అన్నింటికంటే అత్యుత్తమ సంపాదన ఏదీ? అని ముహమ్మద్ (సఅసం)ను కొందరు సహచర మిత్రులు అడిగారు. ‘తన స్వహస్తాలతో సంపాదించిన దానికంటే ఉత్తమమైన సంపాదన మరొకటి లేదు’ అని చెప్పారు. ప్రవక్త చెప్పిన ఈ మాట శ్రమ శక్తి ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. పనీపాటా లేకుండా తిరగడం ఇస్లాం స్ఫూర్తికి విరుద్ధమైన విషయం. చాలామంది పని చేయకుండా, చేతులకు మట్టి అంటకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. సంపాదన కోసం దగ్గరి మార్గాలు వెతుక్కుంటారు. ప్రాపంచికంగా వారు తమ అవసరాలు తీర్చుకుంటారేమో కాని, ధార్మికంగా వాళ్లు విజయం సాధించలేరు. చాలా సంవత్సరాల క్రితం శ్రమ గొప్పతనాన్ని ముహమ్మద్ ప్రవక్త చాటి చెప్పారు. ఒకసారి ఒక సహచరుడు కట్టెలు కొట్టి కొట్టి చేతులు బొబ్బలెక్కాయి. ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అతని చేతులను తన రెండు చేతులతో పట్టుకొని ముద్దాడారు.
ఇలాంటి కష్టజీవులంటే అల్లాహ్కు ఎంతో ఇష్టమని చెప్పారు. పని చిన్నదైనా, పెద్దదైనా పని పనే అవుతుంది. చేసే పనిని శ్రద్ధగా చేయాలి. స్వహస్తాలతో పనిచేసి సంపాదించడం పట్ల సిగ్గుపడాల్సిన పనేం లేదు. ఖాళీగా కాలక్షేపం చేయడం కంటే ఎప్పుడూ ఏదో ఒక పనిలో లీనమవడం ఉత్తమం. ‘ఖాళీ మెదడు దెయ్యాల కొంప’ అనే సామెత ఉండనే ఉన్నది. ఏ పనీ లేనివారే పాపాలకు, నేరాలకు ఒడిగడుతుంటారు. పనుల్లో చిన్న పనులు, గొప్ప పనులనేమీ ఉండవు. ఎవరు చేసే పని వారికి గొప్ప. ప్రతీ ఒక్కరూ పనిచేసి సంపాదించి ఉపాధిని పొందడమే ఆత్మగౌరవం. అక్రమ మార్గాల ద్వారా ఆర్జించడం ధర్మ నిషేధం. అక్రమ మార్గాల ద్వారా పొట్టపోసుకున్న శరీరం నరకాగ్నిలో కాలిపోతుందని ప్రవక్త హెచ్చరిక.