కఠోపనిషత్తు ఒక అద్భుతం. ఆ ఉపనిషత్తును అధ్యయనం చేసే అవకాశం మన అదృష్టం. వేల ఏండ్ల క్రితమే ఈ విశ్వం ఆనుపానుల గురించి, ఆ విశ్వమూలం గురించి అధ్యయనం చేసి, వాటిని శ్లోకాల రూపంలో మనకు అందించడంఎంతటి ఘనకార్యమో గుర్తెరగాలి. ఈ ఉపనిషత్తులు చాలామంది అనుకున్నట్టుగా తత్త్వానికి చెందినవికావు. ఇవి శాస్ర్తానికి, విజ్ఞానానికి చెందిన జ్ఞాన నిధులు. ఇంకా చెప్పాలంటే.. జ్ఞాన, విజ్ఞానాలను మించిన ప్రజ్ఞానానికి చెందినవి.
ప్రజ్ఞ లేక ప్రజ్ఞానమంటే త్రికాలాలకూ సంబంధించిన జ్ఞానం. ‘ప్రజ్ఞా త్రైకాలకీ మాతా’. సమష్టి జ్ఞానం, పూర్వజ్ఞానం ఇలాంటి పరిపూర్ణ జ్ఞానమే బ్రహ్మ స్వరూపం. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అన్నారు కదా! ‘తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః’- ఆ బ్రహ్మతత్తాన్ని ముందుగా విజ్ఞాన రూపంగా గ్రహించి తర్వాత ప్రజ్ఞాన రూపంగా దానిలో స్థిరపడాలని ఉపనిషత్తు చెప్పిన మాట. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ అనే వేదోక్తి రుగ్వేదంలోని ఐతరేయ ఉపనిషత్తులోనిది అని తెలుసు. అయితే, ఈ ఉపనిషత్తులు చెప్పే విషయాలు తత్త శాస్ర్తానికి చెందినవని, శాస్ర్తానికి నిలబడవని కొందరి విమర్శ. కానీ, అవి ముమ్మాటికీ శాస్త్ర విజ్ఞానానికి చెందిన జ్ఞాన నిధులే!
ఉపనిషత్తులను అర్థం చేసుకోవాలంటే మనం అనంత విశ్వంలో ఒక భాగమై ఆలోచించాలి. మానవుడు అనే అల్పదృష్టితో కాకుండా,
విశ్వమానవుడై ఆలోచిస్తే ఉపనిషత్తులను అర్థం చేసుకోగలం. అదెలాగంటే.. ముందుగా మానవ సహజ లక్షణమైన సంకుచిత ధోరణిని విడిచి పెట్టాలి. కఠోపనిషత్తు చెప్పినట్టుగా ఈ కనిపించే విశ్వాన్ని ఒక వస్తువుగా గుర్తించాలి. దృగ్గోచర విశ్వం.. అగోచర (కనిపించని) పదార్థం నుంచి ఉద్భవిస్తూ, తిరిగి అందులోనే లయమవుతున్నది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం కూడా ఈ భూమి మీద పంచభూతాల ద్వారా ఉదయించి, వాటితోనే జీవించి, మళ్లీ వాటిలోనే లయమవుతున్న దృగ్విషయాన్ని గుర్తించాలి. అలాగే సూర్యుడు ఉదయించి అంటే విశ్వశక్తి నుంచి ఉద్భవించి, ఆ విశ్వశక్తిలోనే జీవించి, అదే విశ్వశక్తిలో కలిసిపోతాడు అంటుంది
కఠోపనిషత్తు. సైన్స్‌గా చెప్పే ఆధునిక శాస్త్ర విజ్ఞానమూ దీనినే నిరూపిస్తున్నది. అలాంటప్పుడు కఠోపనిషత్తు మాట్లాడింది తత్తమెలా అవుతుంది?
యతశ్చోదేతి సూర్యో అస్తం యత్ర చగచ్ఛతి తం దేవాః సర్వేర్వితాస్తదు నాత్యేతి కశ్చన ఏతద్వైతత్
నిరూపణ అనే దృగ్విషయం మీద ఆధారపడి మన ప్రస్తుత సైన్స్ ముందుకెళ్తున్నది. కానీ, మన పూర్వికులు దివ్యదృష్టితో, తమ యోచనా శక్తితో, తపస్సుతో విశ్వశక్తి రహస్యాలను కనుగొన్నారు. ఆ విశ్వశక్తే తిరిగి విభూతులుగా మారుతున్నదని తెలియజేశారు.
న జాయతే మ్రియతే వా విపశ్చిత్
నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్
అజో నిత్యః శాశ్వతోయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే॥
ఆత్మ జన్మించడం లేదు. మరణించడమూ లేదు. ఇది దేని నుంచి జన్మించినది కాదు. ఏది దీనినుంచి వేరుగా రూపొందడం లేదు. ఇది జన్మరహితమైనది, ఎన్నటికీ ఉండేది. శాశ్వతమైనది. శరీరం నశించినా నశించనిది. ఇదే నేటి శాస్త్రీయ సిద్ధాంతమైన ‘శక్తి నిత్యత్వ నియమాన్ని’ మరింత విస్తృతంగా చెప్పే శ్లోకం.
ఇక్కడ ‘శరీరం’ అనే పదాన్ని ‘శీర్యతే ఇతి శరీరః’- జీర్ణమైపోయేవన్నీ శరీరాలే! అంటే కనిపించేవన్నీ నశించేవే. గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కాలాంతరం నశించేవే. అంటే అన్నీ శరీరాలే. ఇంతటి విస్తృతమైన అర్థమిచ్చే అద్భుత శ్లోకాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. మానవ దేహాలకు ముడిపెట్టి దాన్ని సంకుచితంగా చేయడం శోచనీయం. ఇలా చెబుతూపోతే కఠోపనిషత్తులో ప్రతి శ్లోకమూ ప్రజ్ఞాన రూపమే! అద్భుత సౌందర్యం కలిగి ఉన్నవే! వాటిని పఠిస్తూ, ఆస్వాదిస్తూ, ఈ విశ్వశక్తిని మనలో నిలుపుకొందాం. విశ్వశక్తిగా మనమూ జీవిద్దాం. అదే ఆనందకరం, మోక్షస్థితి.
…? రావుల నిరంజనాచారి