (శాస్ర్తాలన్నిటికి శమము- అంతరింద్రియ నిగ్రహమే చరమ ప్రయోజనం. కాన, ఎవని ఉల్లము- మనసు ఎల్లవేళలా ప్రసాద గుణ భూయిష్ఠంగా- చల్లగా, ప్రశాంతి నిలయంగా ఉంటుందో, వాడే సర్వశాస్త్ర పారంగతుడు’). అతడు ధర్మవత్సలుడు- చక్కని ధర్మనిరతి గల యతి సమానుడు, జితేంద్రియుడు. బ్రహ్మరతి గలవాడు- ఆత్మజ్ఞాని. అతి నిర్ధనుడు. అయినా ఎంతో ధృతి- ధైర్యం గలవాడు. సంగ్రహం- ధన సంచయం, ప్రతిగ్రహం- దాన స్వీకరణం చెయ్యక ప్రారబ్ధ ప్రాప్తంతో తృప్తి పడతాడు. దీనమతియై ఎవ్వరినీ ఏమీ యాచించడు.
అయాచితంగా ప్రాప్తించిన కాసు- కానినే పదివేల ధనరాశిగా తలుస్తూ, దానితోనే ఏదో విధంగా భార్యాపుత్రులను సాకుతూ వాసికెక్కినవాడు. (సఖుడు- ‘సహ ఖ్యాయతే ఇతి సఖా’ రామలక్ష్మణులు, కృష్ణార్జునుల వలె కృష్ణ కుచేలులు- సమానమైన ఖ్యాతి కలవారు). జితేంద్రియుడు- పంచ జ్ఞానేంద్రియాల అనుభవం పొందుతూ కూడా, ఎందునా- అనగా వింటూ, తాకుతూ, కంటూ, తింటూ, మూచూస్తూ- వాసన చూసియూ సంతోషం కాని, దుఃఖం కాని పొందనివాడు. పరధన విషయంలో ఎవడు అంధుడో, పరనారి విషయంలో ఎవడు నపుంసకుడో, పరవాద (పరనింద) విషయంలో ఎవడు మూగవాడో వాడే జితేంద్రియుడు. ధర్మవత్సలుడు- ధర్మం పట్ల విముఖుడు ఎంత బలవంతుడైనా సాంతం- పూర్తిగా దుర్బలుడే, ఎంత ధనవంతుడైనా ధనహీనుడే, ఎంత జ్ఞానవంతుడైనా అజ్ఞాని- మూర్ఖుడే. ఒక్కొక్కడు దరిద్రుడైనా దామోదరునికి దూరం కాడు.
నిజానికి అచ్యుతుడు అకించన- నిరుపేద ప్రియుడు. కుచేలుడు తపశ్శాలియైన దరిద్రుడు. ఆత్మజ్ఞాని నిర్ధనుడైనా సదా సంతృప్తుడై ఉంటాడు. ఎవరితోడూ లేకున్నా అతడు మహాబలవంతుడే. భుజింపకున్నా ఆత్మరసంచే నిత్యతృప్తుడుగానే ఉంటాడు. సర్వత్ర- అంతటా సమదృష్టితో ఉంటాడు కాన, ఆయనకు జోడు- సమానుడు ఎవ్వడూ ఉండడు (ఆదిశంకరులు). ఇలా ‘జ్ఞానీ భక్తుడు’ కనుకనే కుచేలుడు కృష్ణునికి అత్యంత ప్రియుడు. దారిద్య్రానికి పరాకాష్ఠ యాచనే కాని నిర్ధనత్వం- బీదరికం కాదు. పరమేశ్వరుడు శంకరుడు కౌపీనధారి- గోచిపాతరాయుడైనా ‘పరమేశ్వరుడు’ అని లోకంలో ప్రసిద్ధమే కదా! ఇన్నీ మరిన్నీ విశేషాలను వివరించే పేరెన్నికగన్న గాథయే ‘కుచేలోపాఖ్యానం’.
