అన్ని ఆచారాలకూ, ఆధ్యాత్మిక సాధనలకూ రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి మనసును అదుపులో పెట్టుకోవడం. రెండు మనోవికారాలు లేకుండా పరమానందంలో ఓలలాడటం. అందుకు మూడు మార్గాలున్నాయి. అవి భక్తి, జ్ఞాన, కర్మ మార్గాలు. వీటిలో భక్తి మార్గం అన్నింటి కన్నా సులభమైంది. మనోవాక్కాయాల ద్వారా భగవంతుణ్ని భజించటమే భక్తిమార్గం. ఆ సాధనే భక్తియోగం. మనసుతో భజన చేయడమంటే సర్వదా ఆయన గురించి ధ్యాన, చింతనల్లో మునిగితేలడం. ఆయన లీలలను స్మరించడం. ఇక వాక్కులతో భజించటమంటే ఆయన స్తోత్రాలు పఠించడం, నామగుణ కీర్తనలు ఆలపించడం. కాయం అంటే శరీరం. ఆ కాయంతో భజన చేయడం అంటే రెండు చేతుల ద్వారా ఆయనను పూజించడం, పాదాలతో ఆయన నెలవులైన పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం. చెవులతో ఆయన మాహాత్మ్యాన్ని, మధుర నామ ప్రాభవాన్ని వినడం, కండ్లతో ఆయన ప్రతిమను తనివితీరా వీక్షించడం.
భగవంతుడి రూపం గురించి ధ్యానం చేస్తే..
ఆ రూపం మానసికం కావచ్చు. భౌతికమైనా కావచ్చు. దీని వల్ల మనసు వేగం తగ్గుతుంది. కొంతకాలానికి అదుపులోకి వస్తుంది. అస్థిరాలైన బాహ్యవిషయాల్లో లభించని విశేషమైన ఆనందమూ ఆ రూపధ్యానంలో లభ్యమవుతుంది. అంతే కాకుండా జ్ఞానార్జనకూ భక్తియోగమే తోవ చూపుతుంది. అందుకే ‘భక్తి లేకుండా జ్ఞానం కలగడం అసంభవం. పరిపూర్ణమైన భక్తి పరమజ్ఞానంతో ముగుస్తుంది’ అంటారు రమణ మహర్షి. మనిషి భక్తియోగంలో పరిపక్వతను సాధించినప్పుడు సర్వే సర్వత్రా పరిపూర్ణతను దర్శిస్తాడు. ఎవ్వరిలోనూ లోపాన్ని చూడలేడు. ఏ ఒక్కరితోనూ కటువుగా మాట్లాడడు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు మూర్ఖంగా వాదోపవాదాల్లోకి దిగడు. ఓర్పు, కరుణ కలిగి ఉండటం, అన్ని ప్రాణులతో సమభావం, అజాత శత్రువై, పరమశాంతంగా ఉండటమే భక్తియోగ సాధనకు అర్హతలు. అమిత ఔదార్యం, సరళత్వం లేకుండా భగవంతుడికి చేరువకాలేం.
భక్తులైన వాళ్లలో కనిపించే మరో రెండు విశేష లక్షణాలు నిర్విచారం, నిర్భీతి. వారు దేనికీ బాధపడరు. వేటికీ భయపడరు. అలాంటి భావనతోనే ‘రాముని వారము, మాకేమి విచారము! స్వామీ నీదే భారము, దాశరథీ జీవాధారము!’ అంటాడు భద్రాచల రామదాసు ఆ శ్రీరామచంద్రుడిని సంకీర్తిస్తూ! మనం దేని గురించైతే ధ్యానిస్తామో, అదే స్వభావాన్ని సంతరించుకుంటాం. రాత్రింబవళ్లు ఆ భగవచ్చింతన వల్ల దైవీ స్వభావమే కలుగుతుంది. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానం, ధైర్యం, శక్తి లభిస్తాయి. అటువంటి వారు ఎప్పుడూ అపారమైన సంసార దుఃఖాన్ని అనుభవించరు. ‘మనదంటూ ప్రత్యేకత ఏమీ లేదు. అందరమూ ఆయన చేతిలో కీలుబొమ్మలమే’ అన్న అకర్తృత్వ స్ఫురణ పొటమరిస్తుంది. శరణాగతి, శాంతి, దయ, దాక్షిణ్యం, వినయం, నిబ్బరం తదితర ఉత్తమ గుణాలు భక్తి అనే కల్పవృక్షానికి కాసే మధుర ఫలాలు.