భగవంతుడు చాలా ఉదారుడు. ఆ గదాగ్రజు- విష్ణుని కర్మలు- లీలలు కూడా సదా ఉదారాలే! తన శక్తికి మించి ఇచ్చేవానిని ఉదారుడని అంటారు. భగవల్లీలలు, చరిత్రలు సాక్షాత్- స్వయం లీలాపతి- భగవంతుడే ఇవ్వగల ఔదార్య శోభితాలు. సేవకుడు స్వామినే దానమిచ్చినట్లు, భగవచ్చరిత్రలు భగవంతునే దానమిస్తాయి. భగవల్లీలానుసంధానం భగవంతుని భక్తుని హృదయంలో బంధిస్తుంది. భగవంతుని ‘మనసా’- మానసికంగా దర్శించడమే ధ్యానం. భక్తుడు ‘తనది’ (మమ)తోపాటు ‘తన్ను’ (అహం) కూడా సమర్పణ గావిస్తే భగవంతుడు వెన్నుడు కూడా తన్ను తాను భక్తునికి ఇచ్చుకొంటాడు.
కుచేలుడు ఇల్లాలితో ఇలా పలికాడు.. అయినా, నేను ద్వారక వెళితే ‘ఈ బాపడు ఊరక రాలేదు, బిచ్చానికి వచ్చాడ’ని అంటారు. శ్రీపతిని- భగవంతుని ఏమీ అడిగి పుచ్చుకోరాదని నా ప్రతిన- వ్రతం. భార్య- ‘స్వామీ! నేను అర్థించడానికి పంపడం లేదు. ఆ వాసుదేవుడు వేల కన్నులు కలవాడు. నిన్నేల ఉపేక్షిస్తాడు? కేవలంగా దర్శనం చేసుకురండి’. కుచేలుడు జ్ఞానీభక్తుడు- ఆయనది జ్ఞానంతో కూడిన భక్తి. ధనం, యశోధనం- ప్రతిష్ఠ జ్ఞానానికి ఫలాలు కావు. పరమాత్మ ప్రాప్తియే జ్ఞానఫలం. కుచేలుడు తన విద్యను ధనార్జనకు, భోగానుభవానికి కాక, దినమంతా భగత్సేవకే వినియోగించేవాడు. అయాచితంగా వచ్చేది అమృత సమానం కాన అయాచిత వ్రతాన్ని పాలించేవాడు. ఇంటిపట్టునే ఉంటూ ప్రతి దినం ద్వారకలోని నందుపట్టిని- ఆ తామరకంటి (కమలాక్షు)ని కంటూ ఉండేవాడు.
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా!కం॥ ‘అని చెప్పిన నమ్మానిని సునయోక్తుల కలరి భూమి సురుడా కృష్ణుం గన నేగుట యిహపర సా ధనమగునని మదిదలంచి తన సతితోడన్’
ఇలా పలికిన ఇల్లాలి మాటలకు అలరి (సంతోషించి) కుచేలుడు, ‘కృపానిధియైన ఆ కృష్ణ దర్శనం ఇహపర సాధకమని తలచి, శ్రీనివాసునికి సమర్పించడానికి ఏదైనా ఉపాయనం- కానుక మన ఇంట ఉన్నదా?’ అన్నాడు. ఇరుగుపొరుగిళ్ల నుండి నాలుగు పిడికిళ్ల అటుకులు అడిగి తెచ్చి ఆ చేడియ- వామాక్షి అతని చినిగిన ఉత్తరీయపు కొంగులో ముడివేసి, నెయ్యమున- ప్రేమతో వడిగా పయనానికి సిద్ధం చేసింది. చినిగిన ధోవతి, చేతిలో కర్ర, చంకలో అటుకుల మూట- పుష్య శుద్ధ సప్తమి నాడు కుచేలుడు కృష్ణ దర్శనానికి ద్వారక బాటపట్టాడు. విపరీతమైన చలికి వణుకుతున్నాడు. ద్వారక తరలి వెళ్తున్న కుచేలుని మనసులో చెలరేగిన తలపులను పోతన తన సీస పద్యంలో ఇలా అలవోక- స్వేచ్ఛ, లీలగా ఘనంగా వర్ణించాడు…
సీ॥ ‘ద్వారకా నగరంబు నేరీతి జొత్తును? భాసురాంతఃపురవాసి యైన య ప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగి దర్శింపగలనొ? తద్దారపాలు రెక్కడి విప్రుడ? విందేల వచ్చెద? వని యడ్డపెట్టిరే నపుడు వారి కేమైన బరిదానమిచ్చి చొచ్చెదనన్న నూపింప నర్థశూన్యుండ నేను’ తే॥ ‘నయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టి గాక తలపోయగా నొండు గలదె? యాతడేల నన్ను నుపేక్షించు; నేటిమాట?లనుచు నా ద్వారకాపుర మతడు సొచ్చి’