అసలు సిసలైన ‘సఖ్యభక్తి’కి అపూర్వ ఉజ్జల ఉదాహరణ. భాగవతం దశమ స్కంధంలో రెండు ప్రసంగాలలో అసంగుడైన శుకయోగికి ‘భావ సమాధి’ కలిగిందని ఆచార్యవాణి. మొదటిది గోవత్స అపహరణ లీల కాగా, రెండవది ఈ కుచేలోపాఖ్యానం. ఈ ఉపాఖ్యానంలో పోతన భగవత్ భాగవతుల మధ్య నెలకొన్న అవినాభావ, ప్రగాఢ, అనిర్వచనీయ, సమున్నత బంధాన్ని, సంబంధాన్ని, అనుబంధాన్ని రసభావ బంధురంగా అనుభవపూర్వకంగా రూఢిగా రూపించాడు.
‘కుచేలుడు’ అనేది గౌణనామం. చేలము అనగా వస్త్రం. కుచేలుడనగా జీర్ణమైన- చినిగిన, మలిన వస్త్రం ధరించిన వాడు. ఇది అక్షరార్థమే కాని పురాణ పరమార్థం మాత్రం ఇది కాదు. ఇక్కడ చేలం- వస్త్రమనగా అజ్ఞానమనే ఆవరణకు ప్రతీకం- సంకేతం. వస్త్రం దేహాన్ని ఆవరించునట్లు అజ్ఞానం జ్ఞానాన్ని- ఆత్మ స్వరూపాన్ని ఆవరిస్తుంది (మరుగు పరుస్తుంది)- ‘అజ్ఞానేన ఆవృతం జ్ఞానం’ అని కదా గీత. ‘జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః’.. (గీత). బ్రహ్మజ్ఞానం అనే కత్తితో అజ్ఞానమనే వస్ర్తాన్ని జీర్ణం శీర్ణం గావించిన- అనగా బొత్తిగా చించి పడేసినవాడు కుచేలుడు. కనుకనే బ్రహ్మ విద్వరుడు- బ్రహ్మవేత్తలలో ఉత్తముడు, శ్రేష్ఠుడు.
మరోవిధంగా.. ‘వాసాంసి జీర్ణాని యథా విహాయ’ (గీత)- విశీర్ణమయ్యే- కృశించి, నశించి పొయ్యే శరీరమే జీర్ణవస్త్రం. ఎంతగా పోషించి రక్షించినా ఏదో ఒకనాడు వల్లకాటికి ఆహుతి అయ్యేదే! దహింపబడేది కాన, దేహం. ఒడలు చినిగి- సడలి సన్నగిల్లి వెడలిపొయ్యేది కాన శరీరం. ఇదే కుచేలం. ఈ దృష్టితో లోకంలోని వారంతా కుచేలులే. కాని, ఈ సత్యం గ్రహించి నిత్యం తదనుగుణంగా వర్తించే- జీవించే వారెందరు? ‘మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్’ అన్నట్లు కుచేలుని వంటి మహాత్ముడు అత్యంత దుర్లభుడు.
