శ్రీ శుక ఉవాచ… పరీక్షిన్మహారాజా! నారాయణుని కుమారుడు మారుడు- మన్మథుడు, పూర్వం కామారి- ముక్కంటి కంటి మంటల్లో కాలి మసిగా మారిన తరువాత మాపిన- మంటగలిపిన తన రూపు(దేహం) మరల తనకు ప్రసాదించమని అసమ (విషమ) నేత్రుని, దిసమొల దేవుని- శంకరుని పలుమారులు
ప్రార్థించాడు. ఆయన కృపతో ద్వాపర అంతంలో రుక్మిణీ కృష్ణులకు అసుర మర్దనుడైన విష్ణుమూర్తి మారట- అపర అవతారమో అన్నట్లు ‘ప్రద్యుమ్నుడు’ (అపరిమిత ధన, బల, వైభవ సంపన్నుడు) అను పేరిట ప్రభవించాడు. ఇతడు చతురాత్ముడైన చతుర్భుజుని- విష్ణుని ‘చతుర్వ్యూహం’లో ఒక అంశం.
అంతఃకరణ చతుష్టయంలోని ‘బుద్ధి’కి అధిష్ఠాన దైవం.
జాంబవతీ సత్యభామల వివాహ ప్రస్థానానికై వైయాసకి శుకయోగి స్యమంతక ఉపాఖ్యాన కథనం ప్రారంభించాడు. ద్వారకావాసియైన యాదవ ప్రముఖుడు సత్రాజిత్తు ఆదిత్యుని- సూర్యుని భక్తితో ఆరాధించి ఆయన నుంచి స్యమంతకం అనే మణిని సంపాదించాడు. మహామహిమ గల ఆ మణిని కంఠంలో ధరించి అతడు మహిలో- భూమిపై ద్వితీయ ద్యుమణి- రెండవ సూర్యుని వలె వెలిగిపోతూ ద్వారకా నగరానికి విచ్చేశాడు. నగరవాసులు ఆ మణి ప్రభలకు- కాంతులకు కన్నులు మిరుమిట్లు గొనగా మిన్ను మానికం- విన్ను వెలుంగు (సూర్యుడు) అని భ్రాంతి పడి వెన్నుని- కృష్ణుని వద్దకు వచ్చి ఇలా విన్నవించారు.
కం॥ ‘నారాయణ! దామోదర!
నీరజదళ నేత్ర! చక్రి! నిఖిలేశ! గదా
ధారణ! గోవింద! నమ
స్కారము యదుపుత్ర! నిత్య కల్యాణ నిధీ!
‘నారాయణా! దామోదరా! పద్మదళాక్షా! చక్రపాణీ! సర్వేశ్వరా! గదాధరా! గోవిందా! నందనందనా! నిత్యకల్యాణ ఆనంద నిధీ! నీకు వందన చందనాలు. దేవదేవా! యదువీరా! దిక్కుల నిండా కాంతులు వెదజల్లుచూ తోయజ బంధుడో- సూర్యుడో, నీరజ గర్భుడో- బ్రహ్మదేవుడో నిన్ను చేర వస్తున్నాడు’. ఆ సమయంలో రోచిష్ణుడు- ప్రకాశ శీలుడు కృష్ణుడు పాచికలాడుతున్నాడట! పౌరుల మాటలు విని వారి అమాయకత్వానికి నవ్వుతూ ఆమ్నాయ (వేద) స్వరూపుడు శౌరి, ‘అయ్యా! మీరు పొరబడుతున్నారు. ఆ మణిధారి సత్రాజిత్తేనని, చిత్రభానువు- సూర్యుడు కాడు’ అని వారికి చెప్పి పంపించివేశాడు.
అనంతరం సత్రాజిత్తు ఓజో (కాంతి, శక్తి)వంతమైన ఆ స్యమంతక మణిని తన పూజా మందిరంలో ఉంచి అర్చించసాగాడు. ఆ మణి రోజూ ఎనిమిది భారాల- బారువుల (‘భారస్స్యాత్ వింశతిః తులాః’- ఇరవై తులాలు ఒక భారం) అనగా నూట అరవై తులాల బంగారాన్ని ప్రసాదిస్తుంది. అంతేకాక..
కం॥ ‘ఏ రా జేలెడు వసుమతి
నా రత్నము పూజ్యమానమగు నక్కడ రో
గారిష్ట సర్వమాయిక
మారీ దుర్భిక్షభయము మాను నరేంద్రా!’
‘రాజా! ఏ ప్రభువు పాలించే దేశంలో ఆ రత్నం పూజ్యమానమై- పూజింపబడుతూ రాజిల్లుతుందో, ఆ రాజ్యంలో కరువు కాటకాలూ, ఆధి వ్యాధులూ, అకాల మరణాల వంటి ఏ అశుభాలూ, అరిష్టాలూ ఉండవు’.
