ఊరి పెద్దలు రాములవారి గుడి దగ్గర మహాభారతం ప్రవచనం చెప్పిస్తున్నారు. వాటి కరపత్రాలను పంచే పనిని చురుకైన ఒక యువకుడికి అప్పగించారు. ఆ యువకుడు వీధులన్నీ తిరిగి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి అందరూ తప్పక రావాలని కోరాడు. చివరిగా ఒక ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆ ఇంటావిడ పాత్రలు కడుగుతున్నది. యువకుడు వెళ్లి ఆమెకు విషయం చెప్పాడు. ‘మన ఊర్లో ఎప్పుడూ చెప్పేదే కదా మహాభారతం. వినివినీ విసుగొచ్చేసింది’ అని చెప్పి కరపత్రం చేతిలోకి తీసుకోలేదు. ఆమెకు ఏం చెప్పాలో యువకుడికి అర్థం కాలేదు. ఆమె చేస్తున్న పనిని గమనించాడు. కడిగిన పాత్రల్ని ఎండలో ఆరబెడుతోంది. అందులో ఒక బిందె మిలమిలా మెరుస్తూ కనిపించింది. ‘అన్ని పాత్రలూ మామూలుగా మెరుస్తున్నాయి. ఇది మాత్రమే ఎందుకు మిలమిలా మెరుస్తున్నది?’ అని అడిగాడు యువకుడు. ‘ఇది రాగి బిందె. తిరుపతి వెళ్లినప్పుడు గోవింద రాజస్వామి గుడి దగ్గర కొన్నాం. ఆరోగ్యానికి మంచిదని దీనిలో నీళ్లు పోసుకుని తాగుతాం’ అని బదులిచ్చిందామె. ‘సంతోషం… అలా మిలమిలా మెరవడానికి కారణం ఏమిటి?’ అని అడిగాడు. ‘అది కూడా తెలియదా నీకు… దాన్ని చింతపండుతో బాగా రుద్ది కడుగుతాను.
అందుకే మెరుస్తున్నది’ అని చెప్పింది. ‘రోజూ చింతపండు వేసి కడుగుతారా?’ అని అడిగాడు. ‘చింతపండు వేసి కడగకపోతే మరకలు పోవు!’ అని బల్లగుద్ది చెప్పినట్లు చెప్పింది. ఆ యువకుడు మెరుపు ముఖంతో ‘మనం రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయి మంచిచెడ్డలు మరుస్తాం. పాపపుణ్యాలు పక్కనపెడతాం. పాప చింతన తలంపు ఉండదు. అందుకే మన ఊర్లో ప్రతి సంవత్సరం మంచి ఉపన్యాసకులతో మహాభారతం చెప్పిస్తారు. దారి తప్పిన మన మనసు గాడిలో పడుతుందని మన ఊరి పెద్దల నమ్మకం. మహాభారతం ఎన్నిసార్లు విన్నా ప్రతిసారీ మనకు కొత్త విషయం తెలుస్తుంది. అవకాశం వదులుకోకండి. రాగి బిందె మిలమిలా మెరుస్తుందని రోజూ చింతపండు వేసి రుద్దుతారే… లౌకిక వ్యవహారాల్లో మలినమయ్యే మన మనసును ఎంత చింతపండుతో తోమితే శుద్ధి అవుతుంది?’ అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయాడు యువకుడు. ‘భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నాయి’ అని అర్థం చేసుకుంది ఆ గృహిణి. ఆరోజు సాయంత్రం అందరికన్నా ముందు వెళ్లి మొదటి వరుసలో కూర్చుని భారతం విన్నది.