ఆమె చూస్తే ఓ సామాన్య ఇజ్రాయేలీయ యూదా మహిళ! కానీ ఆశ్చర్యం, పర్షియా దేశాధినేత అయింది. కేవలం ప్రార్థనా బలమే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లింది! ఆమె మహా అందగత్తె. అందానికి మించిన వినయం కలిగి ఉండేది. పెద్దల పట్ల గౌరవం ప్రదర్శించేది. అందరితో చనువుగా దూసుకు పోయే సేవాతత్వం కలిగి ఉండేది. వెరసి ఇవన్నీ ఆమెను ఓ మహారాజ్ఞి స్థానంలో నిలబెట్టిన అంశాలు! ఆమె పేరు ఎస్తేరు. బాల్యంలోనే తలిదండ్రుల్ని పోగొట్టుకున్న అభాగ్యురాలు. తన దాయాది, మొర్దెకై సాయంతో పర్షియా దేశపు రాచకోటలో అడుగుపెట్టింది. ఆ దేశ రాజైన అహర్ష్యా రోషు ఇష్టపడేంతటి మహద్భాగ్యం సంపాదించుకొంది.
‘కోటలోకి ప్రవేశించేముందు వివరాలు చెప్పొద్దు. చెబితే లోపలకి రానీయరు. కక్ష పెంచుకొంటరు’ అని చెప్పిన అన్న గారి సూచన పాటించి జాగ్రత్త పడింది ఎస్తేరు. ఓ రోజు రాత్రి.. బహు భార్యలు గల ఆ రాజు, పట్టపు రాణి అయిన తన భార్యామణిని చెంతకు రమ్మని దూతికల ద్వారా కబురంపుతాడు. అయితే ఆమె రాజు దగ్గరికి వెళ్లడానికి నిరాకరించింది. రాజు కోపగించుకున్నాడు. అందుకే తన రాచకోటలోని కన్యకామణుల్ని అందరినీ రప్పించుకొన్నాడు. అప్పుడు ఆ రోజు రాత్రి ఎస్తేరుకు రాజును కలవడానికి అవకాశం కలిగింది. ఆమె రాజును సేవించింది. ముగ్ధుడైన రాజు ఎస్తేరును చెంతకు చేర్చుకున్నాడు. ఆమె సౌందర్యానికి దాసుడైపోయాడు రాజు. ఆమెలోని వినయానికి, ఉపచార మర్యాదల సేవా భావాలకి సమ్మోహితుడయ్యాడు. ఆమెను విడిచి ఒక్క క్షణం విడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఆమెను ఏకంగా ఓ మహా రాణిగా అభిషేకించేశాడు. క్రీస్తు ఇంకా 480 సంవత్సరాలకు పుడతాడనగా ఈ కథ జరిగింది.
యూదులు ఆత్మాభిమానులు. కానీ పర్షియన్ల ఏలుబడిలో ఉన్నారు. అభిమానాన్ని అహంకారమని భావించిన పర్షియన్లు యూదుల్ని హింసించడం మొదలుపెట్టారు. ఎస్తేరు యూదా మహిళ. తన ఆభిజాత్యం చెప్పకుండా రహస్యంగా రాచరికం ముందు వచ్చి వాలింది. తన వారిని తనముందే హింసిస్తున్నందుకు బాధ పడింది. భయపడింది. ఎలాగైనా తన వారిని రక్షించాలనుకొంది. దేవుడ్ని ప్రార్థించింది. తనకు కలిగే అవకాశాలన్నిటినీ తన వారిని రక్షించడానికే ఉపయోగించింది. జాతి విమోచన ప్రధానం అనుకొంది. ఓ రాత్రి సుఖ శయనంపై ఉన్నప్పుడు కోటలో కొందరు చేసే కుట్రలు వివరించి, తన వారిని ఎన్నోసార్లు కాపాడింది. రాజు అసలు దోషులపై కోపోద్రిక్తుడౌతాడు. ఎస్తేరును రాణి హోదాలో సత్కరిస్తాడు. అలా ఆ యూదా మహిళామణి ఆ పర్షియా దేశానికే మహారాణి అవుతుంది. బహుధా ప్రజా ప్రశంసలు అందుకుంటూ పాలన సాగిస్తుంది.