సీ॥ ‘లలిత పతివ్రతా తిలకంబు వంశాభి
జాత్య తద్భార్య దుస్సహదరిద్ర
పీడచే గడునొచ్చి పెదవులు దడుపుచు
శిశువులాకటి చిచ్చుచే గృశించి
మలమల మాడుచు మానసం బెరియంగ
బట్టె డోరెము మాకు బెట్టు మనుచు
బత్త్ర భాజనధృత పాణులై తను జేరి
వేడిన వీనుల సూడినట్ల’
తే॥ ‘యైన నొకనాడు వగచి నిజాధినాథు
జేరి యిట్లని పలికె నో జీవితేశ
తట్టు ముట్టాడు నిట్టి పేదఱిక మిట్లు
నొంప దీని కుపాయ మూహింప వైతి’
శుకుడు- రాజా! కుచేలుని ధర్మపత్ని (వామాక్షి) మహా పతివ్రత. సద్వంశమున పుట్టినది. తిండిలేక కృశించిన పిల్లలు ఆకలి చిచ్చుకు తాళలేక, ఎండిన పెదవులను నాలుక- లాలాజలంతో తడుపుకొంటూ మలమల మాడుచున్న డొక్కలతో, చేతుల్లో ఆకులూ, గిన్నెలూ పట్టుకొని కన్నతల్లి వద్దకొచ్చి ‘అమ్మా! ఆకలేస్తోందే! పట్టెడన్నం పెట్టవే’ అని వేడికొనగా తట్టుకోలేక మిక్కిలి నొచ్చుకొని ఆ తల్లి తల్లడిల్లిపోయింది. భరించడం తనవల్ల కాక ఆ ఇల్లాలు ఒకనాడు భర్తతో.. నాథా! తట్టుముట్టాడు- మిక్కుటమైన పేదరికం ఇంట్లో విలయతాండవం చేస్తోంది. ఈ బాధనుంచి బయటపడే ఏదైనా ఉపాయం ఆలోచించండి’ అని ఆవేదనతో పలికింది. ఆ ఇంతి- స్త్రీ తన కాంతునితో ఇంకా ఇలా అన్నది- మహాత్మా! అఖిల లోకారాధ్యుడు శ్రీకృష్ణుడు మీకు బాల్య సఖుడు గదా! ఆ మహానుభావుణ్ని ఒక్కసారి దర్శించండి. అతని అక్కటికం- దయ అనే సూర్య ప్రకాశం పొంది కటిక పేదరికమనే చిమ్మ చీకటిలో మగ్గుతున్న మమ్ము ఉద్ధరించండి.
చ॥ ‘వరదుడు సాధు భక్తజన వత్సలు డార్తశరణ్యు డిందిరా
వరుడు దయోపయోధి భగవంతుడు కృష్ణుడు దా గుశస్థలీ
పురమున యాదవ ప్రకరముల్ భజయింపగ నున్నవాడు, నీ
వరిగిన నిన్ను జూచి విభుడప్పుడ యిచ్చు ననూన సంపదల్’
స్వామీ! అమర ప్రభువు మురహరుడు వరములనిచ్చు మేటి దేవర. భగవంతుడు భక్తవత్సలుడు. శ్రీపతి తన్ను ఆశ్రయించిన ఆర్తులను ఆదుకొనువాడు. వాసుదేవుడు దాసులపై ఆశించిన దాని కన్నా మిన్నగా దయ చూపువాడు. యాదవులు తన్ను సాదరంగా సేవిస్తుండగా ఆ మాధవుడు ప్రస్తుతం ద్వారకలో ఉన్నాడు. నాథా! ఆ జగన్నాథుని ఒక్కసారి చూచిరండి. ఆ కృపాసాగరుడు మిమ్ములను చూస్తే చాలు. వెంటనే మీకు అపార సంపదలు అనుగ్రహిస్తాడు.
మ॥ ‘కలలోనం దను మున్నెఱుంగని మహాకష్టాత్ముడైనట్టి దు
ర్బలు డాపత్సమయంబునన్ నిజ పదా బ్జాతంబు లుల్లంబులో
దలపన్నంతన మెచ్చి యార్తి హరుడై తన్నైన నిచ్చున్, సుని
శ్చల భక్తిన్ భజియించువారి కిడడే సంపద్విశేషోన్నతుల్’
మున్ను ఎన్నడూ తన్ను- వెన్నుని, కలలో కూడా తలవని- స్మరించని బలహీనుడు పాపాత్ముడు కూడా ఆపన్నుడై- ఆపదలపాలై, ఖిన్నుడై (దుఃఖిస్తూ) ఆ సంకటస్థితిలో ఒక్కసారి ఆ భక్తజన మందారుని- కృష్ణుని పాదారవిందాలను మనసా తలచుకున్న చాలు, అట్టివానిని కూడా ఆ శ్రీహరి కనికరిస్తాడు. మెచ్చుకొని అతనికి తన్నుతానే అర్పించు- ఇచ్చుకుంటాడు. అంతటి ప్రసన్నాత్ముడు భక్తితో తన్ను సేవించేవారికి వెన్ను తట్టి మరీ క్రన్నన- శీఘ్రంగా సకల సంపదలు ఇయ్యకుండా ఉంటాడా?
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006