Srisailam | శ్రీశైలం, మార్చి28: ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల యాత్రికులతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కాలినడకన అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటుండటంతో క్షేత్ర పురవీధులు కిటకిటలాడుతున్నాయి. కాగా, ఉగాది ఉత్సవాల్లో భాగంగా లింగ దర్శనం ఉండదని కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని శ్రీశైల ఆలయ ఈవో తెలిపారు.దేవస్థానం అనుమతులతో పలు స్వచ్ఛంద సేవా సంఘాల ఆధ్వర్యంలో కాలినడక భక్తులకు మార్గమధ్యలో అన్నప్రసాదాలు, మంచినీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సుమారు ఆరు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ జిల్లా రెవెన్యూ, దేవస్థాన అధికారులు అప్రమత్తమవుతున్నారు. అటవీ ప్రాంతం నుంచి కాలినడకతో వచ్చే వారికి వైద్య సేవలు అందించుటకు దేవస్థానం ఆసుపత్రిలో పూర్తి ఏర్పాట్లు
చేసినట్లు తెలిపారు.
వసతులు సద్వినియోగపరుచుకోండి
సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చే యాత్రికులకు సౌకర్యవంతంగా ఉండేలా చేసిన చలువ పందిళ్లు, క్యూలైన్లు, లడ్డూప్రసాదాలు, అన్నదాన వితరణ వసతులను పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలని ఈవో కోరారు. అదేవిధంగా కైలాస ద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి ఆలయాలతో పాటు వివిధ ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలు, శివసేవకులతో కూడా సహకరించాలని అన్నారు.