తిరుపతి : ఈనెల 4న శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా టీటీడీ ( TTD ) ఆధ్వర్యంలో గోకులాష్టమి వేడుకలను ( Gokulashtami celebrations ) స్థానిక ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణస్వామివారి ఆలయం, తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, కపిలతీర్థం వద్దనున్న వేణుగోపాలస్వామివారి ఆలయం, నారాయణవనంలోని కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ, వాహనసేవ, గోపూజ, గోకులాష్టమి ఆస్థానం తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరగనున్నాయని పేర్కొన్నారు. సెప్టెంబరు 5న ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు.
దయం 9 గంటలకు శ్రీ కృష్ణస్వామివారి వీధి ఉత్సవం, సాయంత్రం 5 గంటలకు ఉట్లోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు. గోకులాష్టమి, ఉట్లోత్సవాల సందర్భంగా రెండు రోజుల పాటు టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు.