తిరుమల : ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు (Local Devotees) కల్పించే దర్శనంలో భాగంగా టీటీడీ(TTD) ఈనెల 2న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనుంది.ఈ మేరకు తిరుపతి(Tirupati) స్థానికులకు మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల (Tirumala) స్థానికులకు బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఉదయం 5 గంటల నుంచి శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలకు చెందిన స్థానిక భక్తులు ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని సూచించారు.
సర్వదర్శనానికి 8 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 52,731 మంది భక్తులు దర్శించుకోగా 17,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి రూ. 3.24 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.