జీవుడు కోరికల పుట్ట.. దేవుడు వాటిని తీర్చడంలో దిట్ట.. కానీ, కోరడం కాదు.. వదులుకోవడమే భగవానుడి అనుగ్రహ వీచిక! అందుకు ఆలయమే సరైన వేదిక! దేవాలయ ప్రవేశం అధ్యాత్మ యాత్రకు తొలి అడుగు. అక్కడి వేదమంత్రాల స్వరఝరి జీవితాన్ని నాదమయం చేస్తుంది. గంటానాదాల తరంగాలు అంతరంగాన్ని పునీతం చేస్తాయి. విరాట్మూర్తికి ఇచ్చే హారతి భక్తుడి గుండెల్లో గూడుకట్టుకున్న అనంత నిశిని రూపుమాపుతుంది. ఆలయ కుడ్యాలపై నిలిచిన దేవతా శిల్పాలు.. మనోఫలకంపై మరోచరిత్రకు నాందీవాక్యాన్ని లిఖిస్తాయి. ఆలయ గోపురం అద్భుతం. ఆలయ శిఖరం మహాద్భుతం. గర్భాలయంలో నిలిచిన దైవరూపం పరమాద్భుతం.
అలాంటి పరమాద్భుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కోకాపేట-నార్సింగి మధ్య గోష్పాద క్షేత్రంలో సాక్షాత్కరించనుంది. తరతరాలుగా ఆలమందలకు ఆలవాలమైన నందగోకులాన్ని మరిపించే నెలవులో శ్రీనివాసుడి కొలువు నిర్మాణానికి నేడే సుముహూర్తం. ఈ ఆలయ సమూహంలో వేంకటేశ్వరస్వామి-పద్మావతి జంటకు తోడుగా రాధాకృష్ణుల మందిరమూ రానుంది. హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 అంతస్తులు, 400 అడుగుల ఎత్తున్న రాజగోపురంతో తెలంగాణ సంస్కృతి, భారతీయ వైభవాన్ని పుణికిపుచ్చుకొని శ్రీనివాస క్షేత్రం ఇల వైకుంఠపురిగా అలరారనుంది. ‘హెరిటేజ్ టవర్’గా తెలంగాణకు తలమానికంగా నిలవనున్న ఈ సన్నిధానం.. మనిషి మస్తిష్కాన్ని తొలిచే ఎన్నో సవాళ్లకు సమాధానం అంటున్నారు హరేకృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్యగౌర చంద్రదాస. సనాతన ధర్మంలో ఆలయ విశిష్టత, హెరిటేజ్ టవర్ నిర్మాణంపై ‘చింతన’తో ఆయన పంచుకున్న విశేషాలు ఇవి..
మనసు ఎన్నిటిని పట్టుకున్నా.. ఆలయంలోకి వెళ్లే వరకే! భగవానుడి భవ్యమందిరంలోకి అడుగుపెట్టింది మొదలు నేత్రాలు ఆత్రంగా దేవుడి రూపానికి అంకితమవుతాయి. ప్రాంగణంలో ప్రతిధ్వనించే వేదనాదాలను చెవులు రిక్కించి వింటాయి. చేతులు భగవత్ సేవలో పాలుపంచుకుంటాయి. పాదాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణకు పదపదమంటాయి. సంకల్ప వికల్పాలలో కొట్టుమిట్టాడే మనసును కాదని ఇంద్రియాలు భగవత్ సేవలో తరిస్తుంటాయి. కట్టెదుర వైకుంఠవాసుని దివ్యమంగళ రూపం ద్యోతితమయ్యే వరకే మనసుతో పేచీ! ఒక్కసారి జ్యోతిర్మయ కాంతిపుంజంలా వెలిగిపోతున్న దైవ స్వరూపం ఎదురుపడగానే మనసు నిశ్చలానందాన్ని పొందుతుంది.
బ్రహ్మానందం కోసం పరితపిస్తుంది. ఇలాంటి ఆనందం కలగాలంటే ఆలయ సందర్శనమే దగ్గరి దారి. ఏండ్లకేండ్లు తపస్సు చేసేది తను నమ్మిన దైవాన్ని దర్శించుకోవడానికే! ఆ దైవమే అర్చామూర్తిగా ప్రాణప్రతిష్ఠితమై ఉన్న ఆలయానికి వెళ్లడానికి కఠోర తపస్సు చేయాల్సిన పనిలేదు. దేవాలయానికి దారితీస్తే చాలు. తన దరికి వచ్చిన భక్తుడిని ఉద్ధరించడం ఇక దైవం పని. అందుకే మన పూర్వికులు ఊరూరా ఆలయాలు నిర్మించారు. ఆగమ శాస్త్ర బద్ధంగా గుళ్లూ, గోపురాలు కట్టించారు. వాటిని విద్య, విజ్ఞానం అందించే కేంద్రాలుగా తీర్చిదిద్దారు. అలాంటి మహోన్నతమైన ఆలయమే గోష్పాద క్షేత్రంలో నిర్మించాలని సంకల్పించింది హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ. కృష్ణతత్తాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన, చేస్తున్న ఈ ఆధ్యాత్మిక సంస్థ తిరుమల శ్రీనివాసుడి ప్రతిరూపాన్ని తెలంగాణ రాజధానిలో ప్రతిష్ఠించనుంది. బృందావన రాధాకృష్ణులనూ కొలువుదీర్చనుంది.
