TTD News | కార్తీక వన భోజనం కార్యక్రమాన్ని ఆదివారం నాడు తిరుమలలో జరుగనున్నది. గోగర్భం సమీపంలో గల పార్వేట మండపంలో వన భోజనం నిర్వహిస్తారు. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ సర్వం సిద్దం చేసింది.
ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామి చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుంచి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. వనభోజనం కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొంటారు.