అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో రాములవారి గుడి ఉంది. ఆ గుడిలో రాములవారి పట్టాభిషేక పటం మాత్రమే ఉంది. ఊర్లోవాళ్లందరూ ఆ పటానికే పూజలు చేసేవారు. ఊరి పెద్దకు ఆ గుడిలో రాములవారి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపించింది. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ఇతర గ్రామ పెద్దలతో మాట్లాడాడు. మంచి పనికి దేవుడే దారి చూపిస్తాడని, అందరం కలిసి కార్యక్రమం విజయవంతం చేద్దామని వారు ప్రోత్సహించారు. గ్రామ పెద్దలందరూ కలిసి విరాళాల కోసం బయలుదేరారు. రైతులు, వ్యాపారస్తులు తమ శక్తి కొలది విరాళాలు ఇచ్చారు. చివరిగా ఊర్లోని షావుకారును కలిశారు. ‘పటానికి పూజ చేస్తే సరిపోతుంది కదా, ఖర్చు పెట్టి విగ్రహం చేయించడం, దానికి పూజలు చేయడం అవసరమా?’ అని ప్రశ్నించాడు షావుకారు. ఊరి పెద్ద చిన్న నవ్వు నవ్వి పటానికి పూజలు చేయడానికీ, విగ్రహానికి పూజలు చేయడానికీ చాలా తేడా ఉంటుంది.
బంగారు పళ్లెం కైనా గోడ దాపు ఉండాలి. లేకుంటే బంగారు పళ్లెమైనా పడిపోతుందన్న విషయం తెలిసిందే కదా. పటం కన్నా గుడిలో విగ్రహం ఉంటే నిత్య పూజలు జరుగుతాయి. ప్రతిష్ఠించిన విగ్రహంలో రాముడున్నాడనే నమ్మకం వల్ల భక్తి భావన పెరుగుతుంది. తమ కష్టసుఖాలు రాములవారితో పంచుకుంటారు. ఊర్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. గ్రామస్తులకు దైవ సాన్నిధ్యం భావన పెరుగుతుంది. మంత్రోచ్ఛారణ, గంటల శబ్దం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అంతేకాకుండా గుడి అభివృద్ధి అయితే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వచ్చి పూజలు చేసి వెళ్తారు’ అని వివరించాడు. గ్రామ పెద్ద మాటలు షావుకారును ప్రభావితం చేశాయి. ‘నేల పూలు సరిగా కనిపించవు, చెట్ల పూలు బాగా కనిపిస్తాయి, పటంకన్నా విగ్రహమే మంచిదని’ గుర్తించాడు షావుకారు. విగ్రహానికయ్యే ఖర్చు తానే భరిస్తానని ముందుకు రావడంతో ఆశ్చర్యపోవడం గ్రామ పెద్దల వంతయ్యింది. ఏడాదికంతా ఊర్లో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ రంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం చుట్టూ ప్రజలు కూడి సామూహిక భజనలు చేశారు.