పున్నమి వెలుగులో.. సాగు బాటలో.. నేడు ఏరువాక పౌర్ణమి
భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి పుడమి. అందుకే వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు నేలను పూజించి, అవని ఆశీస్సులు అందుకునేందుకు చేసే పండుగే ఏరువాక పౌర్ణమి.
భారతీయ సంస్కృతికి మూలాధారం వ్యవసాయం. వేదకాలం నుంచి నేటి వరకూ కొనసాగుతున్న జీవన విధానమిది. అటువంటి సాగును మొదలుపెట్టడానికి అనువైన సమయం, సాగును బాగుచేయమంటూ భగవంతుడిని, సస్యంలో తమకు సహకరించే వ్యవస్థలను అన్నదాతలు ప్రత్యేకంగా పూజించే పర్వదినం ఏరువాక పున్నమి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున అన్నదాతలు అంగరంగవైభవంగా జరుపుకొనే సాగు సంబురమిది. సస్యానికి సంబంధించి పూజలు చేయడానికి ఎంచుకున్న రోజు ఏరువాక పున్నమి.
భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యంలా, తపస్సులా చేస్తారు. దేశాన్ని సస్యశ్యామలం చేసి, మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి పుడమి. అందుకే వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు నేలను పూజించి, అవని ఆశీస్సులు అందుకునేందుకు చేసే పండుగే ఏరువాక పౌర్ణమి. నిజానికి ఈ పండుగ కర్షకులదే అయినా, అందరి ఆకలి తీర్చే వేడుక కాబట్టి ఇది అందరికీ పండుగే. జ్యేష్ఠ పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉంటాడు. భూమికి, ఓషధులకు అధిపతి అయిన చంద్రుడు సంపూర్ణ కళలతో ఉన్న రోజున భూమిని పూజించడం వల్ల భూసారం వృద్ధి చెందుతుందని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది. కారు పున్నమి, కృషిక పున్నమిగా వ్యవహరించే ఈ పండుగను తెలంగాణలో ఏరొక్క పండుగగా జరుపుకొంటారు. అయినవారిని, ఇతర ఊళ్లలోని బంధువులను ఇళ్లకు పిలుచుకోవడం తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది.
ఆర్థిక సంవత్సరం, విద్యాసంవత్సరం మాదిరిగానే వ్యవసాయపనులు చేసేవారికి ఏరువాక పున్నమి నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. పంట పనులు ప్రారంభించే ముందు తమకు చేదోడువాదోడుగా ఉండే పశువులను పూజించడం, నాగలి, పార, గునపం లాంటి వ్యవసాయ పరికరాలను శుభ్రంచేసి, వాటిని పసుపుకుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లను అలంకరించి వాటి కొమ్ములకు రంగులద్ది, పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత రైతులంతా ఉమ్మడిగా పొలంలో దుక్కులు దున్నే కార్యక్రమం చేపడుతారు. అలాగే, ఏరువాక పౌర్ణమి నాడు రైతులు ఇతరులకు అప్పు ఇవ్వరు. ఎటువంటి పరిస్థితి వచ్చినా అప్పు చేయరు. ఇంటిలోని వస్తువులను బయటికి పోనీయరు. ఈరోజు తాము అప్పు చేసినా, ఇచ్చినా, ఏ వస్తువు బయటకు పోయినా సంవత్సరం మొత్తం తమ గృహంలో దారిద్య్రం తాండవిస్తుందని రైతుల నమ్మకం. ఇక, ఉత్తరభారతంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఉద్వృషభ యజ్ఞం చేస్తారు. ఉద్ధృతం అంటే లేపడం, వృషభం అంటే ఎద్దు. వేసవిలో విశ్రాంతి తీసుకున్న ఎడ్లను వ్యవసాయం కోసం సిద్ధపరిచే కార్యక్రమంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
వేద పురాణేతిహాసాల్లో..