జగద్గురువు శ్రీకృష్ణుడి లీలలు భారతావనికి సుపరిచితాలే! ఆ యుగపురుషుడి తత్తాన్ని, భారతీయ సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచదేశాలకు పరిచయం చేసిన మహనీయుడు హరేకృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదుల వారు. ఏడు పదుల వయసు దాటాక మనో సంకల్పంతో దేశదేశాలూ తిరిగి గోపాలుడి గొప్పదనాన్ని ప్రచారం చేశారు ఆయన. 70వ దశకంలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. స్వామిని చూసినప్పుడు గోకులంలో గోపాలకృష్ణుడిగా భావించారు ఆయన. కొన్నాళ్లకు హైదరాబాద్ వచ్చారు శ్రీల ప్రభుపాద. సుమారు రెండు నెలలపాటు ఇక్కడే ఉన్నారు. మనిషి ఇక్కడున్నా.. మనసు మాత్రం ఆనంద నిలయంలోని నంద నందనుడిపైనే ఉండిపోయింది. కొండలలో నెలకొన్న కోనేటిరాయుడి ప్రతిరూపం ఈ హైదరాబాద్‌లోనూ ప్రతిష్ఠించాలని శిష్యులకు చెప్పారు. తపోధనుల సంకల్పం నెరవేరకుండా ఎలా ఉంటుంది? హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో శ్రీల ప్రభుపాదుల సంకల్పం ఐదు దశాబ్దాల తర్వాత ఇదిగో అపురూప ఆలయ రూపంలో నెరవేరుతున్నది.
ఈ మహోన్నత కట్టడం ఓ ఆలయం మాత్రమే కాదు. నార్సింగి సమీపంలో ఇప్పటికే ‘అక్షయపాత్ర’ నెలకొల్పిన భారీ పాకశాల నుంచి రోజూ వేలాది మంది ఆకలి తీరుతున్నది. మానవ సేవతో పునీతమైన ఆ పుణ్యస్థలికి రావాలని మాధవుడే సంకల్పించుకున్నాడేమో! అక్షయ వరప్రదాత అయిన శ్రీనివాసుడు పద్మావతీదేవి సమేతంగా వచ్చి కొలువుదీరుతున్నాడు. బాలాజీకి అన్నీ భారీగానే ఉండాలి కదా! అందుకే బృహత్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది హరేకృష్ణ మూవ్మెంట్ సంస్థ. శ్రీకృష్ణ గోసేవా మండలి సహకారంతో స్థల సేకరణ క్రతువు ఇప్పటికే ముగిసింది. సుమారు రూ.200 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఆలయం ఐదేండ్లలో పూర్తికానుంది. నిర్మాణపరంగా ఇదో అద్భుతంగా నిలిచిపోనుంది.
ఈ ఆలయంలో ప్రతిష్ఠితమయ్యే దేవుళ్లతోపాటు అణువణువూ ప్రత్యేకత ఉట్టిపడేలా ప్రణాళికలు రూపొందించారు. భారతావనిలో ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్న ఆలయాల స్ఫూర్తితో, అవన్నీ ఇక్కడ ప్రతిబింబించేలా నిర్మాణం ఉండబోతున్నది. ‘హెరిటేజ్ టవర్’ పేరుతో నిర్మిస్తున్న రాజగోపురం తెలంగాణ ఆధ్యాత్మిక సంపదకు తలమానికంగా నిలవనుంది. సకల కళలకూ కాణాచిగా ఈ క్షేత్రాన్ని తీర్చిదిద్దనున్నారు. ఆలయానికి అనుబంధంగా నిర్మించే గీతా భవనాలు, కళా నిలయాలు, గ్రంథాలయాలు, శాస్త్ర సందర్శనశాలలు.. జ్ఞాన భాండాగారాలై భక్తిభావం పెంచడంతోపాటు ఆలయానికి వచ్చిన వారికి సామాజిక స్పృహను, సేవాభావాన్ని పెంచుతాయి అనడంలో సందేహం లేదు.
గోష్పాద క్షేత్రంలో ప్రతిష్ఠితం కానున్న శ్రీనివాసుడికి తిరుమల తరహా కైంకర్యాలు నిర్వహించనున్నారు. సుప్రభాత సేవ మొదలుకొని పవళింపు సేవ వరకు ఆనంద నిలయుడికి జరిగే సేవలన్నీ ఈ స్వామికీ చేయనున్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. పవళింపు సేవ తర్వాత హెరిటేజ్ టవర్‌పై స్వామి లీలలను తెలిపే హాలోగ్రామ్ డిస్ప్లే ద్వారా కన్నులవిందు చేయనున్నారు.