వాకిట ముగ్గు.. గడపకు పసుపు.. అరచేతుల్లో గోరింటాకు.. నుదుటన బొట్టు.. సంప్రదాయం మనకు నేర్పిన సంస్కారాలు ఇవి. వీటిని గుడ్డిగా పాటించే నియమాలు అని కొట్టిపారేయొద్దు! ఎన్నో శాస్త్రీయ అంశాలను పరిశోధించి ఈ కట్టు, బొట్టు, వ్యవహారాలను నిర్ణయించారు మన పూర్వీకులు. అనాదిగా వస్తున్న ఈ ఆచారాల్లో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. నమస్కారంలోనూ ఓ ఆరోగ్య సూత్రం కనిపిస్తుంది. కూర్చునే పద్ధతి వెనుకా ప్రత్యేక కారణం వినిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నమ్మకాల పేరిటో, పెద్దల బలవంతం మీదో మనం పాటిస్తున్న ఆచారాలన్నీ శాస్త్రీయ సమాహారంగా మన జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంటాయి.
ప్రతిజాతికీ ఒక ప్రత్యేకమైన జీవన విధానం, సంస్కృతి ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు, విలువల ప్రాతిపదికన సంస్కృతి ఏర్పడుతుంది. పరంపరంగా ఆచరించే పద్ధతులు సంప్రదాయాలుగా నిలిచి జాతి విలువలను పెంచి పోషిస్తుంటాయి. నమ్మకాల ప్రాతిపదికగా అనాదిగా వస్తున్న ఆచారాలను గుడ్డిగా ఆచరించే వారు కొందరైతే, వాటి ఆంతర్యాన్ని గ్రహించి ఆచరించేవారు కొందరు. భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు.. భౌతిక ఆధ్యాత్మిక జీవన వికాసానికి ప్రాధాన్యమిస్తూ, రెండిటినీ సమన్వయం చేస్తూ ప్రగతి, సుగతులను ప్రసాదిస్తాయి.
భౌతిక జీవనంలో వస్తుగత ప్రగతి సమగ్ర విశ్వవిజ్ఞాన సాధనకు, దర్శనకు అనుకూలం కాక పంచేంద్రియాలతో గుర్తించిన అంశాలకు మాత్రమే పరిమితమై ఆ విజ్ఞానం మాత్రమే సత్యమని అంటుంది. భారతీయ రుషి సంతతి ఈ పంచేంద్రియజ్ఞాన పరిమితులతోపాటుగా వాటికి అతీతమైన విషయాలను కూడా దర్శించింది. మానవాళికి ఏది సమగ్రమైన జీవితాన్ని అనుగ్రహించగలదో దానిని ఆవిష్కరించే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో కొన్ని ఆచారాలను మనజాతికి అందించారు మన రుషులు.
నమస్కారం.. ఆరోగ్య పురస్కారం
ఎవరైనా పెద్దలు వస్తే చేతులు జోడించి నమస్కరించమని ఇంట్లోవాళ్లు చెబుతారు. నమస్కారం గౌరవ సూచకం. అయితే నమస్కరించేటప్పుడు రెండు చేతులనూ జోడిస్తాం. దీనివల్ల రెండు చేతుల్లోని శక్తి కేంద్రాలు కలవడంతోపాటు భావోద్వేగ స్థితిలో అధికంగా విడుదలైన శక్తి.. స్థిరీకరణ చెందుతుంది. ఇద్దరి మధ్యా సకారాత్మక తరంగాలు ప్రసారం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఉదయం సూర్య నమస్కారాల వల్ల శరీరానికి కావాల్సిన ‘డి’ విటమిన్ లభించడంతోపాటు వ్యాయామమూ జరుగుతుంది. కరచాలనం వల్ల ఇన్ఫెక్షన్లు ఎలా ప్రబలుతాయో కరోనా కాలంలో అందరికీ తెలిసిందే!
కాలు మీద కాలు.. కీళ్లకు కీడు
ఆడపిల్లలను కాలుపై కాలు వేసుకొని కూర్చోవద్దని పెద్దలు చెబుతారు. ఇదేదో మహిళలను కట్టడి చేయడానికి చెప్పింది కాదు. వారి మేలు కోసం సూచించినదే! మనుషులలో నడుం కిందిభాగంలో ఉండే రెండు కాళ్లను, శరీరంలో పైభాగాన్ని కలుపుతూ పెద్ద ఎముకలతో ఒక నిర్మాణం ఉంటుంది. ఆ భాగం సాధారణంగా మగవాళ్ల కంటే ఆడవాళ్లకు పెద్దగా, వెడల్పుగా ఉంటుంది. కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నప్పుడు తొడ ఎముక ఒకవైపు లాగినట్టు తిరుగుతుంది. దీనివల్ల మోకాలు భాగంలో, పిరుదుల భాగంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఎముకలు, కండరాల నొప్పులు, కీళ్ల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాలక్రమంలో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్ర పరిశోధనలోనూ తేలింది. అందుకే మహిళలు కాలుమీద కాలు వేసుకోవడం మంచిది కాదని పెద్దలు సూచించారు.
