ఒక వ్యక్తి జిల్లెళ్లమూడి అమ్మను చూడాలనుకుని, ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని బాపట్ల చేరుకున్నాడు. అతని ఆలోచనల్లో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. హోటల్లో మంచి టిఫిన్ చేసి, అమ్మను చూసి, తిరుగు ప్రయాణానికి ముందు సినిమా చూసి, ఆ రాత్రికి ఇల్లు చేరాలని అనుకున్నాడు. టిఫిన్ చేయటం, బస్సు ఎక్కడం వరకు అనుకున్నట్లే జరిగింది. బస్సులో చూసుకుంటే జేబులో డబ్బు గల్లంతు! కేవలం జిల్లెళ్లమూడి చేరడానికి కావలసినంత పైకం మాత్రం మిగిలింది. ఆశ్రమం చేరుకున్న కొన్ని నిమిషాలలో ఆయన్ను అమ్మ లోపలికి పిలిపించింది. అతణ్ని చూస్తూనే, ‘పోనీలే నాన్నా! ప్రస్తుతం నీ దగ్గర ఎంత ఉందో అంతే పోయింది. తరతరాలు హాయిగా బతకగలిగేంత డబ్బు నీకున్నది. తీసుకున్న వాడికి రోజు గడవటం దుర్భరంగా ఉంది. ముందు ఇక్కడ భోజనం చెయ్. సినిమాదేముంది? ఇంకోసారి చూడొచ్చు. హాయిగా ఇంటికి వెళ్లు’ అనడంతోనే ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ‘అనుకున్నది జరగదు, నీకున్నది తప్పదు’ అన్న అమ్మ మాటలో ఎంత భావం ఇమిడి ఉందో తెలుస్తుంది.
సాధనలో ఉన్నవాళ్లకు దూరదర్శనం, దూరశ్రవణం వంటి చిన్న సిద్ధులు అసాధ్యం కాదు. సిద్ధులన్నిటికీ ముందే శుద్ధత్వం ఉండాలి. సిద్ధులు విదేశీయాలు. వాటిని పట్టించుకోవటం సాధకుడికి ఏమాత్రం మంచిది కాదు. మన ప్రమేయం లేకుండానే ఎన్నో జరుగుతుంటాయి! సాక్షిగా ఉండాలి. సాధనా క్రమంలో ఎన్నో సిద్ధులు ఏర్పడుతుంటాయి. అక్కడే ఆగిపోతే, గమ్యం చేరటం అసాధ్యం. కనుక సాధనలో తీవ్రత, ఏకాగ్రత, లక్ష్యసాధన ఉండాలి! ఏ సిద్ధినైనా ప్రదర్శన కోసం కాక, భగవచ్ఛక్తికి నిదర్శనంగా భావించాలి. వ్యక్తి మనసు విశ్వమనసుతో అనుసంధానమైనపుడు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా వ్యక్తికి అనుభవమవుతుంది.
శీతల పవనాలు శరీరాన్ని తాకినపుడు కలిగే నిమేషమాత్ర స్పర్శానుభవం సిద్ధి. జగత్ కల్యాణానికి, సర్వలోక సంక్షేమానికి వినియోగపడితేనే సిద్ధులకు విలువ. అది లోకానికి అవసరం. అన్నిటినీ మించి కర్తను ఆశ్రయించి శక్తి, శక్తిని అనుసరించి ఆలోచన, ఆలోచనను ఆవరించి వాక్కు, వాక్కును ఆచరణీయం చేస్తూ కర్మ, ఇవన్నీ కలిసి క్రియ ఏర్పడుతున్నపుడు, ఈ జగత్ ప్రణాళిక ముందెన్నడో నిర్దేశించి ఉన్నదన్న సత్యం అవగతమవుతుంది.
కర్తే నిర్ణాయకుడు. పాంచభౌతిక దేహాన్ని ధరించి, అవతారిగా కర్త వచ్చినా, అతడు సైతం కాలాధీనుడే. ప్రకృతి నిబంధనలకు లోబడే అతని సంచారం సాగుతుంది. కాల దేశాతీతమైన అమ్మ ఈ నియమాన్ని నిష్టం చేసింది. సర్వజ్ఞ అయినా సాధారణ స్త్రీ వలె, సిద్ధమూర్తి అయినా శుద్ధ మాతృమూర్తి వలె, రసాతీత అయినా కరుణ వలె, వాత్సల్యమే మూర్తిమంతమైన అమ్మ వలె సంచరించింది. ధరించటం కంటే భరించటమే మిన్న అన్న అమ్మ, అవధరించి తరించటానికి మానవతే మార్గమని బోధించింది. అమ్మ సర్వజ్ఞ! అమ్మ పూర్ణజ్ఞ!
విలువైనవన్నీ మనకు అవసరం కాదు. అవేమీ అక్కరకు రావు. మనిషి ఆకలికి అన్నం అవసరం, బాధితుడికి ఆనందం అవసరం, ఆర్తుడికి ఆపన్నహస్తం అవసరం, ఆ క్షణంలో అవసరమే విలువైనది. ఒక సందర్భంలో బిచ్చగత్తె ఒకామె వస్తే, ఎవరో ఏదో ఇచ్చి ఆమెను పంపించినపుడు, ఏమిచ్చి పంపావని అమ్మ అడిగితే, ఇచ్చినావిడ అణా ఇచ్చి పంపాన్నది. వెంటనే అమ్మ ‘అణా అన్నమవుతుందా? అన్నం పెట్టి పంపవలసింది’ అన్నది, కంఠాన కరుణాస్వనం చిప్పిల్లుతుండగా! ఆ సందర్భంలో అన్నమే అవసరం. అదే విలువైనది. అణాకు ఆ క్షణంలో విలువ శూన్యం.