యథైధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేర్జున
జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా॥
(భగవద్గీత 4-37)
‘ఓ అర్జునా! ప్రజ్వరిల్లుతున్న అగ్ని సమిధలను భస్మం చేసినట్లుగా కర్మలనన్నింటినీ జ్ఞానమనే అగ్ని భస్మం చేస్తుంది’ అంటాడు కృష్ణపరమాత్మ. పాప పుణ్యాలు.. రెండూ కర్మల ఫలితాలే! ఉత్తమ కర్మలు ఉత్తమ ఫలితాలనిస్తే, అధమ కర్మలు దుష్ఫలితాలను ఇస్తాయి. అజ్ఞానం వల్ల.. చెడు కర్మలను ఆచరిస్తుంటాం. అజ్ఞానం అంటే.. ఎలాగైతే వెలుగు లేకపోవడం చీకటో.. అలాగే జ్ఞానాన్ని గుర్తించకపోవడమే అజ్ఞానం!
జ్ఞానాన్ని గుర్తించకపోవడానికి కారణం.. జ్ఞానం చుట్టూ అజ్ఞానం ఆవరించడం. సుషుప్తిలో ఉన్న జ్ఞానాన్ని జాగృతం చేసుకోగలిగితే.. అది అజ్ఞానాన్ని దహిస్తుంది. ఫలితం.. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. భౌతిక జీవన బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. అపారమైన సముద్రాన్ని చిన్న నావతో దాటిన విధంగా.. హృదయంలో ‘ఆత్మ’ అనే పరమాత్మ వెలుగు రూపంలో ఉండడం వల్ల, అజ్ఞానమనే సముద్రాన్ని అధిగమించడం సాధ్యపడుతుంది. కర్రలు ఆకృతిలో పెద్దవి.. నిప్పురవ్వ చిన్నది. అయినా ఒకసారి కర్రలకు నిప్పు అంటుకుంటే అది ఆ కర్రలను పూర్తిగా కాల్చివేస్తుంది. మరొక్క విశేషం చెప్పుకోవాలి.. కర్రలో కాలిపోయే గుణం ఉన్నది. భస్మమయ్యే గుణం ఉన్నది. అవి అజ్ఞానానికి ప్రతీకలు. అజ్ఞానాన్ని కాల్చివేసే గుణం.. కర్రలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానమనే అగ్నికి ఉన్నది. దానిని గుర్తించడమే మానవులు చేయవలసింది. నీటితో కర్రలను కాల్చలేము.. కారణం నీటికి కాల్చివేసే గుణం లేదు. అలాగే సాధనలో ‘భగవంతుడు‘ అనే జ్ఞానం జాగృతమైతే.. జ్ఞానాన్ని చుట్టుకున్న ‘నేను నాది’ అనే అజ్ఞానం భస్మమవుతుంది. జ్ఞానంతో సమానమైన పవిత్ర వస్తువు మరొకటి ఈ జగత్తులో కనిపించదు.
సరైన విజ్ఞానం, అవగాహన, దార్శనికత కలిగిన వ్యక్తి పోటీదారులలో ముందుస్థానంలో నిలుస్తాడు. ఫలితమేదైనా ప్రక్రియను ఆశ్రయించిన ప్రయత్నమే ప్రధానమని అతను భావిస్తాడు. మారుతున్న వ్యాపార విధానాలను అవగాహన చేసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టేందుకు అవసరమైన పరివర్తన వ్యక్తిలో జరుగుతుంది. జ్ఞానార్జనలో తననే కాకుండా.. అనుచరులనూ నిరంతర ఆధ్యయనశీలురుగా చేస్తుంది. సృజనాత్మకత, పరిశోధనా దృష్టితో ఆలోచనలను చేయడం, సమస్యలకు కొత్త కోణాలలో పరిష్కారాలను కనుగొనడం సాధ్యపడుతుంది. దానితో సంస్థలో తప్పులు జరగడం తగ్గుతుంది. ప్రమాదాల నిర్వహణ సులువవుతుంది. ప్రతిభాపాటవాలు ఉన్నతి పొంది ఉత్పాదకత పెరుగుతుంది. సంస్థలో నిర్వహణాధికారులు ఫలితాలకు అతుక్కుపోకుండా వారివారి కర్తవ్యాలను చిత్తశుద్ధితో నిర్వహించేందుకు ఏకాగ్రచిత్తులై సన్నద్ధమవుతారు. ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మ విశ్వాసం వల్ల తమ కార్య నిర్వహణలో పరిమితులను, పరిధులను అధిగమించి అందరూ సమష్టిగా పనిచేస్తారు. ఉత్తమమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. విలువలతో కూడిన లక్ష్యాలను అధిగమించేందుకు, సముచిత నిర్ణయాలను తీసుకునేందుకు జ్ఞానాన్ని జాగృతం చేసుకోవడం సహకరిస్తుంది. ఫలితాలపై కాకుండా ప్రక్రియపై దృష్టిని నిలిపితే ఒత్తిడి తగ్గుతుంది. ప్రభావశీలత అధికమవుతుంది. ‘నేనే’ అనే అహంకారాన్ని అధిగమించ గలుగుతారు. గురువును పరీక్షించేందుకు ఒక వ్యక్తి చేతిలో పక్షిని పట్టుకొని వచ్చాడు. గురువుకు నమస్కరించి.. ‘అయ్యా! నా చేతిలో ఉన్న పక్షి జీవించి ఉన్నదా, మరణించిందా’ చెప్పమన్నాడు. గురువు జీవించి ఉన్నది అంటే దానిని చంపేద్దామని, మరణించింది అంటే బతికే ఉందని చూపుదామని భావించాడా వ్యక్తి. ఏ విధంగానైనా గురువును తగ్గించాలనే భావనతో ఉన్నాడా వ్యక్తి.
కానీ, గురువు ‘మిత్రమా! ఆ పక్షి జీవితం నీ చేతిలో ఉన్నద’న్నాడు. నిజమే.. మన భవిష్యత్తు మనచేతిలోనే ఉన్నది. దానిని ప్రయోజనకరంగా తీర్చిదిద్దుకుంటామా, ప్రయోజన రహితంగా ముగిస్తామా అన్నది ఆ వ్యక్తి నిర్ణయం. వర్తమానమే భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. జ్ఞానాన్ని జాగృతం చేసుకుంటామా.. అజ్ఞానాన్ని ఆదరిస్తామా అనేది వ్యక్తి నిర్ణయం.
…? పాలకుర్తి రామమూర్తి