ఒక రోజున అకలంకుడు, బకవైరి కృష్ణుడు సకల జన కల్యాణార్థం ఆ స్యమంతక మణిని మహారాజైన ఉగ్రసేనునికి ఇమ్మని సత్రాజిత్తుని అడిగాడు. ‘నల్లనయ్యకు ఇయ్యక పోతే ఏమౌతుందిలే’ అనుకొని స్వార్థపరుడైన ఆ అయ్య సత్రాజిత్తు నిరాకరించాడు. ‘వస్తువు సర్వారిష్ట నివారకమై ఎంత అఖర్వమైన- గొప్పదైనా, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’- (ఆది దేవా! ఈ వస్తువు నీదే, మోదంతో నీకే అర్పిస్తా!) అంటూ దానిని సర్వేశ్వరునికి, గోవిందునికి సమర్పించక ఎవడైనా ముందుగా భోగిస్తే- పొందుతే అది అనిష్ట- దుఃఖహేతువే అవుతుంది’ అని ఆర్యుల అనుభవ వచనం. స్యమంతక మణి కూడా హృదంతరం- మనసులో నిరంతరం ‘శం’- సుఖశాంతులను ‘అంతకం’- అంతమొందించి, అనేకులకు- చివరికి సత్రాజిత్తుకు కూడా ప్రాణాంతకమై వంత- సంతాపం మాత్రమే మిగిల్చేదిగా అయింది.
శుకుడు- రాజా! అనంతరం సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఎంతో వేడుకగా స్యమంతకాన్ని కంఠాన ధరించి వేటాడే తమకం (మోహం)తో అడవికి వెళ్లగా, అక్కడ ఒక హరి- సింహం వానిని సంహరించి ఆ మణిని హరించుకు పోతూండగా భల్లూకరాజు జాంబవంతుడు దానిని అంతమొందించి ఆ మణిని తాను సొంతం చేసుకున్నాడు. దానిని, కొండగుహలో ఉన్న తన ప్రియ నందనునికి ఆనందంగా కేళీ కందుకం- ఆటబంతిగా అమర్చాడు. అంత, వేటకై వెడలిన తమ్ముడు ప్రసేనుడు ఎంతకూ తిరిగి రానందున సత్రాజిత్తు ఎంతో చింతిల్లి, స్యమంతకం కోసం కంసాంతకుడే (కృష్ణుడే) కసి కొద్దీ ప్రసేనుణ్ని అంతం చేసి ఉంటాడనీ, హరికి ఇసుమంత- కొంచెం కూడా మరియాద- న్యాయం, ధర్మం లేదని చాటు-మాటుగా దూషింపసాగాడు. ఆ నిందా వాక్యాలు విన్న అరవిందాక్షుడు ‘ఆ నీలాపనిందను ఏ చందాన తొలగించుకోవాలి’ అని ఆలోచించి, కొందరు అనుచరులతో కూడి అరణ్యంలో అన్వేషిస్తూ, లభించిన ఆనవాళ్లను అనుసరించి ఎలుగుబంటి వెళ్లిన గుహను చూచాడు. వెంట వచ్చిన వారిని గుహ ద్వారం వద్దనే ఉంచి, తాను ఒంటరిగా లోనికి ప్రవేశించి చూడగా స్యమంతకం కంట పడ్డది. యదు వల్లభుడు మెల్లమెల్లగా శిశువు వద్దకు వచ్చి మణిని అంటుకొనబోగా, దాది చూసి గుండెలు జల్లుమనగా పెద్దపెట్టున కేక పెట్టింది. ఆ కేక విని భల్లూకరాజు జాంబవంతుడు వచ్చి మేఘశ్యాముని కని, తన ఆరాధ్య దైవమైన ఇనకులావతంసుడు (సూర్య వంశ శిరోభూషణుడు) రాముడే యని కనుగొనలేక అని- కయ్యానికి తలపడ్డాడు. ఈ శార్దూల వృత్తంలో క్లిష్టమైన ప్రాసాక్షరాన్ని (ష్ట) స్వీకరించి అమాత్యుడు పోతన పద్యాన్ని స్పష్టమైన అర్థపుష్టితో ఆలంకారిక శైలిలో ఎంత విశిష్టంగా వెలయించాడో అవలోకించండి..
శా॥ ‘సృష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ భల్లూక లోకేశుడున్
ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచో
బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుడై
పిష్టాంగోరు శరీరుడై యతడు దా భీతాత్ముడై యిట్లనున్’
కృష్ణ జాంబవతులిరువురూ విజయాభిలాషులై ఇరవై ఎనిమిది అహోరాత్రాలు మహా భీకరంగా బాహాబాహీ- ముష్టాముష్టిగా, బలే జోరుగా పోరు సలిపారు. జిష్ణువు- జయశీలియైన కృష్ణుని పిడుగుల వంటి పిడికిలి పోట్లకు జాంబవంతుని ఒడలు- దేహం బడలి సడలి- నశించి పోయింది. అడలి- భయపడి భల్లూకరాజు, తనకు పూర్వం ఇచ్చిన మాటను మన్నిస్తూ కడలి శయనుడే- కామపూరుడైన (కోర్కెలు తీర్చు) రామ నారాయణుడే తన యెడల కరుణ చూపి దర్శనమిచ్చాడని ఇలా స్తుతించాడు..