వేదాలు మొదలుకొని పురాణేతిహాసాల్లో వ్యవసాయం గురించి ప్రత్యేక ప్రస్తావన కనిపిస్తుంది. వానలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ నాగలిని, ఎద్దులను పూజించి తొలిసారిగా పొలం దున్నే ప్రక్రియను వేద మంత్రాలతో ప్రారంభిస్తారు. ‘నీటిబండిపై వచ్చే వరుణదేవా.. నీ రథాన్ని భూమిపైకి పంపు’ అంటూ వరుణదేవుడిని పూజించే ప్రత్యేక రోజు ఇది. ప్రధానంగా తొలిసారిగా భూక్షేత్రంలో నాగలిని గుచ్చడానికి ముందు ధరణిపూజ చేయాలని రుగ్వేదం చెబుతున్నది. క్షేత్రపతి సూక్తం, పర్జన్య సూక్తం, పృథ్వీ సూక్తం, గోసూక్తం, అక్ష సూక్తం, అరణ్యాని సూక్తం ఇలా సాగుకు సంబంధించిన ఎన్నో సూక్తాలు రుగ్వేదంలో కనిపిస్తాయి. యజుర్వేదం, తైత్తిరీయసంహితలో వ్యవసాయం మానవ సంక్షేమానికి మూలస్తంభంగా చెప్పింది. అధర్వణవేదం ఏరువాకను అనడుత్సవంగా అంటే ఎద్దుల పండుగగా పేర్కొన్నది. క్షేత్రపాలకుని మంత్రాలతో స్తుతించి నాగలితో భూమిని దున్ని విత్తనాలను చల్లడం వేదంలో చెప్పిన సాగు విధానంలో కనిపిస్తుంది. యజుర్వేద, అధర్వణ వేదాల్లో వ్యవసాయ సమగ్ర భౌతికపద్ధతులు, సాగునీటి విధానాలు కనిపిస్తాయి. పంట సమృద్ధికి, వర్షాల కోసం ఇంద్రుడు, అశ్విని దేవతలు, పర్జన్యుడు లాంటి ప్రకృతి దేవతలను గానరూపంలో స్తుతించే మంత్రాలు సామవేదంలో ఎన్నో ఉన్నాయి. విషు ్ణపురాణంలో ఏరువాక పున్నమిని సీతాయజ్ఞం అని పేర్కొన్నారు. యుగాల వారీగా సాగు ప్రాధాన్యం గమనిస్తే..

- కృతయుగంలో పృథు చక్రవర్తి కాలంలో తొలిసాగుగా దుక్కి దున్ని, విత్తనాలు చల్లి వ్యవసాయం చేయడం ప్రారంభించినట్టు తెలుస్తున్నది.
- రామాయణ కాలంలో వ్యవసాయం అనేది ఆర్థిక వ్యవస్థకు, సమాజ శ్రేయస్సుకు మూలస్తంభంగా ఉండేది. తనను కలవడానికి వచ్చిన భరతుడితో శ్రీరాముడు రాజ్యంలో వ్యవసాయం, పశుపోషణ సరిగ్గా సాగుతున్నాయా అని ప్రత్యేకంగా ఆరా తీయడం ద్వారా వ్యవసాయం ప్రాముఖ్యత ఎంత ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
- ద్వాపర యుగంలో బలరామకృష్ణులు పాడిపంటలకు ఆనవాలుగా నిలిచారు. శ్రీకృష్ణుడు గోపాలకుడై గోసంరక్షణ చేస్తే, బలరాముడు హలం పట్టి సాగుకు బాట చూపారు. మహాభారతం సభాపర్వం ఐదో అధ్యాయంలో నారదుడు ధర్మరాజును ప్రశ్నించే ధోరణిలో ‘రాజ్యంలో అన్నిచోట్లా పెద్ద నీటి చెరువులు కట్టించారా.. కేవలం మంచి వర్షాలు పడుతాయనే ఆశతో వ్యవసాయం చేయలేమ’ని చెప్పడం కనిపిస్తుంది. అలాగే, అనుశాసనిక పర్వంలో భీష్ముడు తన చుట్టూ సమావేశమైన వారికి ఉపదేశమిస్తూ ఆహారం లేకపోతే పంచభూతాలు విచ్ఛిన్నమవుతాయని, ఆహారంమీదే ప్రపంచమంతా ఆధారపడి ఉంటుందని చెప్పడం గమనించవచ్చు.
వ్యవసాయం నిత్యనూతనం..!
పంటలసాగుపై భారతీయ రుషులు ఆనాటి రాజులకు ప్రత్యేక దృష్టితోపాటు సాగు పరిరక్షణకు సంబంధించిన అనేక సూచనలు చేస్తుండేవారు. వరాహమిహిరుడు రాసిన బృహత్సంహిత వ్యవసాయ విజ్ఞాన గ్రంథం. గ్రహగతుల ఆధారంగా వర్షం ఎప్పుడు పడుతుందో అంచనా వేసి అందులో పేర్కొన్నారు. రుతుపవనాల రాకను కూడా లెక్కించే పద్ధతులను ఇందులో వివరించారు. పరాశరమహర్షి రాసిన కృషి పరాశరం ప్రామాణిక వ్యవసాయ గ్రంథంగా పేర్కొంటారు. ఇలా వేదంతో పాటు వేదాంగాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలన్నిటితో పాటు చరిత్రలో కూడా వ్యవసాయానికి సంబంధించిన విశేషాలు ప్రస్తావించాయి. మొత్తంగా సనాతన ధర్మంలో సాగుకు ఇంత ప్రాధాన్యం ఉండబట్టే.. నేటికీ మన దేశం సస్యశ్యామలమై పరిఢవిల్లుతున్నది. ఈ ఏరువాక ఉన్నతంగా సాగాలనీ, పంటలు దండిగా పండాలనీ కోరుకుందాం.
…? రంగనాథ్ మిద్దెల 98665 73461
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

