చింతా వ్యాకులతల నిలయం ఈ ప్రపంచం. చింత, ఆవేదన, ఆతృత, ఆందోళనలకు సంస్కృత పర్యాయపదమే ‘కుంఠ’. ఈ సమస్త భౌతిక ప్రపంచాన్ని ఒక ‘కుంఠ’గా అభివర్ణించారు పెద్దలు. ఇక్కడ ప్రతిదీ ఆతృత, ఆవేదనలతో కూడినదే. ఊర్ధ్వ, మధ్య, అధోలోకాలను కలిగిన ఈ భౌతిక ప్రపంచంలో చాలామంది స్వర్గం మొదలైన పై లోకాలకు వెళ్లాలని భావిస్తారు. అయితే, ముల్లోకాలు సైతం ఆతృత, ఆవేదనల రహితమైనవి కావు. స్వర్గలోకానికి వెళ్లినా ఇవి మాత్రం తప్పవు. ఆనందం శాశ్వతంగా ఉండే దివ్య ధామం ఒకటుంది. అక్కడ పతనం, మృత్యువు అనే ప్రశ్నలకు చోటులేదు. అక్కడంతా సత్-చిత్-ఆనందమైనదే! ‘విగత కుంఠయస్మాద్ వైకుంఠ’ అన్నారు. ‘విగత’ అంటే వెళ్లిపోవటం. ఎక్కడ ఆతృత, ఆవేదనలకు చోటులేదో అదే ‘వైకుంఠం’.
ఆధ్యాత్మిక ధామాలైన విష్ణులోకం, శ్రీకృష్ణుడి దివ్యక్షేత్రాలు ఖాళీ ప్రదేశాలు కావు. భగవానుడి నిలయాలు నిశ్శబ్దంగా, క్రియారహితంగా ఉంటాయని కొందరి భావన. అవి ధ్యానమయమైనవి అని మరికొందరి అభిప్రాయం. జ్యోతిమయమైనవని, అక్కడ వ్యక్తులు ఎవరూ ఉండరని ఇంకొందరి కల్పన. కానీ, శ్రీమద్భాగవతం ఆ దివ్యధామాల అనంతమైన వైభవం ఎలా ఉంటుందో వివరించింది. జీవిత సార్థక్యాన్ని పొందిన పరిపూర్ణమైన జీవులు భగవంతుడి లీలా వైభవంలో ప్రత్యక్షంగా పాలుపంచుకునే సన్నిధానమే వైకుంఠం. వైకుంఠంలో ప్రతి అడుగూ నృత్యమయమే, ప్రతి వాక్కూ కీర్తనే! అక్కడ వృద్ధాప్యం దరి చేరదు. వ్యాధులు ఉండవు. జనన, మరణాలు లేవు. అంతా సచ్చిదానంద మయమే. అక్కడి భవనాలన్నీ రత్నవైడూర్య నిర్మితాలు. స్వచ్ఛమైన వాతావరణం. నారాయణుడి ఆశ్రమంలో సదా ఆనందంగా జీవించగలిగే ఆ దివ్యధామమే మనందరి నిజమైన నివాసం కావాలి.
ఒక చేపను నీటి నుంచి తీసి నేలపై వేశారనుకుందాం. అప్పుడా చేప తన సహజమైన నివాసంలో లేనందువల్ల ఇబ్బంది పడుతుంది. దానికి ఎన్ని వసతులు కల్పించినా అది ఆనందించదు. తన సహజమైన నీటిలో నివాసం కోసమే పరితపిస్తుంది. ఈ ఉపమానంలో చేపపిల్లలా, మనందరమూ ఈ భౌతిక ప్రపంచమనే అసహజమైన నివాసంలో కూరుకుపోయాం. చింత, వ్యాకులతతో విసిగిపోతున్నాం. ఎన్ని భోగభాగ్యాలున్నా.. అంతరంలో ఏదో ఒక కొరత ఉండనే ఉంటుంది. మన నిజనివాస స్థానమైన భగవత్ సన్నిధానంలో లేకపోవడమే వెలితికి కారణం. మరి అక్కడికి ఎలా చేరుకోవడం? మన ఇంటికి మనం తిరిగి వెళ్లడమెలా? వైకుంఠనాథుడైన నారాయణుడిని దర్శించడం ఎలా? ఆ మార్గాన్ని శ్రీమద్భాగవతం ఇలా వివరించింది..
సమాశ్రితా యే పదపల్లవప్లవం
మహత్పదం పుణ్యయశో మురారే
భవామ్బుధిర్వత్సపదం పరం పదం
పదంపదం యద్విపదాం న తేషామ్
(శ్రీమద్భాగవతం 10.14.58)
‘పరమ పవిత్రమైన కీర్తి కలిగిన పరమాత్మ పాదాలను ఆశ్రయించినవారికి.. సంసార సముద్రం ఒక గోష్పదం (చిన్న దూడ కాలువంటిది). పరమ పాదం నమ్మిన వారికి పరమపదం పదం, వారికి ఆపదలు ఉండవు’ అని పైశ్లోకం తాత్పర్యం.
ఆ పరంధాముడి పరిపూర్ణ అనుగ్రహం వర్షించే పుణ్యతిథి వైకుంఠ ఏకాదశి. పరమ పవిత్రమైన ఈ తిథికి సంబంధించి అనేక లీలలు ప్రచారంలో ఉన్నాయి. విశుద్ధ భక్తితో జీవిత పర్యంతం తనను సేవించి, ఈ భౌతిక లోకాన్ని వీడి పరమపదమైన వైకుంఠ పదాన్ని చేరిన భక్తుడికి భగవంతుడే స్వయంగా ఎదురు వచ్చి వైకుంఠంలోకి ఆహ్వానించిన తిథి ఇది. ఆ లీలా విశేషాన్ని పురస్కరించుకొని, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారమైన వైకుంఠ ద్వారం నుంచి వెళ్లి భగవంతుణ్ని దర్శించిన వారు సైతం ఈ దేహాన్ని వీడిన తర్వాత వైకుంఠాన్ని చేరగలరని ప్రతీతి.
సర్వవ్యాప్తమైన నారాయణుడు విగ్రహ రూపంలో అర్చామూర్తిగా వెలిసినట్టు, వైకుంఠధామం కూడా ఈ లోకంలో అనేక విధాలుగా పరివ్యాప్తమైంది. ఈ కలియుగంలో పవిత్రమైన కృష్ణనామాన్ని జపించేవారికి వైకుంఠం ఇట్టే సాక్షాత్కరించగలదు. కృష్ణనామం సదా సాగే ప్రతి లోగిలీ వైకుంఠమే! అల వైకుంఠాన్ని ఇలలో అనుభూతి చెందాలంటే ప్రతి రోజూ ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామరామ హరే హరే’ మంత్రాన్ని జపించండి. ఇదే జీవితానికి సార్థకత.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984