సీ॥ ‘బాణాగ్ని నెవ్వడు పఱపి పయోరాశి
నింకించి బంధించి యేపు సూపె
బరగనెవ్వడు ప్రతాప ప్రభారాశిచే
దానవ గర్వాంధ తమస మడచె
గంజాతములు ద్రెంచు కరిభంగి
నెవ్వడు దశకంఠు కంఠ బృందములు ద్రుంచె
నా చంద్రసూర్యమై యమరు లంకారాజ్య
మునకు నెవ్వడు విభీషణుని నిలిపె’
తే॥ ‘నన్ను నేలిన లోకాధినాథుడెవ్వ
డంచితో దారకరుణా రసాబ్ధి యెవ్వ
డా తడవు నీవ కావె, మహాత్మ! నేడు
మాఱుపడి యెగ్గు సేసితి మఱవవలయు’
‘దేవాధిదేవా! నీవు పురాణ పురుషుడవు మహావిష్ణువని తెలుసుకొన్నాను. శరా (బాణా)గ్నిచే సాగరాన్ని ఇంకించి సేతువు కట్టిన వాడవు. పౌరుష ప్రతాపాలనే ప్రభారాశిచే రాక్షసుల గర్వమనే కారుచీకట్లు పోకార్చి- అణచి వేసి వాసికెక్కిన వాడవు. అరవిందా- కమలాలను తెంచే కరి- ఏనుగులాగా రావణారి తలలు త్రుంచిన ఖల విదారి- దుష్టసంహారివి. విభీషణుని ఆచంద్రార్కం లంకారాజ్యానికి రాజుగా చేసిన నిష్కలంకుడవు. కరుణా వరుణాలయు- సముద్రుడవు. నన్నేలిన ఇనకులోత్తముడవు, లోకనాథుడవు నీవే కదా! మహాపురుషా! నీ చరణారవిందాలకు వందనాలు. పొరబడి నిన్నెదిరించి అపచారం చేశాను. మది నెన్నక- మనసులో తలపక నన్ను మన్నించు ప్రభూ!’
శుకుడు- రాజా! ఆపన్నుడైన- ఆపద పొందిన జాంబవంతుడు ఈ తెన్ను-విధంగా విన్నవించుకోగా ప్రపన్నార్తి హరుడు కృష్ణుడు తన చేతితో అతని మేను నిమిరి, అని- పోరు వలన కలిగిన బారి- వెత (శ్రమ)ను తొలగించి గంభీరమైన కంఠస్వరంతో… ‘జాంబవంతా! ఈ స్యమంతక మణి అపహరింతకు నేను పాలుపడ్డానని అజ్ఞానులు నాపై వేసిన అపనిందను, ఓ భల్లూక నృపా! తొలగించుకోవడానికే నీ మందిరమైన ఈ బిలానికి వచ్చాను’ అని ఇందిరావరుడు పలుకగా పరమానందం పొంది జాంబవంతుడు స్యమంతకంతోపాటు తన కుమార్తె జాంబవతి అనే కన్యకామణిని కూడా లక్ష్మీరమణునికి కానుకగా సమర్పించాడు. ఆమెను స్వీకరించిన పరమాత్మ అతనికి ముక్తిని ప్రసాదించాడు. భగవంతునికి భీష్మక కన్య రుక్మిణి ఎంతో.. కామిని యైన భల్లూక భామని కూడా అంతే! హరితో వచ్చి దరీ- బిల (గుహ) ద్వారం వద్ద నిలిచిన వారందరూ పన్నెండు రోజులు శౌరికై నిరీక్షించి వేసారి విలవిలలాడుతూ ద్వారకకు తిరిగి వెళ్లారు. దేవకీ వసుదేవులు, రుక్మిణి మొదలైన అంతఃపురవాసులు ద్వారక ప్రజలు శోక సముద్రంలో మునిగిపోయారు. హరి క్షేమంగా తిరిగి రావాలని చంద్రభాగను- దుర్గాదేవిని ప్రార్థించారు…
కం॥ ‘డోలాయిత మానసులై
జాలింబడి జనులు గొలువ జండిక పలికెన్
బాలామణితో మణితో
హేలాగతి వచ్చు నంబుజేక్షణు డనుచున్’
ద్వారక భక్త జనావళి డోలాయమాన మానసులై- ఆందోళన చెందుతూ జాలిగా ప్రార్థించగా, కాలాత్మకుడు హరి మణితోను బాలామణి తోను హేలాగతి- అనాయాసంగా తిరిగి రాగలడని దుర్గాదేవి పలికింది. నారాయణి దుర్గమ్మ తల్లి ఆశీర్వదించినట్లు గానే హరి మణిద్వయంతో రయమున ద్వారవతీ పురి చేరాడు. అంబికామాత అనుగ్రహంతో జాంబవతీ సమేతుడై వేంచేసిన జగన్నాథుని శ్రీహరిని కని, మృతుడైనవాడు పునరాగతుడై- తిరిగి వచ్చినట్లుగా భావించి ద్వారకాపురవాసులు నిండైన ఆనందోత్సాహాలతో మెండుగా పండుగ చేసుకున్నారు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006