“ఇంతకూ నేను ఎంతో దూరాన ఉన్న ద్వారకా నగరంలోని కృష్ణుని చెంతకు ఎలా చేరగలను? దివ్యకాంతులతో విరాజిల్లే అత్యంత ప్రభావవంతమైన అంతఃపురంలో నివసించే కంసాంతకుని ఎలా చూడగలను? ఒకవేళ, ద్వారపాలకులు ‘నీవెక్కడి విప్రు- బాపడవు? ఇక్కడికెందుకు వచ్చావ’ని నన్ను అడ్డుకుంటే, వారికేమైనా పరిదానం- బహుమానం ఇద్దామన్నా నేను చేతిలో చిల్లిగవ్వ కూడా లేని కటిక దరిద్రుణ్ని. అయినా, ఏమిటీ నా ఈ పిచ్చి? ఎందుకు సంశయం? నా భాగ్యం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఎంత ఆప్తమిత్రుణ్నైనా నా ప్రాప్తం, ఆయన అనుగ్రహం, అంతా ఆ కంతజనుడే- కృష్ణుడే చూచుకుంటాడు. స్వామి నన్నేల ఏలుకోడు?” ఇట్టి అనన్య చింతనమే అనుగ్రహ సాధకం. ఇలా తలుస్తూ కుచేలుడు, ఎవరో చెయ్యి పట్టుకొని సాయం చేస్తూ తీసుకువెళితే వెళ్లినట్టుగా నగరంలో ప్రవేశించి, రాజమార్గాన్ని బట్టి ముందుకుసాగి, కొన్ని వీధులు దాటి అంతఃపురం చేరి, అక్కడ పదహారువేల కాంతలకు చెందిన, బంగారు మణిమయ గోపురాలతో అందాలు చిందే సమున్నత సౌధాలను ప్రాసాదాలను చూచి పరమానందం చెందాడు. కన్నుల నుంచి ఆనంద బిందువులు చిందాయి. అందు ఒకానొక మందిరంలో సుందరులైన మగువలు వింజామరలు వీస్తూండగా, మృదువైన హంసతూలికా తల్పంపై రాకేందువదన రుక్మిణీ సతీమణితో సరస వినోదాలలో తేలియాడుతున్న దివ్య సౌందర్యరాశి, మన్మథ మన్మథుడైన వాసుదేవుని వీక్షించాడు…
సీ॥ ‘ఇందీవర శ్యాము, వందితసుత్రాము,గరుణాలవాలు, భాసుర కపోలు గౌస్తుభాలంకారు, గామిత మందారు, సురుచిర లావణ్యు, సురశరణ్యు హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు,ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను, గౌశేయ పరిధాను, బన్నగ శయను, నబ్జాతనయను’ తే॥ ‘మకరకుండలసద్భూషు, మంజుభాషు నిరుపమాకారు, దుగ్ధసాగర విహారు భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణు, గృష్ణు’
కోమలమైన నల్లకలువల వంటి శ్యామల వర్ణంతో శోభిల్లువాడు, ఇంద్రాదిదేవతలచే వందింప- పూజింపబడువాడు, కరుణావరుణాలయుడు- కృపా సాగరుడు, మిక్కిలి ప్రకాశించు చెక్కిళ్లు గలవాడు, కౌస్తుభమణిచే అలంకృతుడు, అర్థులకు కల్పవృక్షం వంటి వాడు, భువన సుందరుడు, సురు(దేవత)లకు శరణ్యుడు, సింహ మధ్యముడు- సింహం నడుము వంటి సన్నని నడుము కలవాడు, సకల లోకాలచే ఆరాధింపబడువాడు, అవక్ర- ఘనమైన చక్రాయుధం కలవాడు, అన్ని లోకాలలో పేరెన్నిక గన్నవాడు, గరుడ వాహనుడు, పీతాంబరధారి, పన్నగేశుని- ఆదిశేషునిపై శయనించువాడు, అరవిందాక్షుడు, మకరకుండల భూషణుడు, మంజు- మధుర భాషణుడు, అసదృశ- సాటిలేని మేటి సౌందర్యవంతుడు (శృంగార రత్నాకరుడు), క్షీర సాగరంలో విహరించువాడు, సర్వ సుగుణ సాంద్రుడు- సకల కల్యాణగుణ శోభితుడు, యాదవ వంశమనే సముద్రానికి చంద్రుడు, సర్వవ్యాపకుడు, దివ్య తేజశ్శాలి, జయశీలి, సహనానికి ప్రతిరూపుడూ- మారుపేరూ, సర్వజీవ ఆకర్షకుడూ అయిన శ్రీకృష్ణచంద్రుడు కుచేలునికి దర్శనమిచ్చాడు. అమూలకమైన ఈ అంత్యప్రాసల దరహాస విలాసాల అమూల్య సీస పద్యంలో భక్తకవి వతంసుడు పోతన కుచేలునితో తాదాత్మ్యం చెంది, కృష్ణుని సగుణ, సాకార స్వభావ, ప్రభావ వైభవాన్ని ఇరవై ఏడు విశేషణాలతో వర్ణించి, నక్షత్ర హారతి ఇచ్చి అక్షరమూర్తిని అర్చించి, ఆంధ్రభారతిని అలరించాడు.
