నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్య కర్మణః
శరీర యాత్రా౨పి చ తే న ప్రసిద్ధ్యే ద కర్మణః!
(భగవద్గీత – 3-8)
‘అర్జునా! శాస్త్రం విధించిన కర్మలను విధిగా ఆచరించు. కర్మలను ఆచరించకుండుట జడత్వం. జడతకన్నా కర్మాచరణ ఉత్తమం. శరీర పోషణకైనా కర్మాచరణ అవసరం’ అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ.అభిప్రాయాలేవీ లేకుండా జనించిన మనం, వయసుతోపాటు అభిప్రాయాలను, ఊహలను పెంచుకుంటూ అపరిమిత జీవితాన్ని పరిమితం చేసుకుంటాం. ప్రతి వ్యక్తి జీవితానికీ ఒక ప్రయోజనం ఉంటుంది.
ప్రయోజన భరితమైన ఆలోచనలు ఉన్నతస్థితికి చేరేందుకు సహకరిస్తాయి. క్షత్రియుడిగా అర్జునుడి జీవన ప్రయోజనం ధర్మాన్ని నిలపడం. కానీ, వ్యామోహాత్ముడైన అర్జునుడు, వ్యవస్థ ప్రయోజనాన్ని పణంగా పెట్ట్టి ప్రయోజన భంగకరమైన ఆలోచనలను చేస్తూ ైక్లెబ్యత్వాన్ని ఆశ్రయించాడు. మనసును, శరీరాన్ని ఏకోన్ముఖం చేసి పరిశ్రమించాల్సిన సమయంలో చాపల్యంతో నిర్దేశిత కర్మను చేయననడాన్ని మలినమైన భావనలకు ప్రతీకలుగా చెప్పుకోవాలి.
శరీరం, మనసు, ఉపకరణం, ప్రక్రియ, అదృష్టం..
ఈ అయిదు వ్యక్తి చేసే కర్మల ఫలితాలకు కారణాలు అవుతాయి. మనమంతా ‘నేను చేస్తున్నాను’ అనే భావనతో, కర్మఫలితాలకు బాధ్యులం అవుతున్నాం. భౌతిక జీవితంలో గృహస్థుగా భార్యాపిల్లల పోషణ, కార్యాలయాలలో అప్పగించిన బాధ్యతలు శ్రద్ధగా నిర్వహించడం శాస్త్ర విహిత కర్మలు. సమాజం వ్యక్తికి జీవనాధారమై నిలుస్తుంది. కాబట్టి సామాజిక బాధ్యతను నిర్వహించడం కర్తవ్యం. అందుకే చేయవలసిన కర్మలను బంధాలుగా భావించడం తప్పవుతుంది.
ఇతరుల శ్రమపై ఆధారపడి బతుకుతూ, తాము ఆధ్యాత్మిక జీవన సాధనకై, భౌతిక జీవితాన్ని సన్యసించామని చెప్పుకొంటూ కర్మలను ఆచరించక సోమరిగా బతుకులీడ్చే కర్మసన్యాసులకు భౌతిక జీవితమూ, ఆధ్యాత్మిక జీవితమూ రెండూ ఫలించవు. ‘నేను చేస్తున్నాను’ అనే భావన అహంకారంగా పరిణామం చెంది, మనలోని అభిప్రాయాలకు, ఇష్టాయిష్టాలకు ప్రతినిధిగా, జీవితం ఇలా ఉండాలని నిర్వచిస్తుంది. మలినమైన అభిప్రాయాల బంధనాలలో చిక్కుకున్న వ్యక్తిలోని సామర్థ్యం తగ్గిపోతుంది. అలాంటి బంధనాలు పిరికితనాన్ని ప్రసాదిస్తాయి. ధైర్యం జీవితాన్ని రసమయం చేస్తుంది. ధైర్యంలేని వ్యక్తి సత్యాన్ని ఆదరించలేడు. విజ్ఞతతో ఆలోచించే వ్యక్తి పరిమితులను దాటి దర్శించగలడు.
‘నేను కార్య నిర్వహణలో ఉపకారణాన్ని’ మాత్రమే అనే భావనతో నిర్దేశిత కర్మలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో, ఫలితాపేక్ష లేకుండా ఆచరిస్తే అది బంధనాల నుంచి నెమ్మదిగా విముక్తులను చేస్తుంది. శరీరం, మనసు, ఆత్మల సమ్మేళనమే జీవితం. శరీరానికి భయం, ఆకలి, భోగాలపై ఆసక్తి ఉంటుంది. మృత్యుభయం వల్ల ఆకలి కలుగుతుంది. ఆకలిని శాంతింపజేసుకునే ప్రయత్నంలో శరీరం భోగాలను కోరుకుంటుంది. కామాదులకు భోగేచ్ఛ కారణమవుతుంది. మనసుకు నిర్దిష్టమైన పనులు లేకపోయినా గుర్తింపును కోరుకోవడం సహా అనేకమైన కోరికలు ఉంటాయి. దాని కోసం కర్మలను ఆచరిస్తుంది. ఫలితంగా భయాదులు కలుగుతాయి.
కర్మాచరణ వల్ల కర్మ ఫలితాలు కలిగి, వాటి అనుభవం కోసం వెంపర్లాట మొదలవుతుంది. అలాగని కర్మలను ఆచరించకుండా ఉండటం వల్ల దేహయాత్రకు విఘాతం కలుగుతుంది. ప్రకృతిపరంగా జరిగే శ్వాస తీసుకోవడం లాంటి కర్మాచరణలైనా జీవితం ఉన్నంత వరకూ తప్పవు. ఇంద్రియాలను నిగ్రహించుకున్నా, మనసు ఊహించుకోవడం ఆపదు. ఊహాపోహలు బంధనాలకు కారణాలు అవుతాయి. ఆత్మకు ఇవేవీపట్టవు. సాక్షీభూతంగా చూస్తూ ఉంటుంది. అందువల్ల, శరీర ధర్మం నడవాలి అంటే కర్తవ్యాన్ని పాలించాలి. ఫలితాన్ని పరమాత్మకు అప్పగించాలి.
…? పాలకుర్తి రామమూర్తి