ఒకసారి ప్రవక్త (సఅసం) తన సహచరులకు ఒక గాథను ఇలా చెప్పారు. బనీ ఇస్రాయిల్ జాతిలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలిసేందుకు బయలుదేరాడు. దారిలో ఒక దైవదూత అతనితో ‘నువ్వెక్కడికి వెళ్తున్నావు’ అని అడిగాడు. ‘నా స్నేహితుణ్ని కలిసేందుకు వెళ్తున్నాను’ అని చెప్పాడు. ‘అతని ఇంటి దగ్గర నీకేమైనా పని ఉందా?’ అని ప్రశ్నించాడు దైవదూత. ‘ఏమీ లేదు! కేవలం నా మిత్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి వెళ్తున్నా’ అన్నాడు ఆ వ్యక్తి.
అప్పుడు దైవదూత ‘నేను అల్లాహ్ దూతను, నీకు శుభవార్త అందజేయడానికి వచ్చాను. నీవు కేవలం అల్లాహ్ కోసం ఆ వ్యక్తిని ప్రేమించావు. కాబట్టి ఆయన నిన్ను తన సన్నిహితుల్లో చేర్చుకున్నాడు’ అని పలికాడు. ఈ గాథ ప్రవక్త ప్రవచనాల ప్రామాణిక గ్రంథమైన బుఖారీ లోనిది. ఎలాంటి కల్మషం లేకుండా, నిస్వార్థంగా స్నేహం చేసేవారిని అల్లాహ్ ఎంతో ప్రేమిస్తాడని ఈ కథ తెలియజేస్తున్నది. ‘అనారోగ్యం పాలైన స్నేహితుణ్ని పరామర్శించడానికి వెళ్లేవారిని ‘నీకు శుభం కలుగుగాక! నీవు స్వర్గంలో ఒక ఇల్లు నిర్మించుకున్నావు’ అని దైవదూత ఎలుగెత్తి చాటుతాడు’ అని ప్రవక్త పేర్కొన్నారు.
…? ముహమ్మద్ ముజాహిద్