కీర్తనలు అనే సరికి మనకు బైబిలు గ్రంథంలో.. దావీదు మహారాజే గుర్తొస్తాడు. మహారాజు స్థాయిలో ఉండి కూడా, ఒక సామాన్యునిగా మారిపోయి దేవునిపై అన్ని కీర్తనలు రాయడం ఓ గొప్ప సంగతి. అందుకు బలమైన కారణం ఒకటి ఉండి తీరాలి.
ఈ దావీదు మహారాజు సమైక్య యూదా సామ్రాజ్యానికి రెండో మహారాజు. క్రీస్తుకు వెయ్యేండ్లు ముందటివాడు. క్రీస్తు ప్రభువు ఆ మహారాజు వంశీయుడు, వారసుడు. ఆయన రాసిన కీర్తనలు ఇప్పటికీ చిరంజీవులే. వాటి ఆయుష్షు మూడు వేల సంవత్సరాలకు పైబడే. ఆయనలోని బాధాతప్త హృదయం నుంచి వందల కొద్ది కీర్తనలు వెలువడ్డాయి. అంతటి మహారాజు బాధతో కుంగిపోవలసినంతటి దుర్ఘటన ఏమై ఉంటుందీ ? ఏ సౌకర్యానికైనా కొదవలేని ఆ మహారాజు భయపడింది నైతిక విలువలకు. సంఘానికి. పాపభీతికి. తనను నడిపించిన దైవానికి. అవును ఆయన పాపం చేశాడు. చేసిందాన్ని ఒప్పుకోవడం నిజాయితీ. ఒప్పుకొన్న దానికి పశ్చాత్తాప పడటం గొప్ప సంస్కారం.
ఇక మీదట దాన్ని కనుసన్నల్లోకి రానీయకుండా జాగ్రత్తపడటం, పశ్చాత్తాపపడటం మహోత్కృష్టం. ఈ మూడూ అలా ఉంచితే , ఆ విరిగి నలిగిన బాధాతప్త హృదయాన్ని అక్షర రూపంలో కీర్తనలుగా పాడుకోవడం నాలుగో విశేషం. ఇంతకూ ఆ మహారాజు చేసింది అంతటి తప్పా అంటే, అది తప్పే కాదు . చాలా ఘోరమైన పాపం. అంతకుమించింది మరొకటి లేనే లేదు. అన్ని తప్పులూ అందులోనే ఇమిడి పోయాయని చెప్పక తప్పదు. సంఘటనాత్మకంగా ఏర్పడినప్పటికీ.. అదో పీడకల. తన కోటలోని ఒక ఉద్యోగి భార్యపై అనుకోని రీతిగా ఆకర్షితుడు కావడం, ఆమెను బలవంతంగా కోటకు రప్పించుకొని , తన కామవాంఛను తీర్చుకోవడం- ఇదొక దోషం. అంతటితో ఆగక, ఆమె భర్త మరణానికి బాహ్యంగా ప్రధాన కారకునిగా ఉండడం అనేది మరో పాపం.
ఇవి ఆయన చేసిన రెండు పాతకాలు. ఒకటి అత్యాచారం. మరొకటి హత్య. రాజ్య సింహాసనంపై కూర్చున్న మహాప్రభువు.. మానవాధమునిగా పతనమై పోయాడు. తను చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెంది దేవుడి ముందు మోకరిల్లి దుఃఖించాడు. ఆ దుఃఖంలోనుంచి పుట్టుకొచ్చిన గీతాలు, అగ్ని భావ మహా ప్రవాహాలు. అవే దావీదు కీర్తనలు. దేవుని ఔన్నత్యాన్ని ప్రకటించేవి. ఆయన ప్రేమను స్తుతించేవి. మానవుడి దౌర్బల్యాన్ని దేవుడి ముందు ప్రకటించుకునేవి. విషాదకరమైన ఈ లౌకిక జీవన సమరంలోంచి తప్పించమని దేవుణ్ని వేడుకొనేవి. ప్రపంచ ప్రసిద్ధ సాహితీ వనంలో వాడని పరిమళ పుష్పాల్లా నిత్యం
గుబాళించేవి. మానవుడు ఎంత ఎదిగినా దేవుడి ముందు ఒదిగి ఉండాలని చాటి చెబుతాయివి.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024