e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 11, 2021
Home చింతన పంచమ పురుషార్థం!

పంచమ పురుషార్థం!

మానవాభ్యున్నతికై వేదాలు ‘ధర్మ, అర్థ, కామ, మోక్షం’ అనే నాలుగు (చతుర్విధ) పురుషార్థాలను నిర్దేశించాయి. మానవ ధార్మిక జీవన గమనానికి పునాదులైన వీటిని ప్రతి ఒక్కరూ విధిగా ఆచరించాలి. ధర్మాచరణ వల్ల క్లేశాల బారిన పడకుండ మనిషి తనను తాను రక్షించుకోగలడు.

యజ్ఞార్థాత్‌ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః

తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర॥

– భగవద్గీత (3.9)

‘పనులను ఒక యజ్ఞంలా, భగవదర్పితంగా ఆచరించాలి. లేకపోతే, అవి మనలను ఈ జగత్తులో కర్మబంధాలలో కట్టివేస్తాయి. ఓ కుంతీపుత్రుడా! నీకు నిర్దేశితమైన విధులను వాటి ఫలితాలపై ఆసక్తి లేకుండా విష్ణు ప్రీత్యర్థమే నిర్వర్తించు’. ‘భగవద్గీత’లోని ఈ నిర్దేశానుసారం మనం ఆచరించే పనులన్నిటినీ యజ్ఞపురుషుడైన విష్ణువు సంతృప్తి కోసం నిర్వర్తించినప్పుడు మాత్రమే కర్మబంధనాల నుంచి మనం విముక్తి పొందగలం. ధర్మాచరణ వల్ల అర్థమూ లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ధార్మికంగా మాత్రమే ధనాన్ని ఆర్జించాలి. అలా ఆర్జించిన ధనాన్ని మరింత విష్ణు భక్తిని పెంపొందించుకోవడానికి ఉపయోగించాలి. ధార్మిక ధనంతో విష్ణువును సేవించటం వల్ల జీవితంలో సుఖాలను ఆస్వాదించగలరు. ఇదే ‘ధర్మబద్ధమైన కామం’.

ఇంద్రియ సౌఖ్యాలను ధర్మబద్ధంగా, శాంతియుతంగా ఆస్వాదించడం సాధ్యమే. సంతాన ప్రాప్తి కోసమే కామాన్ని ఆచరించాలని ‘భగవద్గీత’ సూచించింది. సంతానాన్ని చక్కగా సంరక్షిస్తూ, విష్ణు ప్రీతికోసం నిర్దేశితమైన ధర్మాచరణలను వారికి బోధించాలి. వాస్తవానికి శ్రీకృష్ణుడు ‘భగవద్గీత’లో ‘ధర్మావిరుద్ధో కామోస్మి’ అని సంబోధించాడు. అంటే, ‘ధర్మ విరుద్ధం కాని కామం పట్ల నేను ప్రసన్నుడనవుతాను’. పలు ధార్మిక భోగాలనంతరం చివరికి మోక్షాన్ని పొంది భగవద్ధామమైన వైకుంఠాన్ని చేరాలని భావించడమే అంతిమ పురుషార్థం. విష్ణు ప్రీతి కోసం గడిపిన జీవితం సహజంగానే భగవద్ధామాన్ని చేరే మార్గాన్ని సుగమం చేసి, ఆ సాంగత్యంలో శాశ్వతమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఇదే నిజమైన మోక్షం.

శ్రీచైతన్య మహాప్రభువుల వారు మరో అడుగు ముందుకేసి, ‘ప్రతి జీవుని అంతిమలక్ష్యం దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని పట్ల పరిపూర్ణమైన ప్రేమను పొందటమే’ అంటూ, ‘పంచమ పురుషార్థాన్ని’ వివరించారు. శ్రీల ప్రభుపాదుల వారు దీనినే ‘శ్రీమద్భాగవతం నాల్గవ స్కంద’ వ్యాఖ్యానంలోనూ తెలిపారు. ‘ధృవ మహారాజుచే భగవంతుడు పురుషార్థమూర్తి అంటూ మానవ జీవిత అంతిమలక్ష్యాన్ని’ స్తుతించారు. సాధారణంగా, చతుర్విధ పురుషార్థాలు మతాచారాలుగానో లేదా భౌతికపరమైన వరానుగ్రహం నిమిత్తం భగవంతుని ఆరాధన విధి విధానాలు గానో పరిగణింపబడుతుంటాయి. భౌతిక లాభాపేక్షతో చేసే ప్రార్థనలు ఇంద్రియ ప్రీత్యర్థమే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా తన ఇంద్రియాలను పూర్తిగా సంతృప్తి పరచుకోలేక ఈ భౌతిక జగత్తు నుంచి విముక్తిని ప్రసాదించే మోక్షానికై జీవుడు ఆరాటపడతాడు.

వాస్తవానికి జీవుని అంతిమలక్ష్యం ‘భగవంతుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకోవడమే’. ఇదే ‘పంచమ పురుషార్థం’. అందుకే, శ్రీ చైతన్య మహాప్రభువులవారు ‘మనం భగవంతుణ్ణి భౌతిక సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు, చక్కటి అర్థాంగి వంటి కోర్కెల కోసం ప్రార్థించరాదని’ సూచించారు. ‘కేవలం తన సేవలో సదా నియుక్తులమయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమనే’ మనం ప్రార్థించాలి. ధృవ మహారాజు తనలోని భౌతిక లాభాపేక్ష గుణాన్ని గుర్తించి, దాని కారణంగా తాను భగవంతుని సేవాపథం నుంచి పక్కదారి పట్టకుండా స్వామి రక్షణను కోరుకున్నాడు (శ్రీమద్భాగవతం: 4వ స్కందం). ‘ధర్మ, అర్థ, కామ, మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. కానీ, ‘కృష్ణ ప్రేమ’ అనే పంచమ పురుషార్థం ముందు ఇవన్నీ తృణప్రాయాలే’- (శ్రీచైతన్య చరితామృతం: ఆది లీల- 7.84). కనుక, ప్రతి ఒక్కరూ నిత్యం ‘హరేకృష్ణ’ మంత్రాన్ని జపించడాన్ని నిత్యకృత్యంగా మార్చుకోవాలి.

పంచమ పురుషార్థం!

శ్రీమాన్‌ సత్యగౌర 

చంద్రదాస ప్రభూజి, 

93969 56984

Advertisement
పంచమ పురుషార్థం!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement