వ్రతాల మాసం. పండుగల నెల. శ్రీహరి పట్టమహిషి పుట్టిన మాసం. పెండ్లి ముహూర్తాల కాలం శ్రావణం. వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ ఇంటింటా హర్షాతిరేకాలు పెంచే, పంచే నెల ఇది. తెలుగు నెలల్లో శ్రావణం ఐదో మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి సమీపంలో ఉండటంతో ఈ నెలను శ్రావణం అని పిలుస్తారు. శ్రవణా నక్షత్రానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే, విష్ణుమూర్తి అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు భక్తులు.
వేదాలు శ్రావణాన్ని నభో మాసమని పేర్కొన్నాయి. నభస్ అంటే ఆకాశమని అర్థం. వర్షాలు విశేషంగా కురిసే మాసం కావడంతో దీన్ని ‘నభో మాసం’గా పిలిచారు పెద్దలు. వర్షాలు విస్తారంగా కురిసే శ్రావణంలో ప్రకృతిలోని పంచభూత శక్తులు ప్రబలంగా మారుతాయి. కొన్ని సందర్భాల్లో ఇవి విపరీత పరిస్థితులూ కల్పిస్తుంటాయి. ఈ సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తీ కుంటుపడుతుంది.
ఫలితంగా అంటురోగాలు విజృంభిస్తుంటాయి. అందుకే, ప్రకృతిలో వచ్చే వేర్వేరు మార్పులకు అనుగుణంగా, మన శరీరాన్ని మార్చుకునే దిశగా పలు మార్గాలు సూచించారు మన పెద్దలు. అందులో భాగంగా నిర్దేశించినవే వ్రతాలు. ఒకరకంగా చెప్పాలంటే శ్రావణంలో వ్రతం లేని రోజు ఉండదు. ప్రతీ వారం పవిత్రమైనదే. ప్రతీ తిథి ప్రత్యేకమైనదే! వరలక్ష్మీ వత్రం, మంగళగౌరీ వ్రతం, శ్రావణ మాస వ్రతం, శివ వ్రతం, జీవంతికాదేవీ వ్రతం, నరసింహ వ్రతం, ఆంజనేయ వ్రతం.. ఇలా వివిధ తిథి, వారాల్లో నెల పొడవునా నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది. వ్రతం అంటే ‘నియమంతో కూడుకున్నది’ అని అర్థం. ఏడు వారాల్లో ఏడు వ్రతాలు, 16 తిథుల్లో (అమావాస్యతో కలిపి) 16 వ్రతాలు సూచించారు. నాగ పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, పొలాల అమావాస్య ఇలా రకరకాల పండుగలు శ్రావణ వైభవానికి ప్రతీకలుగా నిలుస్తాయి. లోతుగా గమనిస్తే ఈ వ్రతాల ఆచరణలో ఆరోగ్య సూత్రాలు కనిపిస్తాయి.
కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు మొదటి ఐదేండ్లపాటు శ్రావణ మాసం మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. సర్వమంగళ స్వరూపం ప్రకృతి శక్తిని ఆరాధించే విధానం మంగళగౌరీ వ్రతం. వివాహం తర్వాత స్త్రీల శారీరక ప్రకృతులలో వచ్చే మార్పులను సమన్వయం చేసుకోవడానికి ఈ వ్రతం ఒక అవకాశం. వైవాహిక సౌఖ్యాన్ని పెంచుకునే మార్గాన్ని సుగమం చేస్తుంది. వైవాహిక బంధం పవిత్రమై, శాశ్వతం కావడానికి ఈ వ్రతం తోడ్పడుతుంది. అంతేకాకుండా, శరీరంలో సంతాన శక్తిని బాగా పెంచుతుంది. శ్రావణం ప్రతి శుక్రవారం ఇంటింటా మహిళలు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. భృగుమహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది శ్రావణ శుక్రవారం నాడే. పురాణాల ఆధారంగా శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం భృగుమహర్షి ఇంట జన్మించిందని చెప్తారు. ఈ కారణంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం ఘనంగా చేసుకుంటారు. అయితే, శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాల్లోనూ వత్రం ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ వ్రతం ఆచరించినవారికి అష్టలక్ష్ములూ సిద్ధిస్తాయని విశ్వసిస్తారు.
వ్రతాలు, పూజలకే కాదు, ఆధ్యాత్మిక సాధనకూ శ్రావణం ప్రశస్తమైనది. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెప్తాడు పరమేశ్వరుడు. శివుడి అనుగ్రహం కోరుతూ ఈ నెలలో కొందరు శ్రావణ మాస వ్రతం (నక్త వ్రతం) ఆచరిస్తారు. శ్రావణ శుద్ధ పాడ్యమి మొదలు అమావాస్య వరకు వ్రతం కొనసాగిస్తారు. నెల రోజులపాటు ఈశ్వరుడిని ఆరాధిస్తారు. ప్రతిరోజూ పొద్దంతా ఉపవాసం ఉండి, రాత్రి పూట మాత్రమే భోజనం చేస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తూ, నేల పైనే నిద్రిస్తారు. సాధన సంపత్తిని పెంచుకోవడానికి, ఈశ్వర అనుగ్రహం సంపాదించడానికి ఈ వ్రతం చేస్తారు. మొత్తంగా శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, పండుగల ప్రధాన ఉద్దేశం పారమార్థిక చింతనే!
ఎ.భరత్‌కుమార్