ఇస్లామియా చరిత్రలో, ఖురాన్ గ్రంథంలో షబే మేరాజ్ అత్యంత పవిత్ర దినంగా కనిపిస్తుంది. రజబ్ నెల 27వ తేదీన జరిగిన ఓ అద్భుతమైన సంఘటన షబే మేరాజ్గా నిలిచిపోయింది. షబే అంటే రాత్రి, మేరాజ్ అంటే నిచ్చెన. ఇదే రోజు ముహమ్మద్ ప్రవక్త (స) సప్త ఆకాశాలకు వెళ్లి.. అల్లాహ్తో స్వయంగా మాట్లాడారు. అద్వితీయమైన ఈ రాత్రి ఘడియల్లోనే ఆయన స్వర్గ సౌఖ్యాలను తిలకించారు. నరక శిక్షలనూ చూశారు. అంతేకాదు, ముస్లిం సమాజానికి నమాజ్ కానుకగా లభించిన రోజు కూడా ఇదే! అందుకే ఈ పర్వదినాన్ని ముస్లింలు ‘షబే మేరాజ్’గా ఘనంగా జరుపుకొంటారు. ఆనాడు రాత్రి జిబ్రయీల్ దూత ద్వారా ప్రత్యేక వాహనంపై ప్రవక్త (స)ను సప్త ఆకాశాలకు పిలిపించుకున్నాడు.
ఈ యాత్రను ఇస్రా మేరాజ్గా ఖురాన్ పేర్కొన్నది. ఖురాన్ గ్రంథంలోని 17వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే ఆ అద్భుత ప్రయాణం గురించి బోధపడుతుంది. ఈ పర్యటనలో ప్రవక్త (స)కు ఒక్కో ఆకాశంలో ఒక్కో దైవ ప్రవక్త స్వాగతం పలికాడు. చివరికి సిదరతుల్ మున్ తహా అనే రేగుచెట్టు దగ్గరికి ప్రవక్తను తీసుకెళ్లారు జిబ్రయీల్ దూత. ఇక్కడ మహాప్రవక్త ఎన్నో అగోచర యథార్థాల్ని వీక్షించారు. కాసేపటికి అటునుంచి ‘అస్సలాము అలైకుం; ముహమ్మద్! నేనే విశ్వప్రభువును’ అనే గంభీరమైన వాణి విన్పించింది. ఇక్కడే అల్లాహ్తో సంభాషించారు. స్వర్గనరకాలు, మరెన్నో అద్భుతాలను చూసిన ప్రవక్త (స) తన సందేశాల ద్వారా ఇస్లాం సమాజానికి వాటి విశేషాలను తెలియజేశారు. స్వర్గ ప్రవేశానికి అర్హత ఎలా సాధించాలో బోధించారు. నరక బాధలు తప్పాలంటే ఎలా నడుచుకోవాలో సూచించారు.