కుచేలుడు కాంచనచేలుణ్ని- కృష్ణుణ్ని సమీపించాడు. పరమ భాగవతుని చూచి పరమాత్మ కూడా పరవశించి గబగబా పాన్పుదిగి ఎదురొచ్చాడు. ఎలా? ‘దళత్కంజాక్షుడై!’ అద్భుత, అపూర్వ ప్రయోగం! అప్పటి వరకు కంజాక్షుడు- పద్మనేత్రుడు, కానీ, ఇప్పుడు దళత్ కంజాక్షుడు (బాగా వికసించి విప్పారిన కళ్లు కలవాడు) అయ్యాడు. అశ్రాంత- నిరంతర దరిద్ర పీడితుడు, కృశించిన అవయవాలవాడు, చినిగిన వస్ర్తాలు కలవాడు, హాస్యానికి నిలయ-స్థానమైనవాడు, అయినా ఘన తృష్ణాతురచిత్తుడు- మిక్కిలి ఆశతో నిండిన ఆత్రమైన మనస్సు గలవాడు- ఇట్టి బాల్యమిత్రుని కని ఆనందంతో పాటు ఆందోళన, ఆశ్చర్యం కలుగగా లౌల్యం- బిత్తరపాటుతో ఉత్తరుని- కృష్ణుని రెండు కళ్లూ విప్పారాయి. ఏమిటీ ఘన తృష్ణ? ధన తృష్ణే అయితే ఆ మహానుభావునికి అదెంత ఘనం? ‘ధనమధనం’ అని శాస్త్రం. ధనం ధనమే కాదట! ‘విద్యాధనమేవ ధనమ్’- విద్యయే, బ్రహ్మవిద్యయే వాస్తవ ధనమట! అది పుష్కలంగా ఉన్నవాడే విద్వాంసుడు. ఇది కృష్ణదర్శన తృష్ణ. ధన తృష్ణ కాదు, ఘనశ్యామ తృష్ణ! అచ్యుత భగవానుడు అకించిన విత్తుడు- దరిద్ర నారాయణులకు- దీనులకు ధనతుల్యుడు, అకించనులే- దీనులే ధనంగా కలవాడు. అందుకే కుచేలుని బ్రహ్మరథం పట్టాడు, రాజోపచారాలు చేశాడు. లోకం మనిషి కోక- వలువ (వస్ర్తా)లను, ఆస్తి అంతస్తుల్ని- రూకలను చూసి విలువ ఇస్తుంది. కాని, లోకనాథుని- శ్రీకాంతుని పోకడే (తీరే) వేరు. ఆయన ఏకాంత భక్తుల అంతరంగాన్ని- హృదయాన్ని మాత్రమే అవలోకిస్తాడు.
శుకయోగి- రాజా!
కం॥ ‘కరమర్థి నెదురుగా జని పరిరంభణ మాచరించి, బంధు స్నేహ స్ఫురణం దోడ్తెచ్చి, సమా దరమున గూర్చుండ బెట్టె దన తల్పమునన్’
అచ్యుతుడు అత్యంత ఆదరాభిమానాలతో ఇష్టసఖునికి ఎదురుగా వెళ్లి, అతణ్ని గాఢంగా ఆలింగనం చేసుకొని, స్నేహబంధాన్ని స్మరించి అనురాగం అతిశయించేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొని వచ్చి, ఆ బక్కచిక్కిన బాపని తన పక్క- పాన్పుపైనే కూర్చుండబెట్టాడు. తరువాత, పురుషోత్తముడు ప్రేమతో బంగారు కలశంలోని జలంతో అతని పాదాలు కడిగాడు. ‘పునాతు మాం బ్రాహ్మణ పాద పాంసవః’ (ఈ బ్రాహ్మణుని పావన పాదరేణువులు నన్ను పవిత్రం చేయుగాక)- అంటూ ఆ సలిలాన్ని భక్తితో తన శిరసుపై చల్లుకున్నాడు. జీవుడు తన జీవత్వాన్ని- అహంతను పరిత్యజిస్తే, ఈశ్వరుడు కూడా తన ఈశ్వరత్వాన్ని ప్రక్కకు పెట్టేస్తాడు. అన్ని తెరలూ తొలగిపోయాయి. అరమరికలు- భేదాలు లేక అన్ని ఆవరణలు భంగమైపోయాయి.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006