Srisailam | అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీశైల మల్లన్న ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శనివారం నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఆధ్యాత్మికంగా దివ్యమైనదిగా భావించే ఈ మాసంలో మల్లికార్జున స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనేపథ్యంలో నెల రోజులపాటు గర్భాలయ దర్శనాలను అధికారులు నిలిపివేశారు. అదేవిధంగా శని, ఆది, సోమవారాల్లో మలన్న స్పర్శదర్శనాన్ని కూడా బంద్ చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక అభిషేకాలు, స్పర్శ దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయి. కార్తికమాసంలో దీపాలు వెలిగించడాన్ని భక్తులు శుభప్రదంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఆలయ ఉత్తర మాఢ వీధుల్లో మట్టి దీపాలు వెలిగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
కార్తీకమాస పర్వదినాలు, సెలవు రోజులలో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉంది. కావున భక్తులందరికీ సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు వీలుగా కార్తీక మాసమంతా కూడా గర్భాలయ ఆర్జిత అభిషేకాలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే కార్తీకమాస రద్దీ రోజులలో అనగా శని, ఆది, సోమ వారాలు శుద్ధ ఏకాదశి, కార్తీక పూర్ణిమ మొదలైన రోజులు ( కార్తీకమాసంలో మొత్తం 16 రోజులు) స్వామివారి స్పర్శదర్శనం పూర్తిగా నిలిపివేశారు. ఈ రద్దీ రోజుల్లో సామూహిక ఆర్జిత అభిషేకాలను కూడా నిలిపివేశారు. కార్తీకమాసంలో ఉచిత స్పర్శదర్శనం తాత్కాలికంగా రద్దు చేశారు.
సాధారణ రోజుల్లో రోజుకు మూడు విడతలుగా స్పర్శదర్శనం, మూడు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలకు అవకాశం కల్పించబడుతుంది. కాగా భక్తులు స్పర్శదర్శనం టికెట్లను, ఆర్జిత అభిషేకాల టికెట్లను ఆన్లైన్లో మాత్రమే పొందవలసి ఉంటుంది. ఇప్పటికే నవంబర్ నెల టికెట్ల కోటాను దేవస్థానం వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరిగింది. టికెట్ల లభ్యతను బట్టి ప్రారంభ సమయానికి కంటే ఒక గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లను పొందే అవకాశం కల్పించబడింది. టికెట్లను www.srisailadevasthanam.org వెబ్సైట్ ద్వారా పొందవచ్చు లేదా ఆండ్రాయిడ్ మొబైల్లో srisaila devasthanam యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా టికెట్లు పొందవచ్చు.