పాపపు పనులు చేయొద్దని, పుణ్యకార్యాలు చేయాలని సూచించింది మన సంప్రదాయం. నిజానికి పాపం అంటే రోగం, పుణ్యం అంటే ఆరోగ్యం. పాపం చేయొద్దంటే రోగాలను తెచ్చే పనులకు దూరంగా ఉండమని, ఆరోగ్యాన్ని ప్రసాదించే కార్యాలను చేయాలని చెప్పడమే దీని వెనుక రహస్యం. అలాగే మంత్రాక్షరాలను ఉచ్చరించడం సంప్రదాయం. నిజానికి ఒక శబ్దాన్ని పలికినప్పుడు దానికి సంబంధించిన 72 కండరాలు పనిచేస్తాయి. వాటి కదలిక నరాలపై తద్వారా రక్త ప్రసరణపై, దానితో గుండెపై ప్రభావాన్ని చూపుతుంది. అందుకే సకారాత్మక ప్రభావాన్ని చూపే అక్షరాల సమూహాన్ని నిత్యం పలకాలని ఉపదేశించారు రుషులు. ఆ అక్షర సమూహాన్నే మంత్రాలుగా వ్యవహరించారు. ప్రణవ నాదమైన ఓం కారం, శివపంచాక్షరి, రామనామం ఇలా ఏ మంత్రమైనా మనసారా ఉచ్చరిస్తే శారీరక శక్తి, మానసిక తృప్తి కలుగుతాయి.
అదుపులో ఆజ్ఞాచక్రం..
భారతీయ సంప్రదాయంలో పసుపు కుంకుమలను సౌభాగ్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పసుపు క్రిమి సంహారిణి. అందువల్లే క్రిమికీటకాదులు ఇంట్లోకి రాకుండా గడపకు పసుపు రాయడం ఆచారమైంది. భ్రూ మధ్యంలో ఆజ్ఞాచక్రం ఉంటుంది. అక్కడ కుంకుమ ధరించడం వల్ల ఆజ్ఞాచక్రం శాంతిస్తుంది. తద్వారా ప్రశాంతత చేకూరుతుంది. అందుకే, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు బొట్టుపెట్టి పంపడం, ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించినప్పుడు బొట్టుపెట్టి పిలవడం ఆచారం. పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలకు పసుపు, కుంకుమలతో సారెపెట్టి పంపడం సంప్రదాయంగా వస్తున్నది. అయితే, పసుపు, కుంకుమ చేజారితే అపశకునంగా భావిస్తారు. అది అపోహ మాత్రమే!
ముగ్గులు.. లక్ష్మణరేఖలు
ఉదయమే ఇంటిముందు కళ్లాపి చల్లి ముగ్గులు వేయడం ఒక ఆచారం. రానురాను పల్లెల్లోనూ ఈ సంస్కృతి తగ్గిపోతున్నది. అయితే, ఈ ఆచారం వెనుక సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ముగ్గు పేరుతో మహిళలు వాకిట దిద్దే చిత్రలిపి ఎంతో కళాత్మకంగా ఉంటుంది. వాకిట ముగ్గులు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా, ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్లకుండా చేస్తాయనేది విశ్వాసం. పద్మాలు, చుక్కల ముగ్గులు… యంత్ర, తంత్ర సమ్మిళితమై శాస్త్ర రహస్యాలతో కూడి, హాని కలిగించే నకారాత్మక శక్తులను దరిచేరనీయవనేది పెద్దల మాట. దీనితోపాటు పేడతో చల్లే కళ్లాపి క్రిమికీటకాదులను అరికడుతుందని శాస్త్రీయంగా రుజువైన అంశమే!
సాధారణంగా మహిళలు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. అలంకరణలో భాగమని భావించినా, దీని వెనుక ఎన్నో ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తుంటాయి. ఇంటిపనుల్లో నిమగ్నమయ్యే మహిళల కాళ్లూ, చేతులు ఎప్పుడూ తడిగా ఉంటాయి. దీనివల్ల వ్యాధుల బారినపడే అవకాశం ఉంటుంది. గోరింటాకు పెట్టుకుంటే చెడు క్రిముల నుంచి రక్షణ కలుగుతుందని ఆయుర్వేదం చెబుతున్నది. అంతేకాదు, గోరింటాకు ఒత్తిడిని, వేడిని తగ్గిస్తుంది. అందుకే వివాహ సమయంలో వధూవరులకు గోరింటాకు పెట్టడం ఆచారమైంది. స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయి.
గోరింటాకు ఆ నాడుల్లో ఏర్పడే అతి ఉష్ణాన్ని లాగేస్తుందని, తద్వారా
గర్భాశయ దోషాలు తొలగిపోతాయని చెబుతున్నది ఆయుర్వేదం.
కల్పవల్లి తులసి
తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి, ప్రదక్షిణలు చేయడం ఆచారంగా ఉండేది. పూజనీయమైన తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు తులసి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. కడుపులోని క్రిములను పారదోలే శక్తి తులసికి ఉంది. కఫం పడుతున్న వ్యాధులను అరికడుతుంది. రక్తంతో కూడిన దగ్గు, కఫం పడుతున్నప్పుడు ప్రతి గంటకూ నాలుగేసి తులసి ఆకులు తింటే సమస్య తగ్గుముఖం పడుతుంది. జీర్ణశక్తికి తులసి చాలా మంచి మందు. నాలుగు తులసి ఆకులు, రెండు మిరియాలు వేసి మెత్తగా నూరి చిన్నమాత్రగా చేసుకొని భోజనానికి అరగంట ముందు వేసుకుంటే, బాగా ఆకలి వేస్తుంది. తిన్నది కూడా జీర్ణమవుతుంది. ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇంటింటా తులసి ఉండాలని మన పెద్దలు నియమం చేశారు. తులసిని నిత్యం పూజించడం అంటే.. రకరకాలుగా ఉపయోగపడే ఆ మొక్కను వాడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమని అంతరార్థం.
– పాలకుర్తి రామమూర్తి