ఒక పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతున్నది. వచ్చిన వారంతా యాభై ఏండ్లు పైబడిన వాళ్లే! పదవులు, హోదాలూ మరచి అందరూ ఆనందంగా ఆడిపాడారు. గత స్మృతులను నెమరవేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. అయితే వచ్చిన వారిలో ఓ వ్యక్తి ముభావంగా, నిరుత్సాహంగా ఉండటం గమనించాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. సాయంత్రం కావడంతో ఒక్కొక్కరూ వీడ్కోలు చెప్పుకొని బయల్దేరసాగారు. ముభావంగా ఉన్న వ్యక్తిని పిలిచి ‘మీరు అలా నిరుత్సాహంగా ఉన్నారెందుకు?’ అని ప్రశ్నించాడు ప్రధానోపాధ్యాయుడు. అతను బాధగా ముఖం పెట్టి ‘నేను దేవుణ్ని బాగా నమ్మాను. కానీ, దేవుడి చల్లని చూపులు నా మీద లేవు. ఏ కష్టంలోనూ ఆయన నన్ను ఆదుకోలేదు?’ అని వాపోయాడు. ‘మీరేం పని చేస్తుంటారు?’ అని అడిగాడు ప్రధానోపాధ్యాయుడు. ‘ఫుట్బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తుంటాను’ అన్నాడు. ‘మీ దగ్గర శిక్షణ తీసుకున్న ఆటగాడు మైదానంలో సరిగ్గా ఆడకపోతే… అతని స్థానంలోకి మీరు వెళ్లి ఆడి, జట్టును గెలిపించిన సందర్భం ఏదైనా ఉందా?’ అని ప్రధానోపాధ్యాయుడు అడిగాడు.
‘అదెలా సాధ్యం. శిక్షణ ఇచ్చేంత వరకే నా బాధ్యత. ఆడి గెలవాల్సిన పని పూర్తిగా క్రీడాకారుడిదే. ఆడేటప్పుడు సమస్యలు ఎదురైతే జాగ్రత్తలు వహించి ప్రత్యర్థులను మట్టి కరిపించే పని కూడా అతను చేయాల్సిందే!’ అన్నాడు శిక్షకుడు. చిన్నగా నవ్విన ప్రధానోపాధ్యాయుడు ‘ఇన్ని తెలిసిన నువ్వు దేవుణ్ని నిందించడం న్యాయమా? అపూర్వమైన మానవ జన్మ ఇచ్చిన భగవంతుడు మనం పోటీకి నిలబడి గెలవాల్సిన శక్తి సామర్థ్యాలను కూడా ఇచ్చి ఉన్నాడని గుర్తించు. ప్రతి సందర్భంలోనూ మన దగ్గరికి వచ్చి ‘అలా చెయ్, ఇలా చెయ్’ అని దేవుడు మనకి సూచించడు. ఏది మంచి, ఏది చెడ్డ అనే విచక్షణా జ్ఞానం, కష్టాలు వచ్చినప్పుడు ఎదురొడ్డే నైపుణ్యం కూడా మనలోనే ఉన్నాయని గుర్తించి వ్యవహరించు. కష్టాలన్నీ కాలగర్భంలో మంచుగడ్డల్లా కరిగిపోతాయి’ అని సలహా ఇచ్చాడు ప్రధానోపాధ్యాయుడు. ‘నిజమే.. సమస్యల్ని భూతద్దంలో చూసి ఏదేదో ఆలోచించి నన్ను నేను ఓడించుకుంటూ ఉన్నాను’ అని గుర్తించి అక్కడినుంచి వీడ్కోలు తీసుకున్నాడు ఆ శిక్షకుడు.